Andhra Pradesh గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ, వారిపై చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్
Chandrababu wrote letter to Abdul Nazeer: టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.
అమరావతి: టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వాడుకుంటూ టీడీపీ నేతలను వేధిస్తోందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు. మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్‌ను అక్రమంగా అరెస్టు చేశారని ప్రస్తావిస్తూ APSDRI దుర్వినియోగాన్ని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.
లేఖలో పేర్కొన్న అంశాలు..
‘ప్రభుత్వ విభాగాల ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తలపై సీఎం జగన్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. APSDRI ద్వారా టీడీపీ నేతలను బెదిరించి ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. APSDRIను ప్రతిపక్షాలను వేధించేందుకు ఆయుధంగా ప్రభుత్వం వాడుకుంటోంది. అధికార పార్టీకి విధేయుడైన చిలకల రాజేశ్వరరెడ్డిని ఆ సంస్థకు ప్రత్యేక కమిషనర్‌గా నియమించుకుని టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కూడా ఈ విభాగం ద్వారా కేసుల పెట్టి ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను కేసులో ఇరికించి అరెస్టు చేశారు. శరత్ పనిచేసిన సంస్థలో కేవలం 68 రోజులు మాత్రమే అడిషనల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. అయినా APSRDI డిప్యూటీ డైరెక్టర్ సీతారామ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జరిమానా విధించి విచారణ జరుపుతోంది.
కేంద్ర సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటలిజెన్స్ విచారణ చేస్తుండగానే మళ్లీ అదే అంశాన్ని ఏపీఎస్‌డీఆర్‌ఐ విచారణకు స్వీకరించడం ఆశ్చర్యంగా ఉంది. టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులే లక్ష్యంగా తప్పుడు కేసులను ప్రభుత్వం బనాయిస్తోంది. రాష్ట్రంలో APSDRI ఎందుకు స్థాపించారు.. దాని లక్ష్యాలు ఏమిటి? కేవలం టీడీపీ నేతలను వేధించడమే APSDRI పనా? APSDRI రాష్ట్రంలో ఏర్పడ్డాక ఎన్ని కేసులు నమోదు చేసింది? ప్రభుత్వం సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ నేతలను కేసుల పెట్టి వేధిస్తోంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా APSDRI ద్వారా ప్రత్యర్థులను ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపరిచే కుట్ర చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో APSDRI వేధింపులు భరించలేక పలువురు వ్యాపారవేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనే భయంతో టీడీపీ నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక పనులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. APSDRIని దుర్వినియోగం చేసే ప్రభుత్వం చర్యను నిలువరించాలని’ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు రాసిన లేఖలో చంద్రబాబు కోరారు.