Weather Updates: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరో 3 రోజులు వానలు
Southwest Monsoon: నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు భారీ వర్షాలు కురిశాయి.
Southwest Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు చాలా ఆలస్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. ఏపీలోని రాయలసీమలో పూర్తి స్థాయిలో విస్తరించిన రుతుపవనాలు తెలంగాణలో మహబూబ్‌నగర్‌లో సోమవారం ప్రవేశించగా.. మరికొన్ని గంటల్లో రాష్ట్రం మొత్తం వ్యాపించనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం లభించింది. ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాంలో మరో మూడు రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇవాళ ఏపీ, తెలంగాణలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అధికారులు తెలిపారు. చాలా చోట్ల మంగళ, బుధవారాల్లోనూ వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, కొంకణ్ లోని మిగిలిన ప్రాంతాల్లోకి, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడాలోని పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లోకి, మొత్తం ఉప హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఝార్ఖండ్, బిహార్ లోని కొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉన్న అల్పపీడన ద్రోణి ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతం నుంచి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు, 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఉంది.
Weather briefing on Advancement of South west monsoon into some parts of Rayalaseema today the 13th June, 2022. pic.twitter.com/wbZh50SQHJ
— MC Amaravati (@AmaravatiMc) June 13, 2022
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఏపీలో పలు జిల్లాల్లో 40 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా, నైరుతి రుతుపవనాల ఆగమనంతో మొదలైన వర్షాలతో నిన్న రాత్రి ఉపశమనం కలిగింది. తొలకరి జల్లుల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు వాతావరణ కేంద్రం శుభవార్త అందించింది. నేటి నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనుండగా.. మరికొన్ని చోట్ల వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
Synoptic features of weather inference for Andhra Pradesh in Telugu language Dated 13.06.2022. pic.twitter.com/McmTtfgSuv
— MC Amaravati (@AmaravatiMc) June 13, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
రాయలసీమలో పూర్తి స్తాయిలో వ్యాపిస్తున్న నైరుతి రుతుపవనాలు మరికొన్ని గంటల్లో రాష్ట్రం మొత్తం వ్యాపించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. సీమలోని ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని చల్లని వార్త చెప్పారు.
Now cast warning, Met. Center, Hyderabad, 13-06-2022, 22:00 IST: pic.twitter.com/GHGHSacZl2
— IMD_Metcentrehyd (@metcentrehyd) June 13, 2022
తెలంగాణలో వర్షాలు
నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలంగాణలో తొలకరి జల్లులు పడ్డాయి. గత ఏడాది జూన్ తొలి వారంలో వచ్చిన రుతుపవనాలు ఈ ఏడాది రెండో వారం తరువాత తెలంగాణలో ప్రవేశించాయి. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు పలుచోట్ల భారీ వర్షం కురిసింది. నేటి నుంచి మరో మూడు, నాలుగు రోజుల వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. యాదాద్రి భువనగిరి, జనగామ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల ,రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దమల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తాయి.
Also Read: Gold-Silver Price: నేడు బంగారం కొనే ప్లాన్ ఉందా? ఇవాల్టి రేట్లు ఇవీ - వెండి మాత్రం దిగువకు