KRMB: కేఆర్ఎంబీ పరిధిలోకి ఆ విద్యుత్ ప్రాజెక్టులు
ఏపీ జెన్‌కో పరిధిలోని శ్రీశైలం కుడి కాలువ గట్టు, నాగార్జునసాగర్ కుడికాలువ జలవిద్యుత్ ప్రాజెక్టుల పర్యవేక్షణను కేఆర్‌ఎంబీకి అప్పగించటానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఏపీ జెన్‌కో పరిధిలోని శ్రీశైలం కుడి కాలువ గట్టు, నాగార్జునసాగర్ కుడికాలువ జలవిద్యుత్ ప్రాజెక్టుల పర్యవేక్షణను కృష్ణా రివర్ మేనెజ్ మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ)కి అప్పగించటానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
కేఆర్ఎంబీ ప్రత్యేక బోర్డు సమావేశంలో ఈ అప్పగింత నిర్ణయంపై చర్చ జరిగింది. దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణాజలాలపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం రైట్ బ్యాంక్ పవర్ హౌస్, నాగార్జున సాగర్ కుడి కాలువ పవర్ హౌస్ లను కేఆర్ఎంబీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
జలవనరుల శాఖ, తెలంగాణ జెన్‌కోతో సంప్రదింపులు జరిపి.. రికార్డులను అప్పగించటంలో వారు వ్యవహరించే తీరుకు అనుగుణంగా వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాజెక్టులను అప్పగించినప్పటి నుంచి అందులో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహారాలను తదుపరి ఆదేశాలు జారీచేసే వరకూ బోర్డు పర్యవేక్షిస్తుందని తెలిపింది.
కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులను ఏపీ, తెలంగాణ ఈ నెల 14లోగా బోర్డులకు అప్పగించాల్సిందేనంటూ కేంద్ర జలశక్తి శాఖ గడువు నిర్దేశించింది. కేంద్రం ప్రకటించిన గెజిట్ షెడ్యూల్-2లో ఉన్న ప్రాజెక్టులను విద్యుత్కేంద్రాలతో సహా తెలంగాణ అప్పగిస్తే తామూ సిద్ధంగా ఉన్నామంటూ ఏపీ మెుదట చెప్పు కొచ్చింది.
ఇరు రాష్ట్రాల నీటి కేటాయింపులను అమలు చేసే బాధ్యతలను బోర్డులు తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల వినతుల మేరకు బోర్డుల పరిధిలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగిస్తాయి. రెండు రాష్ట్రాల పరిధిలోని సిబ్బంది బోర్డు అధికారాల మేరకు నడచుకోవాల్సి ఉంటుంది. సిబ్బందితో పాటు నిధులు, ఆస్తులు రాష్ట్రాల నుంచి ఇంకా బదిలీ కాలేదు. మూడు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే అవి కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో విభాగాన్ని తమ పరిధిలోకి తెచ్చుకోవడానికి కృష్ణా, గోదావరి బోర్డులు కార్యాచరణ రూపొందిస్తున్నాయి.
కృష్ణా బోర్డు ప్రతిపాదనల జాబితా
తెలంగాణ పరిధిలో 9 అవుట్‌లెట్లు
శ్రీశైలం- ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం, కల్వకుర్తి పంపుహౌస్, సాగర్- కుడి కాల్వ హెడ్‌రెగ్యులేటర్, ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్, వరద కాల్వ హెడ్ రెగ్యులేటర్, ఎలిమినేటి మాధవరెడ్డి పంపుహౌస్, ప్రాజెక్టు ప్రాజెక్టు, జెన్‌కో పరిధిలోని ప్రధాన జల విద్యుత్ కేంద్రం, లాల్‌బహదూర్ కాల్వపై ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం
ఏపీ పరిధిలో 6 అవుట్‌లెట్లు
శ్రీశైలం- ప్రాజెక్టు (నది, స్లూయీస్, స్పిల్ వే), పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ఎస్‌ఆర్‌ఎంసీ, హంద్రీనీవా ఎత్తిపోతల పథకం పంపుహౌస్, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంపుహౌస్. కుడి గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, సాగర్- నాగార్జునసాగర్ కుడి కాల్వ విద్యుత్ కేంద్రం
గోదావరి బోర్డు ప్రతిపాదన
రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగు