YS Viveka Case Supreme Court : వివేకా కేసు ఆలస్యంపై సుప్రీంకోర్టు సీరియస్ - కేసు వివరాలు సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశం !
వివేకా కేసు దర్యాప్తు వివరాలను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

YS Viveka Case Supreme Court : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఆలస్యం కావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణ పురోగతిని సీల్డ్ కవర్‌లో అందచేయాలని ఆదేశించింది. కేసు విచారణను దర్యాప్తు అధికారి ఎందుకు పూర్తి చేయడం లేదని... వివేకా హత్య కేసు విచారణను త్వరగా ముగించలేకపోతే వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై సీబీఐ డైరక్టర్ అభిప్రాయం తెలుసుకుని చెప్పారని సీబీఐ తరపు లాయర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు విచారణలో ఆలస్యం చేస్తున్నారని దర్యాప్తు అధికారిని మార్చాలంటూ నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా జరిగిన విచారణలో కేసును దర్యాప్తు అధికారి సక్రమంగానే దర్యాప్తు చేస్తున్నారని సీబీఐ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు.
తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో ఏ-4 గా ఉన్న దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ భాస్కర్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను సీబీఐ విచారణ చేయగా.. అసలు దస్తగిరిని అప్రూవర్‌గా ఎలా ప్రకటిస్తారని భాస్కర్ రెడ్డి అంటున్నారు. ఈ మేరకు ఆయన్ను అప్రూవర్‌గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దస్తగిరి స్టేట్‌మెంట్ ను ఆధారంగా చేసుకొని తమను ఈ కేసులోకి లాగడం కరెక్టు కాదని పిటిషన్‌లో వైఎస్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించారని, అలాంటి ఆయనకు బెయిల్ ఇవ్వడం కూడా సరికాదని పిటిషన్‌లో వివరించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరే అని గుర్తు చేశారు. దస్తగిరి బెయిల్ సమయంలోను సీబీఐ సహకరించిందని, దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదని అన్నారు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో భాస్కర్ రెడ్డి కోర్టును కోరారు.
తెలంగాణలో హైకోర్టులోనే మరో పిటిషన్ దాఖలు చేసిన వివేకా పీఏ కృష్ణారెడ్డి
కొద్ది రోజుల కిందట తెలంగాణ హైకోర్ లో వైఎస్ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వివేకా కేసులో దస్తగిరిని అప్రూవర్‌గా అనుమతించడాన్ని కృష్ణారెడ్డి సవాల్ చేశారు. సీబీఐ కుట్రపూరితంగా దర్యాప్తు చేస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కృష్ణారెడ్డికి పిటిషన్ వేసే అర్హత లేదని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ పిటిషన్ ఇంకా తెలంగాణ హైకోర్టులో విచారణకు రాలేదు.
వివేకా హత్య కేసులో నిందితులు, వారి కుటుంబసభ్యులు ఇలా వరుసగా అనేక పిటిషన్లను కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ దాఖలు చేస్తున్నారు. మరో వైపు సీబీఐ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

