AP Government : నాయీ బ్రాహ్మణలను అలా పిలిస్తే కేసులు - ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం !
నాయీ బ్రాహ్మణులను కొన్ని పదాలతో పిలవడాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించింది. అలా పిలిస్తే కేసులు పెడతామని స్పష్టం చేసింది.
AP Government : ఆంధ్రప్రదేశ్‌లో నాయీ బ్రాహ్మణులు, వారి సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్న కొన్ని పదాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి గురువారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నాయీ బ్రహ్మణులు, వారి సామాజికవర్గానికి చెందిన వారిని కించపరిచేలా ఉన్న నాలుగు పదాలను వాడవద్దంటూ ప్రభుత్వం నిషేధం విధించింది. అలాకాకుండా కించపరుస్తూ మాట్లాడేవారిపై భారత శిక్ష్మాస్మృతి 1860 కింద చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు పలు నాయీ బ్రాహ్మణ సంఘాలు చెప్పాయి. ఆగస్టు 7న జారీ చేసిన ఈ జీవో బుధవారం వెలుగులోకి వచ్చింది.
గతంలో ఆర్యవైశ్యుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చింతామణి నాటకంపై నిషేధం
ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ ఉత్తర్వులు ఇచ్చిందో స్పష్టత లేదు. గతంలో చింతామణి నాటకంపై నిషేధం విధించింది ఏపీ ప్రభుత్వం. ఆర్యవైశ్య సంఘాలు ఈ నాటకం తమను కించ పరిచేలా ఉందని ఫిర్యాదులు చేయడంతో ఆ నాటకాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించింది. అయితే ఈ విషయంలో పలు పిటిషన్లు కోర్టులో ఉన్నాయి. వందేళ్లుకుపైగా ఉన్న నాటకంలో ఇప్పుడే వారి మనోభావాలు దెబ్బతిన్నాయా..? అభ్యంతరకరంగా ఉన్న వాటిని తొలగిస్తే పోయేదానికి నాటకాన్ని నిషేధించడం ఏమిటన్న ప్రశ్నలు వినిపించాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఆర్యవైశ్యుల డిమాండ్‌కు అనుగుణంగా నిషేధం విధిస్తున్నామని ప్రకటించింది.
దేశ రాజకీయాల్లో ఇక వెంకయ్యనాయుడు పాత్రేంటి ? రాజకీయంగా రిటైర్మెంటేనా ?
నాయీ బ్రాహ్మణులు ఎప్పుడు విజ్ఞప్తి చేశారో లేని స్పష్టత
అయితే నాయీ బ్రాహ్మణులు తమను ఈ పేర్లతో కించ పరుస్తున్నారని వాటిని నిషేధించాలని ఎప్పుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారో స్పష్టత లేదు. నిజానికి నాలుగు పదాలు మాత్రమే నిషేధం విధించడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయన్న వాదన నాయీ బ్రాహ్మణుల్లో ఉంది. తమను కించ పరిచేలా ఉన్న ఇతర పదాలను వాడవచ్చని చెప్పినట్లుగా ఉందన్న అభిప్రాయం వారిలో వినిపిస్తోంది. నాయీ బ్రాహ్మణలకు ఏదో మేలు చేశామన్న అభిప్రాయం కల్పించడానికే ఈ ఉత్తర్వులు ఇచ్చారన్న వాదన ఇతర పార్టీల నేతల్లో వినిపిస్తోంది. అయితే ఈ ఉత్తర్వులను కూడా మూడు రోజుల కిందటే ఇచ్చినా ఎందుకు గోప్యంగా ఉంచారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.
వారికి లేనివి, నాకు ఉన్నవి అవే - వాళ్ల కడుపు మంట కనిపిస్తోంది: సీఎం జగన్
ఇతర కుల వృత్తుల వారికీ ఇలాంటి సమస్య ?
నిజానికి కుల వృత్తుల్లో చాలా వరకూ ఇలాంటి అభ్యంతరకర పదాలను ఎదుర్కొంటూ ఉంటారు. చివరికి అగ్రకులాలు వారిని కూడా ఇతరులు ఇలాంటి పదాలతో తిడుతూ ఉంటారు. ఇప్పుడు తమను అలా కించ పరిచే పదాలను నిషేధించాలనే డిమాండ్ ఇతర వర్గాల నుంచి వచ్చే అవకాశం ఉంది. వారందర్నీ సంతృప్తి పరిచి.. వారి డిమాండ్లను పరిష్కరించామనడానికి ప్రభుత్వం రెడీగా ఉండే అవకాశం ఉంది.