వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కూటమి 160 సీట్లలో విజయం: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి 160 సీట్లు వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు.
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- జనసేన కూటమికి 160 సీట్లు వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న నేతల్లో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నిజాయతీపరుడని డీఎల్ కితాబిచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్‌కు ప్రయత్నించి ఉంటే ఎప్పుడో వచ్చేదన్న ఆయన, ఫైబర్‌నెట్‌లోనూ ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ-జనసేన పొత్తుతో ఊపు వచ్చిందన్నారు. చంద్రబాబు, పవన్ పొత్తు మనస్పర్థలు లేని కూటమి అన్న ఆయన, 160 సీట్లు రావొచ్చన్నారు. జగన్ అనుచరుల దురాగతాలు ప్రజల్లో నాటుకుపోయాయన్న డీఎల్ రవీంద్రారెడ్డి, ఏపీ సర్వనాశనం కావడానికి సీఎం జగన్మోహన్ రెడ్డే కారణమన్నారు.
చంద్రబాబు అరెస్టును తప్పుపట్టిన డీఎల్
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఇటీవల తీవ్రంగా తప్పుపట్టారు డీఎల్ రవీంద్రారెడ్డి. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఎక్కడికీ పారిపోరన్న ఆయన, చంద్రబాబు ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరించే వ్యక్తని తెలిపారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని, అరెస్టు చేసిన తర్వాత నంద్యాల కోర్టులోనే ఎందుకు ప్రవేశపెట్టలేదని డీఎల్ ప్రశ్నించారు. జగన్‌కు గతంలో ఓటేసినందుకు తన చెప్పుతో కొట్టుకోవాల్సిన పరిస్దితి తలెత్తిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లా మైదుకూరు నుంచి తిరిగి పోటీకి సిద్దమవుతున్న డీఎల్.. తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. గతంలో మంత్రిగా పనిచేసిన డీఎల్ రవీంద్రారెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు. అప్పట్లో జగన్‌ను తీవ్రంగా విమర్శించిన డీఎల్.. ఉన్నట్లుండి గత ఎన్నికల సమయంలో జగన్‌కు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు మళ్లీ జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి వైఎస్ విజయమ్మకు, వైఎస్ షర్మిలకు ముప్పు పొంచి ఉందంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు డీఎల్ రవీంద్రారెడ్డి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వారిద్దరికి జగన్ వల్ల ప్రమాదం పొంచి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు వైఎస్ కుటుంబంలో ఎవరో ఒకరి హత్య జరగొచ్చు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా జగన్ సానుభూతి కోసమే కోడికత్తి దాడి డ్రామాలాడారని డీల్ ఆరోపించారు. గతంలో బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కూడా జగన్ సానుభూతి కోసమే జరిగిందని డీఎల్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని కాపాడగలరని డీఎల్ ధీమా
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని కాపాడుతారని డీఎల్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిగా కలిసి పోటీ చేసి, ఏపీని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పవన్ కల్యాణ్‌కు నిజాయితీ వున్నా పాలనలో అనుభవం లేదని, సీఎం అయిన నాటి నుంచే వైసీపీ అధినేత జగన్ అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించారు. డీఎల్ రవీంద్రారెడ్డి కడప జిల్లా మైదుకూరు నుంచి 1978 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు ఘన విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా వున్నారు.