Weather: తీరం దాటిన వాయుగుండం.. అయినా అప్రమత్తత అవసరం..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరీ, చెన్నై మధ్య తీరం దాటింది. అయిన ఇంకా వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. ఏకధాటిగా కురిన వానతో వణికిపోయిన మూడు జిల్లాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి.
వారం రోజుల వ్యవధిలో ఏపీని వణికించిన రెండో వాయుగుండం తీరం దాటింది. ఈ ఉదయం 3గంటల నుంచి 4గంటల మధ్య పుదుచ్చేరి, చెన్నై మధ్య తీరం దాటిందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. అయితే మరో 24గంటలపాటు దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
నెల్లూరు, చిత్తూరు, కడపపై ప్రతాపం..
వారం రోజుల క్రితం తొలి వాయుగుండం చిత్తూరు, నెల్లూరు జిల్లాలపై ప్రతాపం చూపించగా.. రెండో వాయుగుండం ప్రభావంతో కడప జిల్లాలో కూడా భారీ వర్షాలు పడ్డాయి. చిత్తూరు జిల్లాలో జలవిలయం సృష్టించింది. ఇక నెల్లూరులో ఇప్పటికే చెరువులు నిండిపోయి ఉండటంతో.. కలుజులు దాటి పారి.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పాఠశాలలకు సెలవు..
మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఈరోజు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మరో 24గంటలు వర్షాలు..
వాయుగుండం తీరం దాటినా.. దాని ప్రభావంతో అనంతపురం జిల్లాలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశముంది. ప్రస్తుతం తీరం దాటిన వాయుగుండం అనంతపురం, బెంగళూరు ఉపరితలాలపై కేంద్రీకృతం అయి ఉంది. దీని ప్రభావంతో 24గంటల్లోగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు అధికారులు.
ప్రమాదకరంగా పింఛా డ్యాం
భారీ వర్షాలు చిత్తూరు జిల్లాలో ప్రమాదాన్ని తెచ్చి పెట్టేలా ఉన్నాయి. పై ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఫించా డ్యాం ప్రమాద స్థాయిలో ఉన్నట్లు సమాచారం. పింఛా డ్యాం నాలుగు గేట్లు ఎత్తారు. అక్కడ రింగ్ బండకు ఒక అడుగు తక్కువ ఎత్తులో మాత్రమే వరద నీరు ఉన్నట్లు తెలిసింది. అందిన సమాచారం మేరకు ఒక గంటలో పింఛా డ్యాం ఓవర్ ఫ్లో అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పింఛా డ్యాం అన్ని గేట్లు ఎత్తివేయడంతో అన్నమయ్య ప్రాజెక్టుకు అతి వేగంగా భారీ స్థాయిలో వరద నీరు వస్తోంది. అన్నమయ్య ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతానికి దాదాపు లక్ష క్యూ సెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
తిరుమలపైకి రాకపోకలు షురూ
ప్రస్తుతానికి వర్షాలు లేని కారణంగా అలిపిరి నుంచి తిరుమలకు ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాక పోకలు పునరుద్ధరించింది టీటీడీ. తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలను అధికారులు, సిబ్బంది తొలగించారు. ఈ మార్గంలో గంటపాటు తిరుమల నుంచి అలిపిరి, గంటపాటు అలిపిరి నుంచి తిరుమలకు వాహనాలు పంపిస్తున్నారు. ఎవరు కూడా మార్గ మధ్యలో ఫొటోల కోసం వాహనాలు దిగడం, వాహనాలను ఆపొద్దని టీటీడీ అధికారులు విజ్తప్తి చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితిని అంచనా వేసి అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో వాహనాలను అనుమతించే విషయంపై టీటీడీ నిర్ణయం తీసుకోనుంది.