Sajjala On Narayana Arrest : నారాయణ పర్యవేక్షణలోనే మాల్ ప్రాక్టీస్ - తప్పు చేస్తే ఎవర్నీ వదలొద్దని జగన్ చెప్పారన్న సజ్జల !
నారాయణ ఆధ్వర్యంలోనే టెన్త్ మాల్ ప్రాక్టీస్ జరిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తప్పు చేస్తే ఎవర్నీ వదలొద్దని జగన్ చెప్పారన్నారు.
నారాయణ ( Narayana ) విద్యా సంస్థల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే మాల్ ప్రాక్టీస్ , పేపర్ లీకేజీలు జరిగాయని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala ) ప్రకటించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన నారాయణ ( Narayana Arrest ) అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు కాదన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని స్పష్టం చేశారు. మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో తీగ లాగితే డొంక కదిలిదిందని.. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. తప్పు చేస్తే ఎవర్నీ వదలొద్దని సీఎం జగన్ చెప్పారని.. నారాయణ, చైతన్య రికార్డుల వేటలో అక్రమాలకు పాల్పడ్డాయని సజ్జల ఆరోపించారు. ఉపాధ్యాయ లోకానికి కూడా మచ్చతెచ్చేలా చేశారన్నారు.
ఆమరావతిలో ఆళ్ల పెట్టిన కొత్త కేసు ఇదే ! పూర్తి వివరాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
విద్యా వ్యవస్థను యాంత్రికంగా మార్చి నారాయణ వేల కోట్లు సంపాదించారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. విద్యార్థులు, తల్లిదండ్రులను పీడించి వేల కోట్లు దండుకున్నారన్నారు. అలాంటి వ్యక్తికి చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారన్నారు. కాపీయింగ్‌ను ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా నారాయణ చేయించారన్నారు. ఇలాంటి తప్పుడు విధానాన్ని గత ప్రభుత్వం ప్రోత్సహించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతోనే తప్పు బయటపడిందన్నారు. అధికారులకు స్వేచ్చ ఇవ్వడం వల్లే నారాయణ దొరికారని సజ్జల తెలిపారు. ఏ విషయంలో అయినా చంద్రబాబు నిస్సిగ్గుగా వ్యవహరిస్తారని సజ్జల ఆరోపించారు. తప్పు చేశారని తేలడం వల్లే వైఎస్ కొండారెడ్డిని ( YS Konda Reddy ) అరెస్ట్ చేశారని సజ్జల తెలిపారు. తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటేనన్నారు. వైఎస్ జగన్ పాలనలో తప్పును ఉపేక్షించే పరిస్థితి లేదని సజ్జల స్పష్టం చేశారు.
నారాయణ అరెస్టు పూర్తిగా కక్ష పూరితం, బొత్స ఆ ప్రకటన చేయలేదా? చంద్రబాబు ఆగ్రహం
తిరుపతికి చెందిన నారాయణ విద్యా సంస్థల వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డిని పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. ఆయన మాజీ మంత్రి నారాయణ ప్రోద్భలంతోనే పేపర్ లీక్ ( Paper Leak ) చేసినట్లు విచారణలో చెప్పారని పోలీసులు అంటున్నారు. గిరిధర్ వాంగ్మూలం ఆధారంగా ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మొత్తంగా చిత్తూరు వన్ టౌన్ పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. మిగిలిన వారు నారాయణ, శ్రీ చైతన్య, చైతన్య కృష్ణ రెడ్డి, ఎన్ఆర్‌ఐ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారు.