Bhimavaram Temples: సంక్రాంతికి భీమవరం వెళ్తున్నారా? అయితే తప్పక చూడాల్సినవి ఇవే
Bhimavaram: భీమవరం చుట్టుపక్కల తప్పక చూడాల్సిన దర్శనీయ స్థలాలు చాలా ఉన్నాయి. పండుగకు అటు వైపు వెళ్లే వారు వీటి గురించి తెలుసుకోవచ్చు.

Bhimavaram Tour: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల చూపు భీమవరం వైపు మళ్లుతుంది. పౌరుషానికి ప్రతీకగా నిలిచే కోడి పందాలు, కళ్లు చెదిరే బాణాసంచా వేడుకలు, సాంప్రదాయ పిండివంటలతో భీమవరం పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారుతాయి. పండుగ సంబరాల కోసం ఇక్కడికి వచ్చే పర్యాటకులు కేవలం వినోదానికే పరిమితం కాకుండా, ఈ ప్రాంతంలోని చారిత్రక మరియు ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రాలను సందర్శించడం ఒక ఆచారంగా మారింది.
గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయం
భీమవరం వెళ్లిన వారు తప్పక దర్శించాల్సిన క్షేత్రం గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయం. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటిగా అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని శివలింగం ప్రత్యేకత ఏమిటంటే, చంద్రుని కళలకు అనుగుణంగా పౌర్ణమి నాడు తెల్లగా, అమావాస్య నాడు గోధుమ రంగులోకి మారుతుంది. పండుగ రోజుల్లో ఈ క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతుంది. అలాగే, పట్టణానికి సమీపంలోనే ఉన్న మావూళ్లమ్మ తల్లి ఆలయం భీమవరం ప్రజల ఇలవేల్పుగా వెలుగొందుతోంది. అమ్మవారి శాంత స్వరూపాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.
పాలకొల్లు కూడా పంచారామ క్షేత్రమే
భీమవరానికి కూతవేటు దూరంలో ఉన్న పాలకొల్లు కూడా పంచారామ క్షేత్రమే. ఇక్కడి క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం తన అద్భుతమైన శిల్పకళతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. గోపురాల ఎత్తు, ప్రాచీన నిర్మాణాలు ఈ ప్రాంత చరిత్రకు అద్దం పడతాయి. పచ్చని కోనసీమ ముఖద్వారంగా పిలిచే ఈ ప్రాంతాల్లో ప్రయాణం పండుగ పూట కనువిందు చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న కొల్లేరు సరస్సు కూడా పర్యాటకులకు మరొక ఆకర్షణగా నిలుస్తుంది.
ప్రకృతి అందాలతో అంతర్వేది
ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారు భీమవరం నుండి అంతర్వేదికి ప్రయాణించవచ్చు. గోదావరి నది సముద్రంలో కలిసే 'సంగమ క్షేత్రం'గా అంతర్వేదికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం , సముద్ర తీరం పర్యాటకులకు మంచి విహార యాత్ర అనుభూతిని ఇస్తాయి. మొత్తానికి భీమవరం పండుగ ప్రయాణం కేవలం పందాల కోసమే కాకుండా, మన సంస్కృతిని, ప్రకృతిని చూసి వచ్చే ఒక అద్భుతమైన పర్యటనగా మిగిలిపోతుంది.
చూడాలనుకుంటే చాలా ఉన్నాయి ..!
భీమవరం చుట్టుపక్కల మరిన్ని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకుంటే, అద్భుతమైన శిల్పకళకు నిలయమైన పెనుగొండ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే, ప్రకృతి ప్రేమికుల కోసం పక్షుల విడిది కేంద్రమైన కొల్లేరు సరస్సు సమీపంలోని అకివీడు పరిసరాలు కనువిందు చేస్తాయి. వీటితో పాటు గోదావరి తీరాన ఉన్న సిద్ధాంతం వద్ద ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. కొంచెం ముందుకు వెళ్తే రాజమండ్రి లోని గోదావరి ఘాట్లు, హేవ్‌లాక్ బ్రిడ్జి ,దవళేశ్వరం ఆనకట్ట వంటి చారిత్రక కట్టడాలు పర్యాటకులకు మరుపురాని అనుభూతిని మిగిలిస్తాయి.





















