Chandrababu Excellent Comeback: అగ్గికి వాయువు తోడైతే రిజల్ట్ ఇదీ - 2019 ఓటమి తర్వాత టీడీపీ సూపర్ కమ్‌బ్యాక్, దేవుడి స్క్రిప్ట్ మరి!
Andhra Pradesh Election 2024 Results: ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ ఎన్డీఏ కూటమి భారీగా సీట్లు నెగ్గింది. జూన్ 12న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

NDA wins Andhra Pradesh Election 2024: పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేని ఓటమి నుంచి.. దిక్కులు పిక్కటిల్లేలా విజయ గర్జన చేసింది తెలుగుదేశం. కూటమి కట్టి.. ఐదేళ్ల తర్వాత.. ఏపీ గడ్డపై పసుపు పతాకం ఎగరేసింది. వై నాట్ 175 అన్న గర్వాన్ని చాలా సైలంట్ గా అణచివేశారు చంద్రబాబు. కచ్చితంగా ఈ విజయం మూడు పార్టీల కూటమిదే. కలిసికట్టుగా వెళ్లారు కాబట్టి.. విజయానికి అర్హత కూడా ముగ్గురిదీ.. ఏపీలో ఈ స్థాయి ప్రభంజనానికి కారణం ఏంటి.. బీజేపీ సహకారమా... చంద్రబాబు చాతుర్యమా..? పవన్ కళ్యాణ్ ఆవేశమా అంటే ఇవన్నీ... కానీ ఈ విజయాన్ని చూసిన తర్వాత నాకొక ఆలోచన వచ్చింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన రజనీకాంత్ బ్లాక్ బస్టర్ జైలర్ గుర్తొచ్చింది. ఉరుముకు ..మెరుపుకు.. పుట్టాడురా.. పిడుగును పిడికిట పట్టాడురా... అనే సాంగ్ ఇక్కడ వేయాలని ఉంది. కానీ కాపీరైట్ వస్తుందని మా వీడియో ప్రొడ్యూసర్లు ఒప్పుకోరు. సరే అదంతా ఎందుకు చెబుతున్నా అంటే..
జైలర్ తో రజీనీ ఫామ్ లోకి వస్తే.. ఎలక్షన్ తో చంద్రబాబు..
జైలర్ సినిమా థీమ్ చూస్తే.. రజనీకాంత్... తన ప్రత్యర్థిని ఎదుర్కొవడానికి ఇద్దరు స్నేహితులను వాడుకుంటాడు. కన్నడ, మలయాళ సూపర్ స్టార్ట్స్ శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ఓ రోల్స్ చేశారు. రజనీకి అవసరం వచ్చినప్పుడల్లా వాళ్ల ఎంట్రీ ఉంటుంది. రజనీ స్వతహాగా కెపాసిటీ ఉన్నవాడే అయినా కూడా పరిస్థితులు వాళ్ల అవసరాన్ని కల్పిస్తాయి. అలాగే సినిమాలో వాళ్ల ఎంట్రీ, వాళ్ల హెల్ప్ ఆడియన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. చూశారా... రజనీకాంత్ ది చంద్రబాబుది ఇంచు మించు ఒకే వయసు.. ఒకే పర్సనాలిటీ.. ఇద్దరికీ హిట్ కొట్టి చాన్నాళ్లైంది. జైలర్ తో రజీనీ ఫామ్ లోకి వస్తే.. ఎలక్షన్ తో చంద్రబాబు సీన్ లోకి వచ్చేశాడు. ఆ సినిమా సిల్వర్ స్క్రీన్‌పై హిట్ అయితే ఈ సినిమా పొలిటికల్ తెరపై బ్లాక్ బస్టర్ అయింది..
వైసీపీకి జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పులి
జింకను వేటాడటానికి పులి ఎంత ఓపికగా ఉంటాదో చూశావా అనే డైలాగ్ ఉంటుంది కదా.. అట్టాంటిది పులినే వేటాడాలి అంటే.. ఎందుకంటే వైసీపీ వాళ్లు జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పులి అంటారు. ఆ పులి 2019లో కొట్టిన దెబ్బకు.. తెలుగుదేశం పని అయిపోయిందనుకున్నారు. వయసు మీద పడుతున్న చంద్రబాబు మళ్లీ లేవడన్నారు. మంగళగిరిలో ఓడిపోవడంతో కొడుకు పనీ అంతే అన్నారు. కానీ వీళ్లకి తెలియందేంటంటే.. ఇవతల దెబ్బతింది కూడా ఇలాంటి డెక్కా మొక్కీలు ఎన్నో తిన్న పులే. 2004లో వైఎస్సార్ లీడ్ చేసిన కాంగ్రెస్‌లో పరాభవం తర్వాత.. చంద్రబాబు పని అయిపోయిందనుకోలేదు. తిరిగి 2009లో లేస్తాడు అనుకున్నారు. కానీ అప్పుడు ప్రజారాజ్యం రూపంలో అడ్డంకి వచ్చింది. ఇక కష్టమే అనుకన్నాక మళ్లీ లేచాడు.
నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా సంతకం
2014లో పార్టీని నిలబెట్టి.. తానూ నిలబడ్డాడు. ఓ పదేళ్ల పాటు అధికారంలో లేకపోతే రాజకీయ పార్టీల మనుగడ కష్టమన్నారు. అప్పటికే తనతో సాగుతున్న సీనియర్లు.. బయటకెళ్లారు. కొత్త వాళ్లొచ్చారు. రాజకీయాలు మారిపోయాయి. అప్పుడు కూడా కూటమి కట్టి నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా సంతకం చేశారు. అమరావతే అజెండా అంటూ దూసుకుపోతున్న తరుణంలో అతివిశ్వాసానికి పోయి.. తప్పులు చేశారు. జగన్ కావాలన్న కోరిక.. చంద్రబాబు తప్పులు, పవన్ కల్యాణ్ వెళ్లిపోవడం అన్నీ కలిసి 2019లో ఘోరమైన ఓటమి. ఇక ఈసారి చంద్రబాబు పని అంతే అన్నారు. జగన్ ను తట్టుకోవడం తన వల్ల కాదన్నారు. నిజంగా ఎన్నికలకు ఏడాది ముందు వరకూ పరిస్థితి అదే... కానీ... ఆయన అల్లాటప్పా బాబు కాదు.. చంద్రబాబు. చివరి నిమిషంలోనూ శక్తి మేర పోరాడేవాడు. అలాగే చేశాడు.
చంద్రబాబుకు తన బలం కన్నా బలహీనతలు ఎక్కువుగా తెలుసు. కొన్ని బలహీనతలు తెలిసినా వదులుకోలేరు అది వేరే సంగతి కానీ.. అధికారానికి ఏం కావాలో ఆయనకు అందరి కన్నా ఎక్కువ తెలుసు. అందుకోసం ఎలాంటి ప్రయత్నాలైనా.. ఎన్నిసార్లైనా... ఎన్నిరోజులైనా చేస్తారు. ఆయనకు పోటీ వచ్చే సీఎం మాత్రమే శత్రువు.. ఇక మిగిలిన వాళ్లు ఎవరూ చంద్రబాబుకు శత్రువులు కాదు. 2019లో ఆ స్థాయిలో విమర్శలు చేశాక కూడా పవన్ కల్యాన్ ను కావాలనుకున్నాడు. తానే మందడుగు వేశాడు. పొత్తుకు చెయ్యి చాచాడు. 151 సీట్లతో అత్యంత బలంగా ఉన్న జగన్ ను కోటను బద్దలు కొట్టాలంటే తన శక్తి సరిపోవడం లేదు. జనాలకు ఓ ఆవేశం కావాలి. ఓ గొంతు కావాలి. ఆ గొంత పవన్ దగ్గర ఉంది. అందుకోసం ఎంత దాకా అయినా వెళ్లి తెచ్చుకున్నారు...
