Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల
Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టోకెన్లు ఈ నెల 22న ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పంది. భక్తుల సౌకర్యార్థం సెప్టెంబరు నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టోకెన్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. టోకెన్లను ఆన్ లైన్ కోటాలో ఈనెల 22న విడుదల చేయనున్నారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో టోకెన్లు అందుబాటులో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో అంగప్రదక్షిణ టోకెన్లను రద్దు చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టోకెన్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఆన్ లైన్ లో టోకెన్లు
ఆపదమొక్కుల వాడు, భక్త వత్సలుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్ధం నిత్యం వేల మంది భక్తులు తిరుమల పుణ్యక్షేత్రంకు చేరుకుంటూ ఉంటారు. దేశ విదేశాల నుంచి స్వామి వారి సన్నిధికి చేరుకునే భక్తులు అనేక రూపాల్లో స్వామి వారి క్షణకాలం పాటు దర్శన భాగ్యం పొందతూ ఉంటారు. ఇలా ఏడుకొండలకు చేరుకున్న భక్తులకు టీటీడీ సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్, ఆర్జితసేవ, అంగప్రదక్షణ వంటి రూపాల్లో భక్తులకు శ్రీనివాసుడి దర్శనం కల్పిస్తుంది. అయితే కోవిడ్ కారణంగా తాత్కాలికంగా తిరుమలలో అంగప్రదక్షణ టోకెన్ల జారీ ప్రక్రియను నిలిపివేసింది టీటీడీ. దాదాపు రెండున్నర ఏళ్ళ తరువాత తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ 1వ తారీఖు నుండి తిరిగి ఆఫ్ లైన్ లో అంగప్రదక్షణ టోకెన్లను తిరుమలలోని సీఆర్వో కార్యాలయం వద్ద భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అధిక సంఖ్యలో భక్తుల రద్దీతో రోజు వారి తిరుమలలో జారీ చేసే అంగప్రదక్షణ టోకెన్ల ప్రక్రియను భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ ద్వారా టోకెన్లు జారీ చేస్తుంది. దీంతో గంటల తరబడి అంగప్రదక్షణ టోకెన్ల కోసం భక్తులు వేచి ఉండే అవసరం లేకుండా ఇంటి వద్దే ఆన్లైన్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని అంగప్రదక్షణ చేసే సౌఖర్యం కల్పించింది టీటీడీ.
అంగప్రదక్షణ అంటే?
కలియుగ వైకుంఠగా భాసిల్లే శ్రీ వేంకటాద్రిపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి అవతరించిన నిత్యం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ వారిని తరింపజేస్తున్నారు. ఆపద మొక్కల వాడికి అంగప్రదక్షణ అంటే ఎంతో ప్రీతికరమైనది. అందుకే భక్తి భావంతో భక్తులు పొర్లు దండాలు చేసి స్వామి వారి కటాక్షాలను పొందుతుంటారు భక్తులు. భక్తుల సౌకర్యార్థం ప్రతి రోజు వేకువజామున ఒంటి గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు కలిగిన వారు ముందుగా శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించి, తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా భక్తులు ఆలయం ప్రవేశం చేస్తారు భక్తులు. ఇలా ఆలయ ప్రవేశం చేసిన భక్తులు ముందుగా వెండి వాకిలి దాటి బంగారు వాకిలి చేరుకోవాల్సి ఉంటుంది. వెండి వాకిలి లోపల ఆనంద నిలయం చుట్టూ చేసే ప్రదక్షిణాన్నే అంగప్రదక్షణ అని కూడా అంటారు. సుప్రభాత సేవ జరిగే సమయంలో వెలుపల భక్తులను అంగప్రదక్షణ చేయిస్తుంటారు. వెండి వాకిలి లోపలికి ప్రవేశించగానే ఎదురుగా ఆదిశేషునిపై శ్రీరంగనాథుడు కనిపిస్తాడు. ఈయనకు పైన వరదరాజ స్వామి, క్రింద శ్రీ వేంకటేశ్వర స్వామి మూర్తులు చిన్న బంగారు ఫలకాలపై ఉంటారు. ఇక్కడి నుండి అంగప్రదక్షణ మొదలు అవుతుంది. ఇలా ఆనంద నిలయం చుట్టూ ఓ ప్రదక్షణ చేసిన తరువాత వారికి స్వామి దర్శన భాగ్యం కల్పిస్తుంది టీటీడీ. ఇలా స్వామి వారి అంగప్రదక్షణ చేసి మొక్కులు తీర్చుకోవడం ద్వారా దీర్ఘకాలిక భాధల నుండి విముక్తి లభించడమే కాకుండా కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మొత్తం 22,500 టోకెన్లు
ఈ క్రమంలోనే ప్రతి రోజు మధ్యాహ్నం తిరుమల సీఆర్వో కార్యాలయం వద్ద జారీ చేసే అంగప్రదక్షణ టోకెన్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఉదయం నుండి భక్తులు క్యూలైన్స్ లో టోకెన్ల కోసం వేచి ఉండి టోకెన్లను పొందతూ ఉంటారు భక్తులు. ఈ సమయంలో అధిక రద్దీతో భక్తుల మధ్య కొంత తోపులాట జరిగే అవకాశం ఉంటుంది. అయితే భక్తులు ఇబ్బందులను దృష్టిలో తీసుకున్న టీటీడీ.. ఇకపై భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ లో అంగప్రదక్షణ టోకెన్ల జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది జూన్ 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో అంగప్రదక్షణ టోకెన్లను అందుబాటులోకి తీసుకుని వచ్చింది టీటీడీ. ఈ టికెట్లు పొందేందుకు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులు సౌకర్యార్థం ఇకపై టీటీడీ ఆన్‌లైన్‌లోనే విడుదల చేయడంతో భక్తులు తమ ఇంటి వద్దే టోకెన్లు పొంది నేరుగా స్వామి వారి అంగప్రదక్షణకు విచ్చేస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబరు నెలకు సంబంధించిన అంగ ప్రదక్షణ టోకెన్లను ఈ నెల 22వ తేదీన ఉదయం 9 గంటలకు రోజుకు 750 టోకెన్ల చొప్పున టీటీడీ ఆన్‌లైన్‌లో జారీ చేయనుంది. సెప్టెంబరు నెలకు సంబంధించి మొత్తం 22,500 టోకెన్లను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచనుంది. ఇందుకు సంబంధించిన వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in ద్వారా అంగప్రదక్షణ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.