Tirumala : తిరుమలలో క్షురకులు ఆందోళన, బారుల తీరిన భక్తులు!
Tirumala : తనిఖీల పేరుతో టీటీడీ విజిలెన్స్ అధికారులు అసభ్యంగా వ్యవహరించాలని తిరుమల క్షురకులు ఆందోళన బాటపట్టారు. దీంతో తలనీలాలు సమర్పించే భక్తులు బారులు తీరారు.
Tirumala : తిరుమలలో కల్యాణకట్ట పీస్ రేట్ క్షురకులు ఆందోళన బాటపట్టారు. గురువారం ఉదయం నుంచి శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న మెయిన్ కల్యాణకట్ట వద్ద నిరసన చేపట్టారు. కొన్నేళ్లుగా ఒక్కో గుండుకు రూ. 15 చొప్పున టీటీడీ చెల్లిస్తున్నా, నెలకి 8 వేల రూపాయలు దాటడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ స్వామి వారి సేవ చేసుకొనే భాగ్యం దక్కిందని విధులు నిర్వహిస్తున్నామని అన్నారు. రానురాను కొందరు అధికారులు తమపై కక్ష్యగట్టి తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తులు వారి తృప్తి కోసం కొంత నగదు ఇచ్చిన, బలవంతంగా లాక్కున్నామనే ధోరణిలో టీటీడీ విజిలెన్స్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనిఖీల పేరుతో ఆడా.. మగ అనే తేడా లేకుండా మొత్తం బట్టలు విప్పదీసి తనిఖీలు చేయడం ఏంటని ఆవేదన చెందుతున్నారు. బస్ పాసు లేకుండా సొంత డబ్బులతో తిరుమలకి చేరుకొని సేవ చేస్తుంటే, ఇలా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.
అసభ్యంగా వ్యవహరించారని ఆరోపణ
తనిఖీల పేరుతో తమతో అసభ్యంగా వ్యవహరించిన విజిలెన్స్ అధికారులపై చర్యలు తీసుకోవాలని తిరుమల క్షురకులు ఆందోళన చేపట్టారు. దీంతో ప్రధాన కల్యాణ కట్టతో పాటు ఇతర ప్రాంతాల్లో తలనీలాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు. తలనీలాలు సమర్పించే భక్తుల వద్ద డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలతో టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు కల్యాణకట్టతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు తమ పట్ల అసభ్యంగా వ్యవహరించారని క్షురకులు ఆందోళన చేపట్టారు. తలనీలాలు తీసే క్షురకుల దుస్తులు విప్పి డబ్బులు ఎక్కడ దాచారంటూ తనిఖీలు చేశారని ఆరోపిస్తున్నారు.
కాంట్రాక్ట్ క్షురకులు ఆందోళన
క్షురకులు ఆందోళనకు చేపట్టడంతో గురువారం ఉదయం నుంచి తిరుమలకు వచ్చే భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. టీటీడీలో దాదాపు 1100 మంది క్షురకులు ఉన్నారు. వీరిలో దాదాపు 750 మంది కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నారు. భక్తుల తలనీలాలు తీసేందుకు టీటీడీ వీరికి రుసుం చెల్లిస్తుంది. అయితే ప్రస్తుతం ఒప్పంద క్షురకులు మాత్రమే ఆందోళనకు దిగారు. పర్మినెంట్ ఉద్యోగులు మాత్రం విధులు నిర్వహిస్తున్నారు. భక్తుల వసతి సముదాయం-1, 2, 3, నందకం, కౌస్తుభం, ఎస్వీ వసతి గృహాల్లో తలనీలాల తొలగింపు నిలిపోయింది. తలనీలాలు సమర్పించే భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. క్షురకులు తక్కువ మంది ఉండటంతో భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.
Also Read : Tirumala: శ్రీవారికి చేసే పూలంగి సేవ ప్రత్యేకత ఏంటో తెలుసా? భక్తుల రద్దీ, హుండీ ఆదాయం వివరాలివీ?