AP New Pensions : కొత్త పెన్షనర్లకు గుడ్ న్యూస్, రూ.590 కోట్లు విడుదల చేయనున్న సీఎం జగన్
AP New Pensions : సీఎం జగన్ మంగళవారం కొత్త పింఛన్ దారుల ఖాతాల్లో రూ.590 కోట్లు జమ చేయనున్నారు.
CM Jagan : మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 79 వేల 65 మంది కొత్త పెన్షనర్ల ఖాతాల్లో రూ.590 కోట్లు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో బటన్ నొక్కనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇవ్వాలనే సంకల్పంతో మరో అవకాశం ఇస్తూ రేపు లబ్ధిదారుల అకౌంట్లకు నగదు ట్రాన్స్ ఫర్ చేస్తారు.
సంక్షేమ పథకాలు అందనివారికి
అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఎవరికైనా ఏ కారణం చేతనైనా సంక్షేమపథకాలు అందకపోతే వారి వివరాలు సేరించి తిరిగి సంక్షేమ ఫలాలు అందించాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలు అందనివారు నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే..వెరిఫై చేయించి అర్హులైన వారికి డిసెంబర్ నుంచి మే వరకు అమలైన సంక్షేమ పథకాల మొత్తాన్ని జూన్ నెలలో, జూన్ నుంచి నవంబర్ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిని డిసెంబర్ నెలలో జమ చేస్తోంది వైసీపీ సర్కార్. సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి, నిర్ధిష్ట సమయంలోనే బటన్ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు.
భూముల రీసర్వేపై సీఎం జగన్ సమీక్ష
భూముల రీసర్వే అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం అని సీఎం జగన్ అన్నారు. వందేళ్ల తరువాత సర్వే అంటే, నూతనంగా చరిత్ర లిఖిస్తున్నట్లేనని జగన్ అభిప్రాయపడ్డారు. వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష (భూముల సమగ్ర రీసర్వే)పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా అధికారులుకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్, రాబోయే రోజుల్లో పనులను వేగవంతం చేయాలన్నారు. రీసర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నామని, వాటి ఫలాలు కచ్చితంగా ప్రజలకు అందాలన్నారు. సర్వేలో కచ్చితంగా నాణ్యత ఉండాలన్న సీఎం, దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతమంది సర్వేయర్లు, సర్వే సిబ్బంది మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారని చెప్పారు. తొలి విడతలో సర్వే పూర్తయిన 2 వేల గ్రామాలకు సంబంధించి భూహక్కు పత్రాలు అందించే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.
జనవరి నెలాఖరు నాటికి
జనవరి నాటికి సర్వే పూర్తి కావాలని, ముఖ్యమంత్రి జగన్ సూచించారు. తొలివిడత సర్వే పూర్తయిన 2వేల గ్రామాల్లో ఇప్పటివరకు 2 లక్షల మ్యటేషన్లు, 92 వేలు ఫస్ట్ టైం ఎంట్రీస్ జరగ్గా, 7,29,000 మందికి భూహక్కు పత్రాలు అందజేశామన్న అధికారులు, 4.30 లక్షల సబ్ డివిజన్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. 19 వేల భూవివాదాలను పరిష్కారమయ్యాయన్న అధికారులు, ఫలితంగా ప్రజలకు రూ.37.57 కోట్ల మేరకు ఆదా అయిందని వెల్లడించారు. మరో 2 వేల గ్రామాల్లో రీసర్వే ప్రక్రియకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సీఎంకు వివరింంచారు అధికారులు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నాటికి సర్వే పూర్తి చేస్తామని తెలిపిన అధికారులు, అదే నెల చివరికల్లా భూహక్కు పత్రాలను కూడా అందజేస్తామని వివరించారు.