Special Tains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - పండుగల సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
SCR: దసరా, దీపావళి పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన నగరాల నుంచి అక్టోబర్ 10 నుంచి నవంబర్ 5 వరకూ వేర్వేరు తేదీల్లో 48 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.
SCR Special Trains For Festivals: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి, ఛాత్ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 48 ప్రత్యేక రైళ్లను (Special Trains) నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రధాన నగరాల నుంచి అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 5 వరకూ వేర్వేరు తేదీల్లో ఈ రైళ్లు నడపనున్నారు. కాచిగూడ - తిరుపతి - కాచిగూడ, సికింద్రాబాద్ - నాగర్‌సోల్ - సికింద్రాబాద్, కాకినాడ - సికింద్రాబాద్ - కాకినాడ, తిరుపతి - మచిలీపట్నం - తిరుపతి మార్గాల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. రెగ్యులర్ రైళ్లకు ఇవి అదనపు సర్వీసులని.. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
ఆ రైళ్లకు అదనపు కోచ్‌లు
అటు, ఈస్ట్ కోస్ట్ రైల్వే సైతం ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిమాండ్, రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు స్లీపర్, ఏసీ కోచ్‌లను పెంచింది. మొత్తం 4 రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. విశాఖ నుంచి బయలుదేరే విశాఖ - అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 20807) రైలుకు అదనంగా స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లతో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ఈ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే అమృత్ సర్ - విశాఖ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20808) రైలుకు అదనంగా స్లీపర్ క్లాస్, మరో 3 ఏసీ ఎకానమీ కోచ్‌లతో శాశ్వత ప్రాతిపదికన.. సెప్టెంబర్ 7 నుంచి అమల్లోకి రానుంది.
అలాగే, విశాఖ - నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20811) రైలుకు అదనపు స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లతో సెప్టెంబర్ 3 నుంచి అందుబాటులోకి వస్తాయి. అటు, నాందేడ్ - విశాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20812) రైలు అదనపు స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లతో సెప్టెంబర్ 4వ తేదీ నుంచి అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు. పెంచిన కోచ్‌లతో ఈ రైలుకు సెకండ్ ఏసీ - 1, థర్డ్ ఏసీ - 4, స్లీపర్ - 7, జనరల్ సెకండ్ క్లాస్ - 4, సెకండ్ క్లాస్ లగేజీ కమ్ దివ్యాంగన్ కోచ్ - 1 ఉంటాయని అధికారులు తెలిపారు.