Minister Botsa Satyanarayana : రాజకీయాలు దిగజారడానికి అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులే కారణం - మంత్రి బొత్స
Minister Botsa Satyanarayana : సభ్య సమాజం తలదించుకునేలా అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Minister Botsa Satyanarayana : రోజురోజుకీ రాజకీయాలు దిగజారడానికి టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులు కారణమని విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా అచ్చెన్నాయడు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివారం రాత్రి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేవాలయాన్ని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే వ్యక్తులు ఎవరూ అచ్చెన్నాయుడిలా మాట్లాడారని బొత్స అన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి పనికిరారన్నారు. ఆయన పరిపక్వత లేని నేత అని విమర్శించారు. టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర ఆయన ఆరోగ్యానికి మంచిదన్నారు.
"అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు దురదృష్టకరం. ఇలాంటి వాళ్ల వల్లే రాజకీయాలంటే చలకన అవుతున్నాయి. వ్యవస్థను గౌరవించుకోవాలి. మన పరిధిలో ఉండి మాట్లాడాలి. అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను సభ్య సమాజమే హర్షించడంలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడకూడదు. పాదయాత్రకు ఎందుకు ఇబ్బంది పెడుతాం."- మంత్రి బొత్స సత్యనారాయణ
పోలీసులపై అచ్చెన్న అనుచిత వ్యాఖ్యలు
కుప్పం సభలో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ పాదయాత్ర కోసం జనం తండోపతండాలుగా వస్తే ఒక్క పోలీస్ కూడా సహకరించలేదన్నారు. తమ పార్టీ యాత్రకు తామే పోలీసులమని, కార్యకర్తలు క్రమశిక్షణతో వ్యవహరించాలని అచ్చెన్న పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. స్థానిక పోలీసుల ఫిర్యాదుతో కుప్పంలో అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేశారు. అలాగే అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని పోలీసులు డిమాండ్ చేశారు.
కుప్పంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో పోలీసులున్నా పట్టించుకోలేదని మాట్లాడానే తప్ప ఎవరినీ కించపరచే ఉద్దేశం లేదని అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. కొందరి ప్రవర్తన అలా ఉందనే మాట్లాడాను తప్ప వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే వాటిని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అచ్చెన్నాయుడు తెలిపారు.
అచ్చెన్నాయుడుపై కేసు నమోదు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్ చేయాలని ఏపీ పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ ట్రెజరర్ సోమశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై స్పందించారు. అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా కుప్పం పీఎస్ లో ఐపీసీ సెక్షన్ 153 కింద కేసు నమోదు చేశామన్నారు. పోలీసుల ఆత్మస్థైర్యం, మనోభావాలను అవమానించేలా అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారని, అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు దురదృష్టకరం అన్నారు. పోలీసుల పట్ల చులకన వ్యాఖ్యలు చేయడం రాజకీయ నేతలకు పరిపాటైందని, రాజకీయాల కోసం పోలీసులను నోటి దురుసుగా ఇష్టానుసారం మాట్లాడితే స్వతంత్రంగా ప్రజల్లో తిరిగే రోజులు ఉండవని సోమశేఖర్ హెచ్చరించారు. పోలీసులు తలచుకుంటే రాజకీయ పార్టీల నేతలు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరగలేరని ఆ విషయం అచ్చెన్నాయుడు గుర్తుపెట్టుకోవాలని కోరారు. తీరు మార్చుకోకపోతే భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు. పోలీసులకు, మహిళలకు అచ్చెన్నాయుడు బహిరంగ క్షమాపణలు చెప్పాలని సోమశేఖర్ డిమాండ్ చేశారు.