(Source: ECI/ABP News/ABP Majha)
Ayyanna Patrudu:: ప్రధాని మోదీకి అయ్యన్న పాత్రుడు లేఖ, రుషికొండను చూడకుండా వెళ్లొద్దని వినతి
Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానుల అంశం, రిషికొండ తవ్వకంపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ప్రధానికి లేఖ రాశారు. విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు రిషికొండను చూడాలన్నారు.
Ayyanna Patrudu: తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు రుషికొండను కళ్లారా చూడాలని లేఖలో పేర్కొన్నారు. రుషి కొండపై జరుగుతున్న అక్రమాలను స్వయంగా చూడాలని సూచించారు. ఏరియల్ సర్వే ద్వారా రుషి కొండ పై జరుగుతున్న ఆక్రమణలు చూడాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగుతుంది అనే స్పష్టతను ప్రధాన మంత్రి ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు కోరారు.
"పనులు సాగడం లేదూ.. మీరైనా చూడండి"
నరేంద్ర మోదీ స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతిని కాదని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 3 రాజధానులు అంటోందని, ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరును లేఖలో అయ్యన్నపాత్రుడు వివరించారు. పోలవరం పనులు జరుగుతున్న తీరునూ ఇందులో ప్రస్తావించారు. మూడున్నర సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టు పనులు జరగడం లేదని, ప్రధాన మంత్రి స్థాయిలో సమావేశం నిర్వహించి పోలవరం పనులు తీరుపై సమీక్షించడమే కాకుండా, నిర్మాణ పనులు వేగంగా అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని లెటర్ లో అయ్యన్నపాత్రుడు కోరారు. ఈ నెల 12వ తేదీన ప్రధాని విశాఖ పర్యటనకు రానున్నారు. రూ. 10,472 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
"9.88 ఎకరాలకు అనుమతి, కానీ.."
61 ఎకరాల మేర విస్తరించి ఉన్న రుషి కొండపై హిల్ ఏరియాలో 9.88 ఎకరాల్లో ప్రాజెక్టు కోసం ఏపీ టీడీసీ అనుమతి తీసుకుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. 9.88 ఎకరాలకు కాకుండా అంతకు రెండింతల తవ్వకాలు జరిగినట్లు అక్కడి పరిస్థితి చూస్తే తెలుస్తోంది. రుషి కొండపై మధ్యలో చిన్న భాగం మినహాయిస్తే కొండ మొత్తాన్ని తవ్వినట్లు కనిపిస్తోంది. రుషి కొండపై జరిగిన తవ్వకాల్లో కేవలం 139 చెట్లను మాత్రమే తొలగించినట్లు అటవీ శాఖ పేర్కొంటోంది. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి చూస్తే మాత్రం వేలాది చెట్లను తొలగించినట్లు అర్థం అవుతోందని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖలో సముద్రం ఒడ్డున ఉండే రుషికొండలో గతంలో టూరిజం రిసార్ట్స్ ఉండేవి. వాటిని కూల్చి వేసి.. కొండను మొత్తం తవ్వేశారు. అక్కడ టూరిజంకు సంబంధించిన పెద్ద హోటల్ కడుతున్నామని చెప్పుకొచ్చారు. అయితే పర్యావరణ నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘించి రుషికొండలో తవ్వకాలు జరుపుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ప్రభుత్వం మాత్రం అనుమతి ఉన్న వరకే తవ్వుతున్నామని వాదించింది. కానీ 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే, 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు మ్యాపులు సమర్పించారు. దీంతో హైకోర్టు సర్వే చేయాలని ఆదేశించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. అసలు రిషికొండ తవ్వకానికి కారణం టూరిజం కాదని.. సీఎం క్యాంప్ ఆఫీస్ అన్న ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజులు వాటిని ఖండించిన వైసీపీ నేతలు .. మంత్రులు.. ఇటీవల కడితే తప్పేంటి అని ఎదురు దాడి చేయడం ప్రారంభించారు. ఈ పరిణామాలన్నీ వచ్చే విచారణలో హైకోర్టులో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.