Breaking News: బెయిల్ పై చింతమనేని ప్రభాకర్ విడుదల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 30న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. రోడ్డుపై పడి ఉన్న గేదె కళేబరంపై ఆటో ఎక్కడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వాళ్లను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బెస్తవారిపేట మండలం కొత్తపల్లిలో కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరనున్నారు. 2వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొననున్నారు. సెప్టెంబర్ 3న మధ్యాహ్నం హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్ తిరిగి బయల్దేరనున్నారు.
బెయిల్ పై చింతమనేని ప్రభాకర్ విడుదల
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‍ను దెందులూరు పోలీసులు బెయిల్ పై విడుదల చేశారు. అనంతరం ఆయన స్వగ్రామం పెదవేగి మండలం దుగ్గిరాల చేరుకున్నారు. నిన్న ఆయన్ను చింతపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరల పెంపుపై టీడీపీ నిరసనలు చేపట్టింది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో పెట్రో ధరలపై నిర్వహించిన ధర్నాలో చింతమనేని పాల్గొన్నారు. ఈ ధర్నా విషయమై పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా చింతపల్లి పోలీసులు చింతమనేనిని అరెస్టు చేశారు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు తరలించారు.





















