TDP News: సిట్టింగ్‌లకు టికెట్ రచ్చ, అనంతపురంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి
TDP Janasena Candidates First List: చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో అనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
AP Elections 2024: అనంతపురం: పొత్తులో భాగంగా జనసేన, టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు శనివారం ప్రకటించారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో అనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సిట్టింగ్ అభ్యర్థులకు కాదని కొత్తవారికి టికెట్ ఇవ్వడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో జిల్లా టిడిపి కార్యాలయంపై కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. పార్టీ ఆఫీసుపై నున్న తెలుగుదేశం పార్టీ పోస్టర్ ను చించివేసి, తాళాలు వేసిన కార్యాలయంను పెద్దపెద్ద రాళ్లతో పగలగొట్టే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్న వారికి కాదని ఇప్పుడు కొత్త అభ్యర్థులను తీసుకురావడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే పున్నం హనుమంతరావు చౌదరికి కాకుండా కొత్త అభ్యర్థి అయిన ఎస్సార్ కన్స్ట్రక్షన్ అధినేత సురేంద్ర బాబుకి టికెట్ కేటాయించారు. పెనుగొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బి కే పార్థసారథి కాదని రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి సవితమ్మకు టికెట్ కేటాయించారు. దీంతో కొందరు గుర్తుతెలియని కార్యకర్తలు తమ నేతలకు టికెట్ ఇవ్వలేదని జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం పై దాడి చేయడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది ఆందోళన చెందుతున్నారు.