Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 13న ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు విడుదల
Tirumala Darshan Tickets : శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్ కోటా టికెట్లను ఈనెల 13 సోమవారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నిలిపివేశారు. బాలాలయం కార్యక్రమం వాయిదా పడటంతో ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను సోమవారం విడుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
రేపు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల
మార్చి నెలకు సంబంధించి అంగప్రదక్షిణ టికెట్లతో పాటు ఈనెల 23 నుంచి 28 వరకు విడుదల చేయని కోటాను ఫిబ్రవరి 11 శనివారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అంగప్రదక్షిణ టోకెన్లు కావాల్సిన భక్తులు తిరుమలలో సంప్రదాయాలు పాటించాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది. శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత ముందుగా.. టోకెన్ మీద నిర్ణయించిన ప్రవేశ ద్వారం వద్దకు భక్తులు వెళ్లాలి. స్వామి వారి సుప్రభాత సేవ ప్రారంభం అయిన తరువాత ముందుగా స్త్రీలను అనుమతిస్తారు. వారి ప్రదక్షిణ పూర్తయ్యాక పురుషులను అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. స్వామి వారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేస్తూ, శ్రీవారి ప్రాకారం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి హుండీ వరకు చేరుకోవాలని భక్తులకు అధికారులు సూచించారు.