MP Raghurama: సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామకు షాక్! ఆ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం
‘‘కేసులో ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. పైగా ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఉంది. ఫోర్జరీ, మోసం ఆరోపణలు ఉన్న ఈ ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయమని ఎలా ఆదేశిస్తాం’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
సుప్రీం కోర్టులో ఎంపీ రఘురామకృష్ణ రాజుకు ఎదురుదెబ్బ తగిలింది. తమ కంపెనీ అయిన ఇండ్ భారత్ పవర్ జెన్‌కామ్ కంపెనీ రుణాలు ఎగవేసిందంటూ సీబీఐ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని వీరు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ను వేశారు. తాజాగా దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని ఎలా ఆదేశించగలమని ధర్మాసనం ప్రశ్నించింది. పైగా ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఉందని.. ఫోర్జరీ, మోసం ఆరోపణలు ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేస్తారని నిలదీసింది. ఇలాంటివి దర్యాప్తు చేయాల్సిన అంశాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
అసలు కేసు ఏంటంటే?
పలు బ్యాంకుల నుంచి రూ.237.84 కోట్ల మేర రుణాలు పొంది, ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ ఇండ్‌భారత్ పవర్ జెన్‌కామ్ లిమిటెడ్ డైరెక్టర్, నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణరాజు, కనుమూరు రమాదేవి (డెరెక్టర్), కనుమూరు ఇందిరా ప్రియదర్శిని (అదనపు డైరెక్టర్), అంబేడ్కర్ రాజ్‌కుమార్ గంటా (డైరెక్టర్), దుంపల మధుసూధన్ రెడ్డి (హోల్‌టైం డైరెక్టర్), నారాయణ ప్రసాద్ భాగవతుల (డైరెక్టర్), రామచంద్ర అయ్యర్ బాలకృష్ణన్ (హోల్‌టైం డైరెక్టర్) ఇతర గుర్తు తెలియని వ్యక్తులపై ఎస్‌బీఐ చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ కేసు నమోదు చేసింది.
ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ సంస్థ డైరెక్టర్లయిన అంబేడ్కర్ రాజ్‌కుమార్ గంటా, దుంపల మధుసూధన్ రెడ్డి తొలుత మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. నేర పూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించడం, నకిలీ పత్రాలు ఉపయోగించడం వంటి నేరాలు ఉన్నాయన్న సీబీఐ తరఫు న్యాయవాది వాదనను సమర్థించిన మద్రాస్ హైకోర్టు పిటిషన్ తిరస్కరించింది. దీంతో వారిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.
ఈ పిటిషన్ పై ధర్మాసనం స్పందిస్తూ ‘‘కేసులో ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. పైగా ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఉంది. ఫోర్జరీ, మోసం ఆరోపణలు ఉన్న ఈ ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయమని ఎలా ఆదేశిస్తాం. ఇలాంటివి దర్యాప్తు చేయాల్సిన అంశాలు’’ అని పేర్కొన్న ధర్మాసనం ఇండ్‌భారత్ పవర్ జెన్‌కామ్ లిమిటెడ్ పిటిషన్‌ను కొట్టివేసింది.
సీఐడీ నోటీసుల్ని పట్టించుకోని రఘురామ
మరోవైపు, మూడు రోజుల క్రితం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో సోమవారం (సెప్టెంబరు 19) విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు. తనకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయాన్ని ధృవీకరించిన ఎంపీ.. నోటీసులకు సమాధానం ఇచ్చానని తెలిపారు. తనకు చాలా రోజుల కిందటే నోటీసులు వచ్చాయని, దీనిపై ఈ నెల 16 వ తేదీనే సమాధానం ఇచ్చానని, మరోసారి విచారణకు హాజరుకావాల్సిన అవసరం తనకు కనిపించలేదన్నారు. హైదరాబాద్‌లో విచారణకు తనతో పాటు రెండు వార్తా చానళ్లకు కూడా నోటీసులు ఇవ్వాలని కోర్టు చెప్పిందని.. తనకు ఒక్కడికే నోటీసు ఇవ్వడం కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పారు.
రాజద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసులు
ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారన్న అభియోగాలతో ఎంపీ రఘురామపై రాజద్రోహం కేసు పెట్టారు. రెండు వర్గాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా రఘురామ వ్యాఖ్యలు చేశారని సీఐడీ సుమోటోగా ఆయనపై కేసు నమోదు చేసింది. రాజద్రోహం.. ఐపీసీ 124ఏ, 153ఏ, 505, 120బి సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆయన పుట్టిన రోజు నాడు హైదరాబాద్‌లో ఇంట్లో ఉండగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తనపై సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాజద్రోహం సెక్షన్ మినహా మిగిలిన సెక్షన్ల కింద రఘురామ కృష్ణరాజును విచారించుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.