Vijayawada: వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు : విజయవాడ సీపీ
వంగవీటి రాధాపై రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని విజయవాడ సీపీ కాంతి రాణా ప్రకటించారు. రాధా ఇచ్చిన సమాచారంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
వంగవీటి రాధాపై రెక్కీ వివాదం మరో మలుపు తిరిగింది. రాధాపై రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని విజయవాడ సీపీ కాంతి రాణా అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన సీపీ కాంతి రాణా టాటా.. వంగవీటి రాధాపై రెక్కీ గురించి ఆయన ఇచ్చిన సమాచారం తీసుకున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఘటనపై అవాస్తవాలు ప్రసారం చేయొద్దని ఆయన కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. విజయవాడలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం లేదని, పోలీసు అధికారులు రాధాతో మాట్లాడారని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాస్పద ఘటన జరగనప్పుడు కేసు ఎలా పెడతామని సీపీ అన్నారు. రాధాకు భద్రత ఏర్పాటు చేస్తామని సీపీ కాంతి రాణా పేర్కొన్నారు.
నా హత్యకు రెక్కీ : వంగవీటి రాధా
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి కొందరు రెక్కీ చేశారని ఆరోపించారు. గుడ్లవల్లేరు మండలం చిన్నగొన్నూరు గ్రామంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వంగవీటి రాధా ఆ వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారని రాధా ఆరోపించారు. 'నన్ను ఏదో చేద్దాం అనుకునే వారిని చూసి నేను ఎప్పుడు భయపడను. నేను దేనికైనా సిద్ధం. ప్రజల మధ్యే తిరుగుతాను. వంగవీటి రాధా లేకుండా చేయాలనుకునే వారిని ప్రజలు దూరం పెట్టాలి’’ అని రాధా అన్నారు. రాధా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చను లేవనెత్తాయి. అనంతరం ప్రభుత్వం 2+2 గన్ మెన్లను ఏర్పాటుచేసింది. కానీ రాధా గన్ మెన్లలను తిరస్కరించారు.
Also Read: నన్ను హత్య చేసేందుకు రెక్కీ చేశారు... నేను దేనికైనా రెడీ... వంగవీటి రాధాకృష్ణ
పోలీసులు అసలేం చెప్పడం లేదు : చంద్రబాబు
వంగవీటి రాధాకృష్ణను టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం పరామర్శించారు. రెక్కీ నిర్వహించిన దానికి సీసీ కెమెరా దృశ్యాలు ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని సమావేశం తర్వాత చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులు అసలేమీ చెప్పడం లేదన్నారు. రాధా రెక్కీ విషయం చెప్పిన తర్వాత అసలేం జరిగిందన్నదానిపై ఆందరిలోనూ ఆందోళన ఏర్పడిందన్నారు. ఆ దిశగా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఏమీ లేవన్నారు. ఇలాంటి పనులు చేసే వారిని పట్టుకుని శిక్షిస్తే మరొకరు అలాంటి ప్రయత్నాలు చేయరని చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పోలీసులు పలువుర్ని అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరిగినా తర్వాత మాత్రం ఖండించారు. దీంతో రెక్కీ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేరని వంగవటి రాధా వర్గీయులు భావిస్తున్నారు.
ఆధారాలు ఇస్తే దర్యాప్తు చేస్తాం : మంత్రి వెల్లంపల్లి
వంగవీటి రాధా హత్యకు కుట్ర జరుగుతుందన్న వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. రాధా హత్యకు రెక్కీ నిర్వహించినట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని వెల్లంపల్లి స్పందించారు. రాజకీయలబ్ధి కోసం రాధాను చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే వంగవీటి రంగా హత్య జరిగిందన్నారు. ఇప్పుడు అదే పార్టీలో రాధా ఉన్నారని విమర్శించారు. రాధాను రాజకీయాల్లో మార్చిపోయారన్న మంత్రి వెల్లంపల్లి... చంద్రబాబు చెప్పినట్లు వ్యవహరించకూడదని రాధాకు హితవు పలికారు. ఇప్పటికైనా నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.
Also Read: గన్‌మెన్లను తిరస్కరించిన వంగవీటి.. రెక్కీ ఎవరు నిర్వహించారన్నదానిపై పోలీసుల అంతర్గత విచారణ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి