AP Employees : ఇక సీఎంతోనే చర్చలు... 9 తర్వాత సమ్మెకైనా వెనుకాడబోమంటున్న ఏపీ ఉద్యోగ సంఘాలు !
ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగసంఘం నేతలు ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది. ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో సీఎంతోనే ఇక నేరుగా చర్చలు జరుపుతామని..9వ తేదీ లోపు స్పందన రాకపోతే ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి ఇచ్చిన జనవరి మూడో తేదీ డెడ్ లైన్ ముగిసింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి వరకూ అధికారులు తమను చర్చలకు పిలిచి అవమానించారని.. ఇక వారితో ఒరిగేదేమీ లేదని నిర్ణయానికి వచ్చారు. ఇక చర్చలు అంటూ జరిపితే ముఖ్యమంత్రితోనే జరుపుతామంటున్నారు. ముఖ్యమంత్రితో ఇప్పటి వరకూ ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం కాలేదు. కార్యదర్శుల కమిటీ చర్చల్లో ఓ అంగీకారానికి వస్తే ఆ తర్వాత ముఖ్యమంత్రిని కలవవచ్చని ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘ నేతలకు చెబుతున్నారు. అయితే వారు చెప్పే ఫిట్‌మెంట్... ఇతర ప్రయోజనాల విషయంలో ఉద్యోగ సంఘ నేతలు పెదవి విరిస్తున్నారు. జీతం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానిస్తున్నారు.
ఈ కారణంగా మళ్లీ ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి రోడ్డెక్కిన ఉద్యోగులు మధ్యలోనే విరమించారు. ఇప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తూండటంతో ఏంచేయాలో తెలియక ఉద్యోగ సంఘం నేతలు గందరగోళపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం అమరావతిలో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం అయింది. ప్రభుత్వానికి మరో వారం రోజులు గడువు ఇవ్వాలని నిర్ణయించుకుంది. పీఆర్సీతో పాటు తమకు సంబంధించిన 71 సమస్యలపై స్పందన రాకపోతే ఈ నెల 9 తర్వాత ఉద్యమించాలని నిర్ణయించుకున్నారు.
Also Read: సినిమా టిక్కెట్లపై అఫిడవిట్‌కు సమయం కావాలన్న ప్రభుత్వం..., ఫిబ్రవరికి వాయిదా వేసిన హైకోర్టు !
ఉద్యమాన్ని జిల్లా స్థాయి ధర్నాలు, సదస్సులతో పునఃప్రారంభిస్తామని ఉద్యోగ సంఘం నేతలు ప్రకటించారు. గతంలో ప్రకటించిన ఉద్యమ షెడ్యూల్‌ను ఫాలో అవుతామని చివరకు చలో విజయవాడకు పిలులు ఇస్తామని చెబుతున్నారు. వర్క్ టూ రూల్, పెన్‌డౌన్ ద్వారా ప్రభుత్వానికి ఉక్కబోత కలుగజేసే వ్యూహన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. అవసరమైతే ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు. అప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే ఆఖరి అస్త్రంగా సమ్మెకు వెళ్తామంటున్నారు.
ఉద్యోగ సంఘ నేతలపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. వారు ప్రభుత్వంతో కుమ్మక్కయి వ్యూహాత్మకంగా ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారన్న విమర్శలు ఉద్యోగుల నుంచి ఎదుర్కొంటున్నారు. మరో వైపు ప్రభుత్వ పెద్దలు కూడా తాము చెప్పిన దానికి అంగీకరించాలని ఒత్తిడి చేస్తున్నారు. కొన్నిఉద్యోగ సంఘ నేతలు పూర్తిగా ప్రభుత్వానికే అనుకూలంగా ఉన్నారు. ఈ క్రమంగా రెండు జేఏసీల నేతలకు ఏంచేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
Also Read: శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన సీడబ్ల్యూసీ డ్యామ్ సేఫ్టీ కమిటీ సభ్యులు