Anantapur News: పోలీసులకు రక్షణ కల్పించాలంటూ ఏఆర్ కానిస్టేబుల్ సైకిల్ యాత్ర, అరెస్ట్ చేసిన పోలీసులు!
Anantapur News: పోలీసులకు వేతన బకాయిలు చెల్లించాలంటూ డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ సైకిల్ యాత్ర చేపట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
Anantapur News: డిస్మిస్డ్ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌ను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా 'సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్' అంటూ ప్రకాష్ ఆదివారం సైకిల్ యాత్ర చేపట్టారు. విషయం తెలుసుకున్న మూడో పట్టణ పోలీసులు యాత్రకు అనుమతి లేదంటూ టవర్ సమీపంలో అరెస్ట్ చేసి రహస్య ప్రదేశానికి తరలించారు. చట్టాలను అమలు పరిచే పోలీసుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని ప్రకాష్ ఈ సందర్భంగా ఆరోపించారు. 'ఏపీ సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్, గ్రాంట్ ఎస్‌ఎల్‌ఎస్, ఏఎస్‌ఎల్‌ఎస్ అరియర్స్.. సామాజిక న్యాయం ప్లీజ్' అంటూ అనంతపురంలోని పోలీసు కార్యాలయ ఆవరణలో పోలీసు అమరవీరుల స్తూపం దగ్గర ప్రకాష్ ప్లకార్డును ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే పోలీసులకు వేతన సంబంధిత బకాయిలను చెల్లించాలంటూ ప్రకాష్ డిమాండ్ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 358 మంది పోలీసులను విధుల నుంచి తొలగించారని ప్రకాష్ ఆందోళన వ్యక్తం చేశారు.
మొన్నటి వరకు పకీరప్పను అరెస్ట్ చేయాలంటూ..
అనంతపురం జిల్లాలో డిస్మిస్డ్ కానిస్టేబుల్ ప్రకాష్ జిల్లా ఎస్పీ పకీరప్ప కాగినెల్లిని ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అరెస్టు చేయాల్సిందేనని ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ డిమాండ్ చేశారు. దళితుడననే చిన్న చూపుతోనే .. తప్పుడు కేసులు, వాంగ్మూలాలతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ ప్రకాష్ అనంతపురం టు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జిల్లా ఎస్పీ తోపాటు ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతు , డీఎస్పీలు రమాకాంత్, మహబూబ్ బాషాలపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. విచారణ అధికారిగా పలమనేరు డీఎస్పీ గంగయ్యను డీఐజీ రవిప్రకాష్ నియమించారు.
ముందుగా డీఎస్పీ గంగయ్య.. కానిస్టేబుల్ ప్రకాష్‌ను విచారణను పిలిచారు. అనంతపురం పోలీస్ గెస్ట్ హౌస్‌లో విచారణాధికారి, పలమనేరు డీఎస్పీ గంగయ్య ఎదుట హాజరయ్యారు. విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని డీఎస్పీకి ప్రకాష్ తెలిపారు. ‘ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎస్పీ, ఏఎస్పీ, సీసీఎస్ డీఎస్పిలకు నోటీసులు జారీ చేయలేదు. వారిని అరెస్టు చేయడంతో పాటు.. ఉద్యోగాల నుంచి తొలగించిన అనంతరం విచారణ జరపాలి..’ అని పేర్కొన్నారు. ఆ మేరకు నిందితులను విధుల నుంచి తప్పించి ,అరెస్టు చేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ ను ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ కోరారు.
అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ ను కలిసి వినతి పత్రం అందించిన అనంతరం తొలగించిన కానిస్టేబుల్ ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. ఎఫ్ఐఆర్ నమోదైన అధికారులను విధుల నుంచి తప్పించి , అరెస్టు చేసి ప్రాసిక్యూట్ చేయాలని తాను డీఐజీ కోరినట్లు వివరించాడు. ఎస్సీ ఎస్టీ కేసుకు ప్రత్యేక అధికారిగా నియమితులైన పలమనేరు డిఎస్పి గంగయ్య నిందితులకు నోటీసులు ఇవ్వకుండా ఫిర్యాదుదారుడైన తనకు మాత్రమే నోటీసులు ఇచ్చి విచారణ చేస్తుండడం నిబంధనలకు విరుద్ధమని డిఐజి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తమకు ప్రాణహాని ఉన్నట్లు ఆయనకు తెలపగా సానుకూలంగా స్పందించారని మీడియాకు చెప్పారు.