Guntur: ఎస్సై ఈవెంట్స్‌లో విషాదం- రన్నింగ్ చేస్తూ కుప్పకూలి యువకుడు మృతి
Guntur: గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. ఎస్సై దేహదారుఢ్య పరీక్షలో భాగంగా రన్నింగ్ చేస్తూ యువకుడు మృతి చెందాడు.
Guntur: గుంటూరులో జరిగిన ఎస్సై దేహదారుఢ్య పరీక్షల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా 1600 మీటర్ల పరుగుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న ఒక ఎస్సై అభ్యర్థి పరిగెడుతూ మరణించాడు. మోహన్ అనే యువకుడు పరిగెడుతుండగా ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో వెంటనే అంబులెన్స్‌లో పోలీస్ సిబ్బంది అతడిని గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే యువకుడిని పరీక్షించిన వైద్యులు.. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి మరణించినట్లు ధృవీకరించారు.
మోహన్ మృతిపై కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకోగా.. మోహన్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడు ఎస్సై అవుతాడని ఆశిస్తే.. చివరికి ఇలా శవంగా మారడం చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మోహన్ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అందించారు. మోహన్ మృతితో అతడి స్వగ్రామమైన అంకిరెడ్డి పాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అయితే ఎస్సై ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు గత కొద్దిరోజులుగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 10 నుంచి కొనసాగుతుండగా.. మధ్యలో వర్షం కారణంగా రెండు రోజులు రద్దు చేశారు. ఆ తర్వాత నిన్నటి నుంచి తిరిగి ప్రారంభించారు. 1600 మీటర్లు, 100 మీటర్ల రన్నింగ్ పోటీలు, లాంగ్ జంప్ నిర్వహిస్తున్నారు. అలాగే అభ్యర్థుల ఎత్తు, ఛాతి కొలతలు పరీక్షిస్తున్నారు. గుంటూరులో జరుగుతున్న ఫిజికల్ టెస్టుల్లో 800 మంది అభ్యర్థుల్లో 705 మంది ధ్రువపత్రాలు అందజేయగా.. దేహదారుఢ్య పరీక్షల తర్వాత వీరిలో 342 మంది అర్హత సాధించారు. ఈ పరీక్షలను గుంటూరు ఏఎస్పీ సుప్రజల, మంగళగిరి బెటాలియన్ కమాండెంట్ సుబ్బారెడ్డి., రేంజ్ ఐటీ పాలరాజు దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక డీఎస్పీ శ్రీనివాసరావు, చంద్రశేఖర్ రావు, రవిచంద్ర, రేంజ్ పరిధిలోని డీఎస్పీ, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.
మొత్తం 411 ఎస్సై ఉద్యోగాలకు గత ఏడాది నవంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేయగా.. డిసెంబర్ 14 వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందులో 315 ఉద్యోగాలను మహిళలు, పురుషులకు కేటాయించగా.. 96 ఉద్యోగాలను రిజర్వ్ సబ్ ఇన్సెపెక్టర్ ఆఫ్ పోలీస్ పురుషులకు కేటాయించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న రాతపరీక్ష నిర్వహించారు. 1,51,288 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా.. వారిలో 56,116 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షల కోసం ఎంపికయ్యారు. గుంటూరుతో పాటు ఏలూరు, విశాఖపట్నం, కర్నూలు జిల్లా కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు జరుపుతున్నారు. ఇక దేహదారుఢ్య పరీక్షల్లో క్వాలిఫై అయినవారికి అక్టోబర్ 14,15వ తేదీలలో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. మొయిన్స్ పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు అబ్జెక్టివ్ క్వశ్లన్లు, మరో రెండు పేపర్లు డిస్క్రిప్టివ్ తరహాలో ఉంటాయి. ఒక్కో పేపర్‌కు మూడు గంటల పాటు పరీక్ష టైమ్ ఉంటుంది. 4 పేపర్లలో 2 పేపర్లలో అర్హత సాధిస్తే సరిపోతుంది.
గుంటూరు, ఏలూరు, కర్నూలు, విశాఖపట్నంలో పరీక్షలు నిర్వహిస్తారు. త్వరలోనే హాల్ టికెట్లను అధికారులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అక్టోబర్ 14న ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పేపర్ 1, 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. ఇక 15న పేపర్ 3, పేపర్ 4 పరీక్షలు ఉంటాయి.