Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్ నారాయణపూర్‌లో ఎన్‌కౌంటర్- రాజు దాదా, కోసా దాదా హతం, ఒక్కొక్కరిపై 40 లక్షల రివార్డు
Chhattisgarh Encounter: మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు జరిపిన ఆపరేషన్లో ఇద్దరు నక్సల్స్ హతం అయ్యారు. ఒక్కొక్కరిపై 40 లక్షల రివార్డు ఉంది.

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అబుజ్‌మాడ్‌లో రాజు దాదా అలియాస్ కట్టా రామచంద్ర రెడ్డి, కోసా దాదా అలియాస్ కడారి సత్యనారాయణ రెడ్డిని ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టారు, వీరిద్దరిపై ఒక్కొక్కరికి రూ.40 లక్షల రివార్డు ఉంది.
బస్తర్ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని అబుజ్‌మాడ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. అబుజ్‌మాడ్‌లోని మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో నక్సల్స్ ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌కు వెళ్లాయి.
#BREAKING: In Abujhmad, two Maoist cadres, Raju Dada alias Katta Ramchandra Reddy and Kosa Dada alias Kadri Satyanarayana Reddy, each with ₹40 lakh bounties, were killed in an encounter. Weapons, explosives, and Maoist literature were recovered: Bastar Police pic.twitter.com/9vAjW7EnCq
— IANS (@ians_india) September 22, 2025
ఆయుధాలు స్వాధీనం
తనిఖీలు చేసే సెక్యూరిటీ టీంలు ఆ ప్రాంతానికి చేరుకోగానే నక్సల్స్ భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని, అనంతరం భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఇద్దరు నక్సల్స్ మృతదేహాలు, ఏకే 47 రైఫిల్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ప్రచార సామాగ్రి, రోజువారీ వినియోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి.
సోదాలు కొనసాగుతున్నాయి
హతమైన నక్సల్స్‌ను గుర్తించే పనిలో ఉన్నామని ఆయన చెప్పారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ప్రాంతంలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఈ విషయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఈ ఏడాది 249 మంది నక్సల్స్ హతం
ఈ చర్యతో ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో ఇప్పటివరకు 249 మంది నక్సల్స్ హతమయ్యారు. వీరిలో 220 మంది బస్తర్ డివిజన్‌లో (నారాయణ్‌పూర్ సహా ఏడు జిల్లాలు ఉన్నాయి) హతమవ్వగా, మరో 27 మంది రాయ్‌పూర్ డివిజన్‌లోని గరియాబంద్ జిల్లాలో హతమయ్యారు. దుర్గ్ డివిజన్‌లోని మొహ్లా-మాన్‌పూర్-అంబాగఢ్ చౌకీ జిల్లాలో మరో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు.
గత నెల 11న రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యుడు (సీసీఎం) మోడెం బాలకృష్ణతో సహా 10 మంది నక్సల్స్ హతమయ్యారు.
కోవర్ట్ ఆపరేషన్‌లో భాగంగా కేంద్ర కమిటీ సభ్యుల హత్య: హక్కుల సంఘాల నేతల ఆరోపణలు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబూజ్‌మడ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని పౌర హక్కుల సంఘం ప్రకటించింది. కేంద్ర కమిటీ సభ్యులు సాధారణంగా పటిష్టమైన గార్డుల రక్షణ వలయంలో ఉంటారని వీరు కనుక చనిపోయారంటే రక్షణగా నిలిచిన గార్డులు కూడా మృత్యువాత పడాలని అనుమానం వ్యక్తం చేశారు. రక్షణ వలయానికి సంబంధించిన సమాచారం పోలీసులు ప్రకటించలేదన్నారు. కనుక ఈ ఎన్కౌంటర్ కచ్చితంగా కోవర్ట్ ఆపరేషన్ లో భాగంగా జరిగినట్లుగా అర్థమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో అనైతిక యుద్ధం గత 21 నెలలుగా కొనసాగిస్తున్నారు. ఈ యుద్ధాన్ని వెంటనే నిలిపివేసి ప్రజాసమస్యల పరిష్కారం పైన దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. "మావోయిస్టులతో వెంటనే చర్చల ప్రక్రియ చేపట్టాలి. ఇన్ ఫార్మర్ల వ్యవస్థను, కోవర్ట్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంలో అమాయకపు ఆదివాసీలను ఉపయోగిస్తోంది. డీఆర్‌జీ దళాలు చట్ట వ్యతిరకం. ఆదివాసీల జీవితాలతో చెలగాటమాడటం కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలి. దండకారణ్యంలో మోహరించిన అన్ని రకాల బలగాలను వెంటనే ఉపసంహరించాలని, ఈ ఎన్కౌంటర్‌పైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం." అని గడ్డం లక్ష్మణ్, ఎన్ నారాయణరావు అన్నారు.





















