AP Central Budjet : ఈ సారైనా ఆదుకుంటారా ? కేంద్ర బడ్జెట్ వైపు ఆశగా చూస్తున్న ఏపీ ప్రభుత్వం !
ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీకి అదనపు సాయాన్ని కేంద్ర బడ్జెట్‌లో చేస్తారని ఏపీ ప్రభుత్వం ఆశపడుతోంది. ఎన్నో అంచనాలు పెట్టుకుంటోంది. ప్రతీ సారిలాగే ఈ సారి నిరాశే ఎదురవుతుందా? ఏమైనా రిలీఫ్ దొరుకుతుందా ?
2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నారు. మిగతా రాష్ట్రాల సంగతేమో కానీ ఈ బడ్జెట్ కోసం ఆంధ్రప్రదేశ్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఆర్థిక సమస్యలతో అట్టుడికిపోతున్న ప్రభుత్వానికి నిర్మలమ్మ సాంత్వన చేకూరుస్తారని నిధుల ప్రవాహం ప్రారంభిస్తారని ఆశ పడుతున్నారు. విభజన హామీల ప్రకారం రావాల్సిన నిధులు.. లోటు భర్తీ సహా అనేక హామీల మీద ఆశతో ఉన్నారు. అసలు ఏపీ .. కేంద్రం నుంచి ఏమేమి కోరుకుంటోంది? కేంద్రం పట్టించుకునే అవకాశం ఉందా ?
Also Read: కుప్పంలో అక్రమ మైనింగ్... చంద్రబాబు ఆరోపణలు నిజమేనా..?... క్వారీలపై అధికారుల వరుస దాడులు
విభజన తర్వాత ఏపీకి కేంద్రం నుంచి అందిన ప్రత్యేక సాయం స్వల్పమే !
కేంద్ర పద్దులపై ఏపీ ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. గత ఏడేళ్లలో ఏపీకి బడ్జెట్‌లో ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదు. ఈ సారైనా రాష్ట్రానికి న్యాయం జరక్కపోతుందా అని ప్రభుత్వం ఎదురు చూస్తోంది. కేంద్ర బడ్జెట్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు. ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం ఎప్పుడో పక్కన పెట్టేసింది. దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అన్న అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. అలాగని ప్రత్యేక ప్యాకేజీ కూడా రాష్ట్రానికి అందలేదు. గడచిన ఐదేళ్లలో కేంద్రం రాజధాని నిర్మాణానికి కేవలం రూ. 15 వందల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరానికి కూడా కేంద్రం అనుకున్న స్థాయిలో నిధులు విడుదల చేయలేదు.
Also Read: ఆర్టీసీ ఉద్యోగులూ సమ్మెలోకి ! ప్రభుత్వంలో విలీనం చేశాక వారికొచ్చిన కష్టాలేంటి ?
పెండింగ్‌లో విభజన హామీలు !
విభజన గాయాలు, ఆర్థిక లోటు, ప్రకృతి విపత్తులతో కునారిల్లుతున్న ఏపీ కేంద్రం సాయం ఎక్కువగా ఆశిస్తోంది. ఆర్థిక కష్టాలు, తుపానులతో నష్టపోతున్న రాష్ట్రానికి ఎలాంటి చేయూత లేదు. ఈసారైనా ప్రత్యేక హోదా ఇస్తే... ఆర్థికంగా చేయూత లభిస్తుందని, పరిశ్రమలు, ఉద్యోగాలొస్తాయన్న ఆశలు నెరవేరడం లేదు. పోలవరం ప్రాజెక్టుకి నాబార్డుతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వమే నేరుగా నిధులు కేటాయించి ప్రాజెక్టుని వేగంగా పూర్తి చేయాలన్న విజ్ఞప్తుల్నీ కేంద్రం పట్టించుకోవడంలేదు. సవరించిన అంచనాల్నే ఇంత వరకూ ఆమోదించలేదు. విభజన జరిగి ఏడున్నరేళ్లవుతున్నా... 2014-15 నాటికి ఇవ్వాల్సిన రెవెన్యూ లోటు భర్తీ చేయలేదని.. ఆ డబ్బుల్ని ఇప్పించాలని సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీ సారి వినతి పత్రం ఇస్తూంటారు. కానీ ప్రయోజనం ఉండటం లేదు.
విభజన చట్టంలో భాగంగా ఇచ్చిన వాటికీ కేటాయింపులూ ఉతక్కువే..!
విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి మంజూరు చేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయం అనంతపురంలోని జేఎన్‌టీయూలో ఒక భవనంలో నడుస్తోంది. ఏపీ, తెలంగాణ గిరిజన యూనివర్సిటీలకు బడ్జెట్‌లో నిధులు చూపిస్తోంది కానీ ఇస్తోంది మాత్రం లేదు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధుల కేటాయింపు గురించి ఎప్పుడో మర్చిపోయారు. గత మూడు బడ్జెట్‌లలలో ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థను, విద్యా సంస్థను రాష్ట్రానికి కొత్తగా ప్రకటించలేదు. విభజన హామీల్లో భాగంగా.. రాష్ట్రానికి ఇది వరకే మంజూరు చేసిన వివిధ కేంద్ర ప్రాజెక్టుల్ని వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన వనరుల గురించి కూడా చెప్పడం లేదు.
బడ్జెట్‌లో నిధుల కేటాయింపు కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లెక్కలేనన్ని ప్రతిపాదనలు పెట్టింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుకు తగినన్ని నిధుల కేటాయింపులతో పాటు ఇప్పటికే ఉన్న బకాయిలకు బడెŠజ్‌ట్‌లో తగినన్ని నిధులు కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంటు నిధులకు సంబంధించి ఈ బడ్జెట్‌లోనైనా కేటాయింపులు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి సాయం కింద బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద పదేళ్ల పాటు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు, ఇన్సూరెన్స్ ప్రీమియం 100 శాతం రీయింబర్స్‌మెంట్‌లను కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కొత్తమెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతించాలని కోరినందున బడ్జెట్‌లో ఆ కాలేజీలకు నిధులు కేటాయిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్‌తో పాటు రాజధానికి నిధులు కేటాయింపులు చేయాలని ప్రభుత్వం కోరుతోంది.
ఈ సారి ఎంత మేర ఆశలను నెరవేరుస్తారు !?
కేంద్ర బడ్జెట్‌లో ఈ సారి ఎంత మేర ఆశలను నెరవేరుస్తారనేది అంతుబట్టడం లేదు . కానీ గత బడ్జెట్లకు.. ప్రస్తుత బడ్జెట్‌కు పెద్ద తేడా ఉండదనే అభిప్రాయం వినిపిస్తోంది. విభజన హమీలను నెరవేర్చామని బీజేపీ నేతలు చాలా కాలంగా చెబుతున్నారు. వారి లెక్కలు వారు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ సారి బడ్జెట్ తర్వాత కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. విభజన హామీల ప్రకారం ఏర్పాటైన కేంద్ర సంస్థలకు అవసరాల మేర ిధులు కేటాయిస్తే అదే గొప్ప విజయంగా భావించాల్సిన పరిస్థితి అనే అభిప్రాయం నిపుణుల్లో ఉంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి