Vangaveeti Jayanti: ఏపీలో కాపు రాజకీయాలు - వైసీపీ, టీడీపీ పోటాపోటీగా రంగా జయంతి వేడుకలు
Vangaveeti Jayanti: వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు రావటంతో పోటీ పోటీగా తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Vangaveeti Jayanti: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయాలు కాపులను కేంద్రంగా చేసుకొనిన సాగుతున్నాయి. ప్రధానంగా కాపులు ఆరాధ్యుడిగా భావించే వంగవీటి మోహన రంగా జయంతిని అటు తెలుగు దేశం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోటా పోటీగా నిర్వహిస్తున్నారు.
కాపు రాజకీయం...
ఆంధ్రప్రదేశ్ కులాల వారీగా రాజకీయాలు వేడి మీద ఉన్నాయి. ప్రస్తుతం కాపు సామాజిక వర్గాన్ని కేంద్రంగా చేసుకొని నడుస్తున్న రాజకీయంపై అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇటీవల తుని రైలు ఘటనలో రైల్వే కోర్ట్ లో కేసును ఎత్తివేయటం నుంచి మెదలయిన రాజకీయం, జనసేన అధినేత పవన్ వారాహి వాహనంపై రాష్ట్ర పర్యటనలు చేయటం వరకు ఆసక్తిగా మారాయి. ఇదే సమయంలో మాజీ శాసన సభ్యుడు వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు రావటంతో పోటీ పోటీగా తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
వైసీపీ ఆధ్వర్యాన రంగా జయంతి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాపు నాయకులు వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. అధికార పక్షం నిర్వహించిన జయంతి కార్యక్రమం అయినప్పటికి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా నేతలు పాల్గోన్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో పలువురు కీలక నేతలు హజరయ్యారు. రంగా హత్య ఆ నాటి తెలుగు దేశం నేతల హయాంలో జరిగిందేనని అయితే, రంగా వారసుడు వంగవీటి రాధా కూడా తెలుగు దేశం పార్టిలో చేరటాన్ని నాయకులు తప్పు బట్టారు. అంతే కాదు ప్రస్తుతం రాజకీయ పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వంగవీటి మోహన రంగాను హత్య చేసిన తెలుగు దేశం పార్టి తో చేతులు కలపటంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
కాపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ...
వంగవీటి మోహన రంగా బతికున్నప్పుడు కూడ కాంగ్రెస్ పార్టిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవని, ఇరువురు నేతలు కమిట్ మెంట్ తో పని చేశారని నేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అటు రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో కూడ కాపులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడు జగన్ సైతం కాపులకు మంత్రి పదవులు ఇవ్వటంతో పాటుగా నామినేటెడ్ పదవులు కట్టబెట్టారని, తెలుగుదేశం హయాంలో తుని రైలు ఘటనను కేంద్రంగా చేసుకొని కాపుల పై కేసులు పెట్టి, బెదిరింపులకు పాల్పడి, అరెస్ట్ లు చేస్తే, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తుని ఘటన కేసులను ప్రభుత్వమే వెనక్కి తీసుకున్న ఘనటులు ఉన్నాయని, కాపు నేతల పై పెట్టిన కేసులను ఎత్తేశారని అంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రంగా జయంతి వేడుకలు...
తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలను భారీగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం, వైసీపీ నేతలు పోటా పోటీగా జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. విజయవాడ లోని వంగవీటి మోమన రంగా నివాసం వద్ద ఆయన కాంస్య విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తో పాటుగా పలువురు తెలుగు దేశం నాయకులు నివాళులు అర్పించారు.