Tirumala Brahmostavalu: తిరుమల బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై స్వామివారి ఊరేగింపు
తిరుపతి శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు ఆ ఏడు కొండల స్వామి సింహ వాహనంపై ఊరేగాడు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం 9 గంటలకు కల్యాణోత్సవ మండపంలో సింహ వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. ఆలయంలోని ధ్వజస్తంభం వరకు స్వామి వారిని సింహ వాహనంపై ఏకాంతంగా ఊరేగించారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని మలయప్ప స్వామి అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతమని భావిస్తారు భక్తులు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు అభయమిస్తారు.
శ్రీవారిని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.
స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అవంతి అన్నారు. స్వామి వారిని ఎన్ని సార్లు దర్శించుకున్న ఒక ప్రత్యేకమైన అనుభూతి ఆశీస్సులు కలుగుతాయన్నారు.. కరోనా నిబంధనలు పాటిస్తూ టీటీడీ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంతోషదాయకం అన్నారు.. పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామివారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తుందని.. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 11న ప్రభుత్వం తరపున ఏపీ సీఎం గరుడ సేవ రోజు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.
తిరుమలకు సీఎం జగన్
మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై టీటీడీ అధికారులతో కలసి చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పల నాయుడు సమీక్షా నిర్వహించారు. సీఎం పర్యటించే ప్రదేశాల్లో ఏర్పాట్లు పరిశీలించారు. సీఎం కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా స్వామి వారికి పట్టు వస్త్రాలను సీఎం సమర్పిస్తారని చెప్పారు జిల్లా కలెక్టర్. సీఎం పర్యటనకు కావాల్సిన 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. ఈ నెల 11న ఏపీ సీఎం, కర్ణాటక సీఎం ఇద్దరూ తిరుమల రానున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, టీటీడీ అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించినట్లు పేర్కొన్నారు. భద్రతా పరమైన ఎటువంటి లోపాలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. బర్డ్ ఆసుపత్రి, అలిపిరిమెట్ల మార్గం, గోశాల వద్ద సీఎం కార్యక్రమాలు ఉన్నాయన్నారు. తిరుపతిలో, ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
Also Read: Tirumala: హంస వాహనంపై దర్శనమిచ్చిన తిరుమలేశుడు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి