TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నారా? అయితే ఇవి తప్పనిసరి..
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నారా? అయితే ఇవి తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే భక్తులను అనుమతించరు. ఈ మేరకు టీటీడీ వెల్లడించింది.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వెళ్లే భక్తులకు టీటీడీ సూచనలు చేసింది. కరోనా రెండు డోసుల టీకా, 72 గంటల ముందు పరీక్షించుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టులతో పాటు ఆన్‌లైన్ ప్రత్యేక ప్రవేశదర్శనం, సర్వదర్శనం టికెట్లు ఉంటేనే.. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అనుమతి ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. శనివారం స్థానిక అన్నమయ్య భవనంలో బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పలనాయుడు, తితిదే సీవీఎస్‌వో గోపినాథ్ జెట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తితిదే నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ఖరారు చేసింది. అక్టోబర్ 7వ తేదీ నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు ప్రకటించింది. కొవిడ్ నిబంధనలు అనుగుణంగా ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబర్ 5వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని జరపనున్నట్లు వెల్లడించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహనసేవల వివరాలను టీటీడీ ప్రకటించింది.
- 06-10-2021: అంకురార్పణ (సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు)
- 07-10-2021: ధ్వజారోహణం(ఉదయం)- పెద్దశేష వాహనసేవ(సాయంత్రం)
- 08-10-2021: చిన్నశేష వాహనసేవ(ఉదయం)- హంస వాహనసేవ(సాయంత్రం)
- 09-10-2021: సింహ వాహనసేవ(ఉదయం)- ముత్యపుపందిరి వాహనసేవ(సాయంత్రం)
- 10-10-2021: కల్పవృక్ష వాహనసేవ(ఉదయం)-సర్వభూపాల వాహనసేవ(సాయంత్రం)
- 11-10-2021: మోహినీ అవతారం(ఉదయం)- గరుడ వాహనసేవ(సాయంత్రం)
- 12-10-2021: హనుమంత వాహనసేవ(ఉదయం)- గజ వాహనసేవ(సాయంత్రం)
- 13-10-2021: సూర్యప్రభ వాహనసేవ(ఉదయం)- చంద్రప్రభ వాహనసేవ(సాయంత్రం)
- 14-10-2021: రథోత్సవం బదులుగా సర్వభూపాల వాహనసేవ(ఉదయం)- అశ్వ వాహనసేవ(సాయంత్రం)
- 15-10-2021: పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం (ఉదయం)- ధ్వజారోహణం (సాయంత్రం)
తిరుమలలో గదుల కేటాయింపునకు తితిదే తీసుకుంటున్న కాషన్ డిపాజిట్ పది రోజులకు కూడా భక్తుల ఖాతాలోకి చేరడం లేదు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నవారికి గది ధరను బట్టి కాషన్ డిపాజిట్ తీసుకుంటారు. గదులు ఖాళీ చేసినప్పుడు 1,2 రోజుల్లో ఈ మొత్తం తిరిగి భక్తుడి బ్యాంకు ఖాతాలో జమవుతుందని తితిదే సిబ్బంది చెబుతున్నా కొంతమందికి పది రోజులకుపైగా సమయం పడుతోంది. దీనిపై అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి గత నెల సంబంధిత అధికారులతో సమావేశమై సిబ్బందిని అప్రమత్తం చేసినప్పటికీ ఇంకా వేగవంతం కాలేదు. కాషన్ డిపాజిట్ సకాలంలో జమ కానట్లయితే తితిదే వెబ్‌సైట్ cdmcttd@tirumala.org కి కానీ తితిదే టోల్‌ఫ్రీ నంబరుకుగానీ ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. 3, 4 రోజుల్లోనే డిపాజిట్ అవుతోందని వెల్లడించారు..
Also Read: TTD Brahmostavas 2021: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు... ఏ తేదీల్లో ఏ వాహన సేవలంటే...
Also Read: TTD: తిరుమల నూతన పాలకమండలి సభ్యులు వీరే..ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య 50 కి పెంచిన ప్రభుత్వం