AP High Court : విభజన చట్టం ప్రకారం ఏపీ హైకోర్టు ఏర్పాటు - తరలించే ప్రతిపాదనేదీ లేదన్న కేంద్రం !
ఏపీ హైకోర్టును మార్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం తెలిపింది. పార్లమెంట్‌లో రాత పూర్వకంగా ఈ విషయం తెలిపింది.
AP High Court : ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించాలనే ప్రతిపాదన ఏదీ ఏపీ ప్రభుత్వం నుంచి రాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. శుక్రవారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ రాతపూర్వక సమాధానంలో వివరాలు వెల్లడించారు. 2014 విభజన చట్టం ప్రకారం అమరావతి కేంద్రంగా ఏపీ హైకోర్టు ఏర్పాటు అయ్యిందని కేంద్రం పేర్కొంది. 2019 జనవరి ఒకటి నుంచి అమరావతిలో ఏపీ హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు పూర్తిస్థాయి ప్రతిపాదనేదీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో లేదని తెలిపింది.
హైకోర్టు తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం, అక్కడి హైకోర్టు అభిప్రాయాలు తెలపాల్సి ఉందని చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించింది. 2014 విభజన చట్టం ప్రకారం అమరావతి కేంద్రంగా ఏపీ హైకోర్టు ఏర్పాటై 2019 జనవరి ఒకటి నుంచి పనిచేస్తోందని.. 2020లో ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్ తరలించేందుకు ఏపీ ముఖ్యమంత్రి ప్రతిపాదించారని కేంద్రం తెలిపింది. రాష్ట్ర హైకోర్టును సంప్రదించి తరలింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది.
గతంలోనూ పార్లమెంట్‌లో వైసీపీ సభ్యులు హైకోర్టు తరలింపుపై ప్రశ్నలు అడిగారు. అప్పుడు కూడా ఇదే సమాధానం చెప్పారు. ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలు నగరానికి తరలించడానికి ఏపీ ముఖ్యమంత్రి 2020 ఫిబ్రవరిలో ప్రతిపాదించారు. రాష్ట్ర హైకోర్టును సంప్రదించి తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. హైకోర్టు నిర్వహణ వ్యయం భరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేసింది.
అదే సమయంలో హైకోర్టు రోజువారీ పరిపాలనా వ్యవహారాల నిర్వహణ బాధ్యత సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చూస్తారని హోంశాఖ గుర్తు చేసింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో పనిచేసే ధర్మాసనాన్ని కర్నూలు తరలించాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టులు ఓ అభిప్రాయానికి వచ్చిన తర్వాత కేంద్రానికి వాటిని పంపాల్సి ఉంటుందని సూచించింది. ఇప్పటి వరకు రాష్ట ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లో లేదని పార్లమెంటులో ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిని వీకేంద్రీకరించాలని రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి భావించారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాలు శాసనమండలిలో నెగ్గలేదు. ఓ దశలో శాసన మండలిని కూడా రద్దు చేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నించారు.