Skill Development Case: సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయనున్న టీడీపీ, జైల్లో చంద్రబాబుతో చర్చలు
Skill Development Case: క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. దీనిపై చర్చించేందుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో టీడీపీ లీగల్ టీమ్ న్యాయవాదులు ములాఖత్ అయ్యారు.
Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్టుల్లో వరుస షాక్‌లు తగులుతున్నాయి. విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టుల్లో చంద్రబాబుకు ఊరట లభించడం లేదు. సీఐడీ పిటిషన్‌తో చంద్రబాబుకు రెండు రోజుల పాటు కస్టడీకి విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతింది. ఇక ఈ కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఉదయం చంద్రబాబుకు మరో రెండు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగింది.
ఒక్క పిటిషన్‌లో కూడా ఊరట దక్కకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో చంద్రబాబు న్యాయవాదులు ఉన్నారు. దీనిపై చంద్రబాబుతో చర్చించేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ లీగల్ టీమ్ చేరుకుంది. చంద్రబాబుతో న్యాయవాది లక్ష్మీనారాయణ ములాఖత్ అయ్యారు. సీఐడీ కస్టడీ, క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన అంశాలను చంద్రబాబుకు వివరించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై బాబుతో చర్చించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలోని అంశాలను టీడీపీ లీగల్ టీమ్ అధ్యయనం చేస్తోంది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తామని టీడీపీ లీగల్ టీమ్ స్పష్టం చేసింది. సోమవారం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నారా లోకేష్.. సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేంతవరకు ఢిల్లీలోనే లోకేష్ ఉండనున్నారని తెలుస్తోంది. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట వస్తుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే చంద్రబాబుకు రెండు రోజుల కస్టడీ విధించిన ఏసీబీ కోర్టు.. పలు కీలక సూచనలు చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విచారించుకోవడానికి అనుమతి మంజూరు చేసింది. న్యాయవాదుల సమక్షంలో చంద్రబాబు విచారణ జరగాలని, విచారణకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించకూడదని ఆదేశించింది. చంద్రబాబు ఆరోగ్య, వయస్సురీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను కోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని ఏసీబీ కోర్టు జడ్జి తెలిపారు. విచారణకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే చంద్రబాబును విచారించే అధికారుల జాబితా తమకు అందించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీ విచారణ నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని సీఐడీకి సూచించింది. సీఐడీ వేసిన 2 పీటీ వారెంట్లు, చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు వింటామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.
నేడు, రేపు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును సీఐడీ అధికారులు కోరారు. కానీ రెండు రోజులు మాత్రమే కోర్టు కస్టడీకి అనుమతించింది. అటు చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవడంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ప్రశ్నల పేరుతో బాబును వేధించేందుకే కస్టడీలోకి తీసుకున్నారని ఆరోపించారు. హైకోర్టు, ఏసీబీ కోర్టు తీర్పుల నేపథ్యంలో ముఖ్యనేతలతో అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహారదీక్షలు కొనసాగించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.