Paritala Sunitha: 'అస్తమించని సూర్యుడు పరిటాల రవి' - ప్రజల ప్రేమ తమపై బాధ్యత పెంచిందన్న పరిటాల సునీత
Ananthapuram News: పరిటాల రవి ఓ శక్తి అని మాజీ మంత్రి పరిటాల సునీత కొనియాడారు. సత్యసాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో పరిటాల రవి 19వ వర్థంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
Paritala Sunitha Participated in Paritala Ravi Death Anniversary: పరిటాల రవి ఓ వ్యక్తి కాదు శక్తి అని మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha), ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జీ పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) కొనియాడారు. ఆయన అస్తమించని సూర్యుడని.. ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ ఉంటారని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో పరిటాల రవి (Paritala Ravi) 19వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరిటాల సునీత, శ్రీరామ్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిటాల రవి చిత్ర పటానికి నివాళి అర్పించారు. జిల్లా నలుమూలల నుంచే కాక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి సైతం వేలాదిగా అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారగా, వారికి పరిటాల సునీత కుటుంబ సభ్యులు అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు.
'ప్రజల గుండెల్లో ఉన్నారు'
ప్రత్యర్థుల దాడిలో పరిటాల రవి చనిపోయి 19 ఏళ్లు గడిచినా.. ప్రజల గుండెల్లో ఇప్పటికీ జీవించే ఉన్నారని పరిటాల సునీత అన్నారు. ప్రజలు తమపై చూపిస్తున్న ప్రేమ.. తమ కుటుంబానికి మరింత బాధ్యత పెంచుతోందన్నారు. పరిటాల రవికి ఉన్న అభిమానాన్ని చూసి ఓర్వలేకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల రవీంద్ర భౌతికంగా దూరమై 19 సంవత్సరాలు దాటుతున్నా.. ఇప్పటికీ ఆయన పట్ల చూపుతున్న అభిమానం, ఆదరణ ఎన్ని జన్మలెత్తినా మరువలేనిదని అన్నారు. జనం మదిలో పరిటాల రవీంద్ర ఎప్పుడూ బతికే ఉంటారని వ్యాఖ్యానించారు.
Q) పరిటాల రవీంద్ర గౌరవాన్ని తగ్గించే విధంగా కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు..
A) కొంతమంది పిచ్చి కుక్కల్లా ఉంటూ.. పిచ్చి పిచ్చి కూతలు కూడా కూస్తుంటారు. ఎన్నికల్లో వారిని కొట్టేందుకు పరిటాల అభిమానులు సిద్ధంగా ఉన్నారు. పరిటాల రవి గురించి వారికి ఏం తెలుసు వర్ధంతి కానీ జయంతి కానీ అభిమానులు వారి సొంత డబ్బులతో వెంకటాపురం వచ్చి సందర్శిస్తుంటారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అంటే ఎవరికి తెలుసు.. పరిటాల శ్రీరామ్ మీద గెలిచిన వ్యక్తి అంటేనే అందరికీ తెలుసు. పరిటాల రవీంద్రను పరిటాల కుటుంబాన్ని విమర్శిస్తేనే తనని గుర్తు పెట్టుకుంటారని ఎమ్మెల్యే ఆ విధంగా వ్యాఖ్యానిస్తుంటారు. పరిటాల రవీంద్ర చరిత్ర గురించి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తెలుసుకోవాలని.. రానున్న ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్తామని తెలిపారు.
Q) చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. వైసీపీని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు
A) ఎప్పుడు ఎలక్షన్లో వస్తాయా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించాలని అనే కోణంలో ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, అన్ని వర్గాల వారు ఈ ప్రభుత్వం హయాంలో ఇబ్బందిపడ్డారు. ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని ప్రాంతాల్ని అభివృద్ధి చేయడమే చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
Q) వైయస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. షర్మిల ప్రభావం టీడీపీ మీద ఉంటుందా లేక వైసీపీ మీద ఉంటుందా.?
A) అన్న కోసం వైఎస్ షర్మిల గతంలో పాదయాత్ర చేసి కష్టపడింది. జగన్ సీఎం అయ్యాక తోటి చెల్లెల్ని వేరే రాష్ట్రానికి తరిమేశాడు. అన్నీ తెలుసుకొని ఆమె కాంగ్రెస్ లోకి వచ్చింది. ఆమె హస్తం పార్టీలో చేరి ఎన్నో రోజులు కాలేదు. ఎవరి వల్లా మాకు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గదు. మేము కచ్చితంగా గెలవబోతున్నాం మా పార్టీ అధికారంలోకి రాబోతోంది.
Q) గత కొంతకాలంగా పరిటాల కుటుంబానికి ఒక టికెట్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు.
A) టికెట్లు ఇచ్చేది చంద్రబాబు నాయుడు. సార్ మాకు చెప్పారు.. ధర్మవరం, రాప్తాడులో మేము గెలవబోతున్నాం. అంటూ పరిటాల సునీత ఏబీపీ దేశానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
Also Read: Vijayamma support for whom : ఏపీలో జగన్, షర్మిల రాజకీయాలు - విజయమ్మ మద్దతు ఎవరికి ?