Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !
స్కిల్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ ను హైకోర్టు 12వ తేదీ వరకూ పొడిగించింది. ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు లేవని ఏజీ హైకోర్టుకు తెలిపారు.
Lokesh : స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముందస్తు బెయిల్‌ను అక్టోబర్ 12కు హైకోర్టు పొడిగించింది. లోకేష్ ముందస్తు బెయిల్‌పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా... లోకేష్ ముందస్తు బెయిల్ ఈ రోజుతో ముగుస్తుందని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు. తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేవని సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేయాలని కోర్టును అడ్వకేట్ జనరల్ కోరారు. దీంతో అప్పటి వరకూ లోకేష్‌కు ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఫైబర్ గ్రిడ్ ఎఫ్ఐఆర్‌లో అసలు లోకేష్ పేరు లేదన్న సీఐడీ
నిన్న జరిగిన విచారణలో ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం నారా లోకేష్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో లోకేష్‌ను అరెస్ట్ చేస్తారనే ఆందోళన తమకుందని లోకేష్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే లోకేష్‌ను ఇంతవరకూ ఫైబర్ గ్రిడ్ కేసులో నిందితుడిగా చేర్చలేదని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. ఒకవేళ చేరిస్తే ఆయనకు సీఆర్‌పీసీలోని 41 ఏ కింద నోటీసులు ఇస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. 41 ఏ నిబంధనలు పాటించకపోతే కోర్టుకు విన్నవిస్తామన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కేసులో పదో తేదీన లోకేష్ సీఐడీ విచారణ
ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో లోకేష్ సవాల్ చేశారు. లోకేష్ సిఐడీ విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తూ సిఐడీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిఐడీ ఇచ్చిన 41 ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో లోకేష్ సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హెరిటేజ్ డాక్యుమెంట్లు అడిగారని.. లోకేష్ హెరిటేజ్‌లో షేర్ హోల్డర్లు మాత్రమేనన్నారు. వాటిని లోకేష్ ను ఇవి అడగడం సమంజసం కాదని సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాము డాక్యుమెంట్ల పై ఒత్తిడి చేయబోమని, బుధవారమే విచారణకు హాజరు కావాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. అయితే అంత తొందర ఏముందని లోకేష్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనల అనంతరం ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పటి వరకూ అరెస్టు చేసే అవకాశం లేదు.
లోకేష్ కూడా అరెస్టవుతారని.. వైసీపీ నేతలు బెదిరిస్తూ వస్తున్నారు. సీఐడీ చీఫ్ సంజయ్ కూడా అదే చెబుతున్నారు. అయితే కేసుల్లో ఒక్క సారిగా న్యాయస్థానాల్లో వాదనలు వినిపించడానికి కూడా వెనుకడుగు వేస్తూండటం.. రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ వ్యతిరేకించాలని కూడా తమకు సమాచారం లేదని ఏజీ చెప్పడం ఆసక్తికరంగా మారింది.