(Source: ECI/ABP News/ABP Majha)
Jyothula Nehru:కాపుల్ని విడగొట్టి రాజకీయాల కోసం పావుల్ని చేస్తున్నారు: జ్యోతుల నెహ్రూ
Jyothula Nehru: వైసీపీ నేతలు కావాలనే కాపుల్ని రెచ్చగొడ్తున్నారని టీడీపీ సీనియర్ లీడర్ జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. రాజకీయాల కోసం వాళ్లను పావులుగా వాడుకోవడం దారుణం అన్నారు.
Jyothula Nehru: ఏపీలో 20 శాతం ఓట్లు ఉన్న కాపుల్ని రాజకీయాల్లో పావులుగా వాడుకునేందుకే వైసీపీ నేతలు వారిని రెచ్చగొడుతున్నారని టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. అధికార పక్ష నేతలు కాపుల్ని రెచ్చగొట్టడం సరికాదన్నారు. రాజకీయాల కోసం వాళ్లకు ఏదో మేలు చేస్తున్నట్లుగా సమావేశాలు పెట్టి మరీ ఉపన్యాసాలు ఇస్తున్నారని ఆరోపించారు. జనసేనాని పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే.. వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని నెహ్రూ మండిపడ్డారు.
"కాపు ప్రజాప్రతినిధులంతా కలిసి సమావేశాలు పెడ్తే.. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తారు, వారి డిమాండ్లన్నింటినీ ఆశపడ్డాను, అనుకున్నాను. కానీ దురదృష్టం.. అత్యధిక శాతం ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం అయినటువంటి కాపు సామాజిక వర్గాన్ని విచ్ఛిన్నం చేయడానికి, న్యూనతా పరచడానికి ఉపయోగపడ్డట్లు భావించాల్సి వస్తోంది. నేను ఒకే మాట అడుగుతున్నాను.. నిన్న మాట్లాడిన మంత్రులు, ప్రజాప్రతినిధులందరినీ.. చంద్రబాబు నిజంగానే కాపు సామాజిక వర్గానికి శత్రువు అయితే కమిషన్ వేయడం, ఎఫ్ అనే ఒక స్పెషల్ కాటగిరీ పెట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈబీసీ, 10 శాతం ఈబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిందో, ఆ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇక్కడ వినియోగించుకొని 5 శాతం ప్రత్యేకంగా కాపులకే విషయం మీకు గుర్తు రావట్లేదా. అది కాపులకు మంచి జరిగేటటువంటి కార్యక్రమం కాదా. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఐదు శాతం రిజర్వేషన్లు కూడా నిర్మొహమాటంగా తీసేసి వాళ్ల నోట్లో మట్టికొట్టే పరిస్థితి." - జ్యోతుల నెహ్రూ
నిన్న కాపు సామాజిక వర్గీయులతో వైసీపీ నేతలు సమావేశం నిర్వహించారు. దాని తర్వాత జనసేన, టీడీపీ నేతలపై అధికార పార్టీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పొలిటికల్ పార్టీ కాదు.. సినిమా పార్టీ అంటూ మంత్రి గుడివాడ అమర్ నాథ్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ పార్టీ కోసం కూర్చుని మాట్లాడుకోవాల‌్సిన అవసరం తమకు లేదని అన్నారు. విశాఖ నోవాటెల్ హోటల్ లో జరిగిన ఎలిప్ శిక్షణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పార్టీపై, జనసేనానిపై విమర్శలు చేశారు. గడిచిన మూడేళ్లలో జరిగిన కాపు సంక్షేమం కోసం మాత్రమే చర్చించకున్నామని వివరించారు. కాపు సంక్షేమం కార్యాచరణ రూపొందించామన్నారు. రాష్ట్రంలో 20 శాతం ఓట్లు ఉన్న ఒక సామాజిక వర్గానికి మేం ఏం చేశామో వివరించామన్నారు.
కులాల మేలు కోసమే కార్పొరేషన్లు..
కులాల మేలు కోసం పెట్టిన కార్పొరేషన్ల వల్ల మేలు జరగలేదని పవన్ కల్యాణ్ అంటున్నారని, కులాలకు ఇంతకంటే ఎక్కువగా ఏ ప్రభుత్వంలో అయినా సామాజిక న్యాయం జరిగిందా? అని మంత్రి అమర్ నాథ్ ప్రశ్నించారు. దాదాపు 1.8 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో మూడున్నరేళ్ళలోనే వైసీపీ ప్రభుత్వం వేసిందన్నారు. పసుపు కళ్లజోడు పెట్టుకుని, ఎన్టీఆర్ భవన్ స్క్రిప్టుతో మాట్లాడితే పవన్ కు కనిపించవన్నారు. అన్ని కులాలకు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇస్తూ ఆలయ బోర్డుల్లో, నామినేటెడ్ పదవుల్లో సగం అందులోనూ సగం మహిళలకు కేటాయించటం సామాజిక న్యాయం కాదా? అని ప్రశ్నించారు.