Kesineni Nani: రాధాపై రెక్కీ ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలి... అనుచరులుగా నటిస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు... ఎంపీ కేశినేని నాని కామెంట్స్
టీడీపీ నేత వంగవీటి రాధాను ఎంపీ కేశినేని నాని ఆయన నివాసంలో కలిశారు. రాధాపై రెక్కీని సీబీఐతో విచారణ జరిపించాలని కేశినేని డిమాండ్ చేశారు.
టీడీపీ నేత వంగవీటి రాధాను విజయవాడ ఎంపీ కేశినేని నాని కలిశారు. సోమవారం రాధా నివాసానికి వచ్చిన ఎంపీ కేశినేని నాని.. రెక్కీకి సంబంధించిన వివరాలను అడిగితెలుసుకున్నారు. ఎంపీ నానితో పాటు టీడీపీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం కూడా రాధాను పరామర్శించారు. రాధాపై రెక్కీ ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలని కేశినేని డిమాండ్ చేశారు. వంగవీటి కుటుంబం రాష్ట్రానికి ఓ సంపద అని ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడ ఎంపీగా వంగవీటి రాధా రక్షణ కోసం కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానన్నారు. వంగవీటి కుటుంబానికి అనుచరులుగా నటిస్తూ కొందరు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.
Also Read: నన్ను హత్య చేసేందుకు రెక్కీ చేశారు... నేను దేనికైనా రెడీ... వంగవీటి రాధాకృష్ణ
ఇటీవలే చంద్రబాబు పరామర్శ
వంగవీటి రాధాకృష్ణను టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల పరామర్శించారు. రెక్కీ నిర్వహించిన దానికి సీసీ కెమెరా దృశ్యాలు ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని సమావేశం తర్వాత చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులు అసలేమీ చెప్పడం లేదన్నారు. రాధా రెక్కీ విషయం చెప్పిన తర్వాత అసలేం జరిగిందన్నదానిపై ఆందరిలోనూ ఆందోళన ఏర్పడిందన్నారు. ఆ దిశగా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఏమీ లేవన్నారు. ఇలాంటి పనులు చేసే వారిని పట్టుకుని శిక్షిస్తే మరొకరు అలాంటి ప్రయత్నాలు చేయరని చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పోలీసులు పలువుర్ని అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరిగినా తర్వాత మాత్రం ఖండించారు. దీంతో రెక్కీ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేరని వంగవటి రాధా వర్గీయులు భావిస్తున్నారు.
రెక్కీపై ఎలాంటి ఆధారాలు లేవు
వంగవీటి రాధాపై రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని విజయవాడ సీపీ కాంతి రాణా అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన సీపీ కాంతి రాణా టాటా.. వంగవీటి రాధాపై రెక్కీ గురించి ఆయన ఇచ్చిన సమాచారం తీసుకున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఘటనపై అవాస్తవాలు ప్రసారం చేయొద్దని ఆయన కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. విజయవాడలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం లేదని, పోలీసు అధికారులు రాధాతో మాట్లాడారని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాస్పద ఘటన జరగనప్పుడు కేసు ఎలా పెడతామని సీపీ అన్నారు. రాధాకు భద్రత ఏర్పాటు చేస్తామని సీపీ కాంతి రాణా పేర్కొన్నారు.
Also Read: వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు : విజయవాడ సీపీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి