(Source: ECI/ABP News/ABP Majha)
Chintamaneni Prabhakar Arrest: మాజీ ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ అరెస్టు.. తక్షణమే విడుదల చేయాలని టీడీపీ డిమాండ్... డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయ కక్షతోనే చింతమనేనిని అరెస్టు చేశారని టీడీపీ ఆరోపిస్తుంది. రాష్ట్రంలో పోలీస్ రాజ్ నడుస్తోందని డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరల పెంపుపై టీడీపీ నిరసనలు చేపట్టంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో పెట్రో ధరలపై నిర్వహించిన ధర్నాలో చింతమనేని పాల్గొన్నారు. ఈ ధర్నా విషయమై పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా చింతపల్లి పోలీసులు చింతమనేనిని అరెస్టు చేశారు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు తరలించినట్టు సమాచారం.
విశాఖ గ్రామీణ ఎస్పీ కార్యాలయం వివరణ
మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్టుపై విశాఖ గ్రామీణ ఎస్పీ కార్యాలయం స్పందించింది. విశాఖ ఎజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అనుమానాస్పద రీతిలో పది వాహనాలు తిరుగుతున్నట్లు స్థానికులు సమాచారం అందించారని తెలిపారు. గంజాయి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, మూగజీవాల అక్రమ, రవాణా మావోయిస్టు సానుభూతి పరుల కదలికలపై ఈ ప్రాంతంలో చెక్ పోస్టు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. దారకొండ ఏజెన్సీ ప్రాంతంలో పదికి పైగా వాహనాల్లో కొంతమంది అలజడి సృష్టిస్తున్నట్లు స్థానికులు అందించిన సమాచారం మేరకు చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు చేశామని ఎస్పీ కార్యాలయం తెలిపింది. వీటిల్లో ఓ వాహనంలో ప్రయాణిస్తున్న చింతమనేని పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేకుండా సమాధానాలు చెప్తుండడంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. చింతమనేని ప్రభాకర్ తో పాటు మరికొన్ని వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, ఇతర వాహనాల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం చింతమనేని ప్రభాకర్ ని ఏలూరు పోలీసులకు అప్పగిస్తామన్నారు. ఏలూరు పోలీస్ స్టేషన్ లో చింతమనేనిపై ఇప్పటికే పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.
Also Read: Breaking News: తిరుమలలో సంప్రదాయ భోజనాన్ని నిలిపివేస్తున్నాం : వైవీ సుబ్బారెడ్డి
డీజీపీకి చంద్రబాబు లేఖ
చింతమనేని అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఈ మేరకు డీజీపీకి గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో పోలీస్ రాజ్ అమలు చేస్తుందని ఆరోపించారు. శాంతియుతంగా పెట్రోల్, డిజీల్ ధరల పెంపుపై నిరసనలు చేసినా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయడం సరికాదని హితవు పలికారు. చింతమనేనిపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని పేర్కొన్నారు. విశాఖలో వివాహ కార్యక్రమానికి హాజరైన వ్యక్తిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్ష నేతలపై పోలీసుల చర్యలు సరికాదని చంద్రబాబు హెచ్చరించారు.
టీడీపీ ధర్నా విజయవంతం అందుకే...
ఏపీలో వైసీపీ ఆటవిక పాలన సాగిస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న టీడీపీ నేతలను వేధిస్తూ, జైలులో పెటుతున్నారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు లేదా అని ప్రశ్నించారు. శనివారం టీడీపీ నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. పోలీస్ విధులకు చింతమనేని ప్రభాకర్ ఆటంకం కలిగించలేదని పేర్కొన్నారు. విశాఖలో వివాహానికి వెళ్లిన చింతమనేనిని అక్కడి వెళ్లి మరీ అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.
గడిచిన రెండున్నరేళ్లలో చింతమనేని ప్రభాకర్ పై 30కి పైగా అక్రమ కేసులు బనాయించారని అచ్చెన్నాయుడు విమర్శించారు. అక్రమ కేసుల ద్వారా అణిచివేయాలని చూస్తే టీడీపీ మరింత ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని పేర్కొన్నారు. వేధింపులు, అక్రమ కేసులు, అరెస్ట్ లకు టీడీపీ భయపడదని పేర్కొన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన చింతమనేని ప్రభాకర్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామని తెలిపారు.
రాజకీయ కక్షతోనే అరెస్టు
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ ను ఆయన ఖండించారు. అధికార పార్టీకి కొంత మంది పోలీసులు వత్తాసు పలుకుతున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్త ఇంటి కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళ్లిన చింతమనేనిని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగినందుకు అరెస్ట్ చేసామని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. సీఎం జగన్ రాజకీయ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. చింతమనేనిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి అరెస్ట్ ఉదంతం తాజా ఉదాహరణ. ఎందుకు అరెస్ట్ చేసారో చెప్పలేని దుస్థితిలో ఉన్నారంటే అధికార పార్టీకి కొంత మంది పోలీసులు ఎంతగా ఊడిగం చేస్తున్నారో అర్ధమవుతుంది.(1/3) pic.twitter.com/lDv6bxIxII
— Lokesh Nara (@naralokesh) August 30, 2021
Also Read: Vizag Capital Row : "ఏపీ రాజధాని"తో కేంద్రం చెలగాటం..! ప్రతీసారి ఈ వివాదమెందుకు ?