అవమానాలు ఎదురవుతున్నా వెనక్కి తగ్గలేదు
ఢిల్లీ వెళ్లి సవాలు చేసి ఘోరంగా తిట్టిన నరేంద్ర మోదీ స్నేహం కోసం ఎదురు చూశారు. అవతల నుంచి సానుకూల సంకేతాలు లేకపోయినా.. అవమానాలు ఎదురవుతున్నా భరించారు. అవకాశం కోసం ఎదురు చూశారు. ఒక్కసారి అధికారం చేతిలోకి వస్తే.. అన్నీ మారిపోతాయన్న విషయం అందరి కంటే ఆయనకే ఎక్కువ తెలుసు. అందుకే పొత్తుల విషయంలో పార్టీలో కొంత వ్యతిరేకత ఉన్నా.. మొదట్లో కార్యకర్తలకు నచ్చకున్నా.. ఆయన “ఆ విధంగానే” ముందుకు పోయారు. ఈసారి అధికారంలోకి రాకుంటే.. ఇక ఆ పార్టీ అంతరించిపోతుందని.. జగన్ పార్టీ.. పదే పదే ప్రస్తావించింది. మానసిన దాడి చేసింది. కార్యకర్తల్లో నిరాశ, నైరాశ్యం దరిచేరనీయకుండా చంద్రబాబు పార్టీని కాపాడగలిగారు.
ఉమ్మడి రాష్ట్రానికి అతి పిన్న వయసులోనే సీఎం అయిన చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యి... మూడు సార్లు ఓటమి చెందారు. 2004, 2009లో వైఎస్ పై పోటీ పడినప్పుడు.. ఆయన చంద్రబాబుకు సరిసమానమైన నేత... ఆయన సమకాలీన రాజకీయ నేత. కానీ.. 2014లో జగన్ కు జనాదరణ ఉంది కానీ.. రాజకీయ, పరిపాలన అనుభవం లేదు. అప్పుడు పరిపాలన అనుభవం లేని జగన్ కన్నా చంద్రబాబు మిన్న అని జనం అనుకున్నారు. కానీ 2024 పరిస్థితి అది కాదు. బంపర్ మెజార్టీతో అధికారాన్ని హస్తగతం చేసుకున్న నాయకుడు జగన్. ఈసారి పోటీ పడేది సీఎంగా.. అంటే చంద్రబాబులాగే సీఎంగా పరిపాలన అనుభవం ఉంది. పైగా ఇంటింటికీ లక్షల్లో సంక్షేమాన్ని పంపింగ్ చేసిన బ్యాకింగ్ ఉంది. అన్ని చోట్ల నాయకగణం, సోషల్ మీడియా అన్నీ రకాలుగా చంద్రాబాబును చుట్టేస్తున్నాయి.
పైకి కనిపించని ఓ నిప్పుల కొలిమి చంద్రబాబు..
అప్పుడే ఆయనకు అర్థం అయింది. తనకు ఇతరుల అవసరం ఉందని.. 2019 దెబ్బతో కేంద్రం అండ లేకుండా ఎలక్షనీరింగ్ చేయలేనని చంద్రబాబుకు తెలిసొచ్చింది. చంద్రబాబు పైకి కనిపించని ఓ నిప్పుల కొలిమి.. ఆయన నివురు గప్పిన నిప్పులా ఉంటాడు. అది మండాలి అంటే అగ్గికి వాయువు తోడవ్వాలి. అదే పవన్. పవన్ కల్యాన్ పెను ధుమారంతో బాబు చండ్రనిప్పులు కురిపించాడు. మొత్తం వైసీపీని దహించాడు. ఇదంతా సవ్యంగా జరగాలి అంటే.. ఈ నిప్పుల మీద నీళ్లు కురవకుండా వాతావరణం సహకరించాలి. అదే నరేంద్రమోదీ.. ఇవన్నీ వర్కవుట్ అయ్యాయి కాబట్టి .. అగ్గికి వాయువు తోడైనట్లు.. చంద్రబాబుకు పవన్ జోడై.. మొత్తాన్ని కాల్చేశారు.
