(Source: ECI/ABP News/ABP Majha)
Andhra Pradesh: జగనన్న బాణం రివర్స్ గేర్ లో వస్తోంది, టీడీపీ గెలుపు ఖాయం: చంద్రబాబు
TDP Kamalapuram meeting: ఐదేళ్ల పాలనలో సొంత జిల్లాకు, రాయలసీమకు చేసిందేంటని సీఎం వైఎస్ జగన్ రెడ్డి (AP CM YS Jagan)ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్నించారు.
Ra Kadalira TDP Meeting: కమలాపురం: ఐదేళ్ల పాలనలో సొంత జిల్లాకు, రాయలసీమకు చేసిందేంటని సీఎం వైఎస్ జగన్ రెడ్డి (AP CM YS Jagan)ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్నించారు. కడపలో గడపగడపా యుద్ధానికి సిద్ధమంటోంది. ఈ కమలాపురం సభకు వచ్చిన జనమంతా తాను చేస్తున్న పోరాటం ప్రజల కోసమని చాటిచెప్పారని పేర్కొన్నారు. ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు (TDP Chief Chandrababu) ప్రసంగించారు. 2019లో కడపలో అన్నిసీట్లలో వైసీపీనే గెలిపించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఉమ్మడి కడప జిల్లాలో ఒక్కరికైనా న్యాయం జరిగిందా? ఉద్యోగాలు వచ్చాయా? రైతులు, మహిళలు సంతోషంగా ఉన్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కడప జిల్లాలో జగన్ ఒక్కడికి న్యాయం జరిగిందంటూ సెటైర్లు వేశారు. అతనితోపాటు మరో ఇద్దరు, ముగ్గురు బాగుపడ్డారని ఎద్దేవా చేశారు.
‘వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ గెలవడం ఖాయం. పులివెందుల ప్రజలు ఇలాంటివాడినా తాము గెలిపించింది అని బాధపడుతున్నారు. కడపజిల్లాలో కరువు వచ్చి, 35 మండలాలు తీవ్ర దుర్భిక్షంలో ఉన్నాయి. 20 సంవత్సరాల్లో ఇంత తక్కువ వర్షపాతం జిల్లాలో ఎప్పుడూ నమోదు కాలేదు. కానీ జిల్లాలో కరువు మండలాలను సీఎం ప్రకటించడం లేదు. ఎన్నికల ముందు జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అన్నాడు. కథలు చెప్పాడు.. ముద్దులు పెట్టాడు. చివరకు ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడు’ అన్నారు చంద్రబాబు.
హు కిల్డ్ బాబాయి?
హూ కిల్డ్ బాబాయ్? ఈ స్టోరీ టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్ని కూడా మరిపిస్తుంది. ఎన్నో మలుపులు ఉన్నాయని వివేకా హత్యపై గుండెపోటు అంటూ, రక్తపు వాంతులు అంటూ తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. పోస్టుమార్టంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు తండ్రి లేడు, బాబాయి లేడు అంటూ గత ఎన్నికల్లో ఓట్లు అడిగిన జగన్ రెడ్డికి నేడు వివేకా హత్యపై సమాధానం చెప్పే ధైర్యం ఉందా? నాడు సీబీఐ కావాలని కోర్టుకెళ్లారు, అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ వద్దన్నారు. వివేకాకు రెండో భార్య వ్యవహారం, బెంగుళూరు ఆస్తులు వల్లే హత్య అంటూ ప్రచారం చేశారని గుర్తుచేశారు. తర్వాత కూతురు సునీత, ఆమె భర్తపై తప్పుడు ప్రచారం చేశారు. ఏ తప్పు చేయని కోడికత్తి శ్రీను జైల్లో ఉన్నాడు బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి మాత్రం బయట తిరుగుతున్నాడని ఆరోపించారు. దోషులు అరెస్ట్ కాకుండా నిర్దోషులు అరెస్ట్ అవుతున్నారు. కడప గడ్డపై నిలబడి అడుగుతున్నా...హు కిల్డ్ బాబాయి దీనికి జగన్ సమాధానం చెప్పాలి?
వైసీపీ పాలనలో బాదుడే బాదుడు
‘టీడీపీ హయాంలో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు ఇచ్చాం. పెళ్లికానుక, విదేశీ విద్య వంటి సంక్షేమ పధకాలు నేడు ఉన్నాయా? రేషన్ షాపుల్లో 18 రకాల వస్తువులు ఇచ్చాం. వైసీపీ నేతలు పెన్నా నది నుంచి ఇసుక దొంగ రవాణా చేస్తున్నారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొడుతున్నారు. టీడీపీ నాణ్యమైన మద్యం రూ. 60 కి విక్రయిస్తే నేడు నాసిరకం మద్యం రూ. 250 కి విక్రయిస్తున్నారు. పైగా మద్యపాన నిషేదం అని చెప్పి మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి రూ. 36 వేల కోట్లు అప్పు తెచ్చారు. పెట్రోల్, డీజీల్, ఆర్టీసీ రేట్లు అన్ని రేట్లు పెంచారు. ఆస్తిపన్ను, నీటి పన్ను చివరకు చెత్తపై కూడా పన్ను వేశారు. కరెంట్ చార్జీలు 9 సార్లు పెంచారు. అప్పుల కోసం రైతుల మోటార్లకు మీటార్లు పెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంట్ చార్జీలు పెంచేది లేదని’ చంద్రబాబు స్పష్టం చేశారు.
రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి
కడప స్టీల్ ఫాక్టరీ రిబ్బన్లు కట్ చేయటం రంగులు వేసుకోవటం తప్ప జగన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు చంద్రబాబు. రాయలసీమకు మొదటిసారిగా నీళ్లిచ్చిన ఘనత ఎన్టీఆర్ దే. గండికోట రిజర్వాయర్, తెలుగు గంగను తవ్విన వ్యక్తి ఎన్టీఆర్. 2014- 19 లో రూ. 12,500 కోట్లు ఒక్క కడప జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశామన్నారు. గండికోట ద్వారా పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత టీడీపీదే. మేం ఖర్చు చేసిన దానిలో కనీసం 20 శాతమైనా జగన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి. పట్టిసీమ ద్వారా 120 టీఎంసీలు రాయలసీమకు ఇచ్చాం. కానీ నేడు రైతుల కళ్లలో నీళ్లు పారుతున్నాయన్నారు.