Tirupati Forest Fire : తిరుమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు, పది ఎకరాలు అగ్నికి ఆహుతి
Tirupati Forest Fire : తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు అంటుకుంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.
Tirupati Forest Fire : తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు అలముకుంది. మొదటి ఘాట్ రోడ్డులోని ఎలిఫెంట్ ఆర్చ్ సమీపంలో గల అటవీ ప్రాంతంలో మంటలు అధికంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న టీటీడీ అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వేసవికాలం కావడంతో అటవీ ప్రాంతంలో ఎండుటాకులు ఎక్కువగా పేరుకు పోవడంతో తరచూ అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతి అవుతోంది. అధికంగా మంటలు వ్యాప్తి చెందడంతో అటవీ ప్రాంతంలో నివసించే వన్య ప్రాణులు మృతి చెందే అవకాశం ఉండడంతో అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు పది ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతి అయినట్లు టీటీడీ అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు.
తరచూ కార్చిచ్చు ఘటనలు
మార్చి నెలలోనూ తిరుపతి శేషాచలం అటవీప్రాంతంలో అగ్గి రాసుకుంది. దీనికి కారణం స్మగ్లర్లు. అటవీశాఖాధికారుల దృష్టి మరల్చేందుకు దట్టమైన అటవీప్రాంతంలో నిప్పు పెడుతున్నారు. తరచూ శేషాచలం అటవీప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అధికారులు తేల్చారు. శేషాచలం అటవీ ప్రాంతంలోని కరకంబాడి ఫారెస్ట్ ఏరియాలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఎట్టకేలకు మంటలను అదుపుచేశారు. శేషాచలం అడవుల్లో తరచూ కార్చిచ్చు చెలరేగుతుండడంతో అరుదైన వృక్ష, జంతు జాతులు అంతరించిపోతున్నాయి. అరుదైన అటవీ సంపద అగ్ని ఆహుతి అవుతోంది.
స్మగ్లర్ల పనే
స్మగ్లర్లు శేషాచలం అటవీ ప్రాంతానికి తరచూ నిప్పు పెట్టడంతో అరుదైన వృక్ష సంపద, జీవరాశుల అంతరించే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎర్ర చందనం స్మగ్లర్ల చర్యలతో శేషాచలానికి అపారమైన నష్టం జరుగుతోందన్నారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు ఏజన్సీ ప్రాంతంలోనూ గత నెలలో కార్చిర్చు రాజుకుంది. ఆకతాయిలు కొందరు అటవీకి నిప్పుపెట్టి ఉండవచ్చని అటవీ సిబ్బంది భావిస్తున్నారు. తరచూ జరిగే అగ్ని ప్రమాదాలతో ఏజెన్సీ ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు.
ఏపీలో తరచూ కార్చిచ్చు
ఇటీవల కాలంలో ఏపీలో కార్చిచ్చు ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. అనంతపురంలో అటవీ సంపద అగ్నికి ఆహుతి అవుతోంది. వేల ఎకరాల్లో వృక్షాలు, వందల సంఖ్యలో వన్యప్రాణులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. సోమందేపల్లి, పెనుకొండ, పుట్టపర్తి, బుక్కపట్నం, ముదిగుబ్బ అటవీ ప్రాంతాల్లో తరచూ మంటలు చెలరేగుతున్నాయి. అడవిలో కార్చిచ్చు రాజుకోవడంతో వన్య ప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఇటీవల సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామంలోకి చిరుత రావడం కలకలం రేగింది.