చంద్రబాబు అంత ఓపిక ఉన్న నాయకుడు సమకాలిన రాజకీయాల్లో కనబడరు. ఏ దశలో నమ్మకాన్ని కోల్పోడు. నాయకులు పోయినా కార్యకర్తలను కాపాడుతారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాల దెబ్బకు.. 90శాతం స్థానాలను కైవసం చేసుకుంటున్న తరుణంలో పార్టీని కాపాడుకోవాలి అంటే చాలా చాలా సామర్థ్యం ఉండాలి. మిన్ను విరిగి మీద పడ్డా... తన 40శాతం ఓటు బ్యాంకు తగ్గకుండా చూసకున్నాడు. ఇక మిగిలిన ఓట్ల కోసం పవన్, మోదీ దగ్గరకు ఏ మాత్రం సంకోచించకుండా వెళ్లి అడిగారు. ఒంటరిగా రాలేడు అని అవతల వాళ్లు రెచ్చగొట్టినా.. పొత్తును చెడగొట్టేందుకు పై స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చివరి వరకూ ఈ పొత్తు సజావుగా సాగేందుకు చంద్రబాబు తన శాయశక్తులా ప్రయత్నించారు.
యువగళం పేరిట జనంలోకి లోకేష్..
ఇంకో వైపు ఈ ఐదేళ్లలో ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోలేదు. ఏదో ఒక కార్యక్రమంతో జనంలోనే ఉన్నారు. ఎన్నికలకు ముందు తన కొడుకు నారా లోకేష్‌ను యువగళం పేరిట జనంలోకి పంపారు. ఆ తర్వాత ఆయన జనంలోకి వెళ్లి సభలతో సూపర్ హిట్ కొట్టారు.. ఇంతలా దూసుకెళుతున్న తరుణంలో అధికార పార్టీ కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరకు చంద్రబాబును అరెస్ట్ చేయడం ఎవరి వల్లా కాదు అన్న ఓ ప్రచారాన్ని తిప్పి కొడుతూ ఆయన్ను జైల్లో కూడా వేశారు. 55 రోజులు జైలులో ఉన్నా... చంద్రబాబు చెక్కుచెదరలేదు. చివరి వరకూ వదల్లేదు. అసలు ఇంతటి ధృఢ సంకల్పం, ఓపిక ఉండాలి అంటే.. అతను చంద్రబాబే అయ్యుండాలేమో...
చివరగా ఓ విషయం ఏంటంటే.. చంద్రబాబు సభలకు విపరీతమైన జనాదరణ వచ్చి, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తున్న దశలో... అప్పటికి పొత్త ఇంకా ఖరారు కానీ పరిస్థితుల్లో మనకు పొత్తులు అక్కర్లేదు ఒంటరిగా వెళదాం... అని కొంత మంది నేతలు ప్రస్తావిస్తే.. మనం పొత్తుకు వెళుతోంది.. జగన్ ను దెబ్బకొట్టడానికి కాదు.. చావుదెబ్బ కొట్టడానికి అని చెప్పారట. ఒంటరిగా వెళితే మనం గెలవొచ్చు.. గెలవకపోవచ్చు.. కానీ జగన్ మళ్లీ పైకి లేవకుండా కొట్టాలంటే.. అంతా పకడ్బందీగానే వెళ్లాలి అన్నారట... అదే జరిగింది. అసలు వైసీపీ 11 సీట్లకు పడిపోయే రేంజ్‌లో ఈ దెబ్బ ఉంటుందని కూటమి నేతలు సైతం అనుకోలేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

