Sajjala On YS Viveka Case : టీడీపీ ఎజెండా ప్రకారమే సీబీఐ దర్యాప్తు - అవినాష్, భాస్కర్ రెడ్డిలపై కేసు నిలబడదన్న సజ్జల !
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై కేసులు నిలబడవని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ ఎజెండా ప్రకారమే విచారణ జరుగుతోందన్నారు.
Sajjala On YS Viveka Case : వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ హడావిడి చేస్తోందని....కేసు ముగింపునకు వచ్చినట్లు చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సీబీఐ వాడుతున్న పదాలు, వాడుతున్న మాటలు చూస్తే టీడీపీ రాజకీయ అజెండా అర్ధం అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే అంశాన్ని..కల్పిత కథను నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తారని... చంద్రబాబును అర్జెంటుగా అధికారంలో కూర్చోబెట్టాలన్నది వీళ్ళ ప్రయత్నమని ఆరోపించారు. .హత్య చేసిన నిందితుడు తాను ఎంత కర్కశంగా హత్య చేశాడో చెప్పాడని.. హత్య చేసిన వ్యక్తిని అప్రూవర్ గా ఎలా మారుస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
సీబీఐ విచారణ పత్రికల్లో ముందుగానే ఎలా వస్తోంది ?
అమరావతిలో మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి వాచ్ మెన్ ప్రత్యక్ష సాక్షిగా వివరాలు చెప్పాక అప్రూవర్ అవసరం ఏం వచ్చిందని సజ్జల ప్రశ్నించారు. తానే హత్య చేశానని దస్తగిరి చెప్పాక ముందస్తు బెయిల్ కు సీబీఐ ఎలా ఒప్పుకుందన్నారు. దస్తగిరిని ఎందుకు అరెస్టు చేయటం లేదని ఇది ఒప్పందంలో భాగం కాదా అని సజ్జల ప్రశ్నించారు. వివేకా హత్యపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల అన్నారు. సీబీఐ ఎలా విచారణ చేస్తున్నారో ముందుగానే పత్రికల్లో ఎలా వస్తుందని సజ్జల ప్రశ్నించారు. వైఎస్ కుటుంబంలో రాజశేఖర్ రెడ్డి తర్వాత వివేకానందరెడ్డిని మాత్రమే అందరూ గౌరవిస్తారని చెప్పారు. హత్యచేసిన నిందితుడు తాను ఎలా హత్య చేశాడో చెప్పినా ఇంకా కేవలం రాజకీయ కుట్రతోనే విచారణ జరుగుతున్నట్లు అనిపిస్తుందన్నారు.
సీబీఐ, టీడీపీ కుమ్మక్కై విచారణ జరుపుతుందా?
సీబీఐ, టీడీపీ కుమ్మక్కై విచారణ జరుపుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏకపక్షంగా దర్యాప్తు చేస్తుండం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. మిగిలిన కోణాల వైపు చూడక పోవడానికి కారణాలేంటని ఆయన ప్రశ్నించారు. రామ్ సింగ్ ను మార్చి కొత్త టీం వచ్చిన తర్వాత కొత్త ఆధారాన్ని ఏమైనా సంపాదించారా? అని ప్రశ్నించారు. రాంసింగ్ పూర్తి చేయాలనుకున్న పనిని ఈ కొత్త టీం పూర్తి చేయాలని వచ్చినట్లుందన్నారు. ఏప్రిల్ 30వ తేదీలోపు తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతోనే ఈ హడావిడి ద్వారా ఏదో ఒకటి చేసి మమ అని అనిపించాలనుకుంటున్నారని సజ్జల ఆరోపించారు.
అవినాష్ , భాస్కర్ రెడ్డిపై కేసులు నిలబడవు !
ఈ కేసులో తమ బాధంతా కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వచ్చినందుకే. ఈ కేసు ఎలా నిలబడదని అన్నారు. నిజాయితీగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి బయటపడతారని తెలిపారు. రాజకీయంగా దెబ్బకొట్టాలని ఈరకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దస్తగిరి మాటలకు అధిక ప్రాధాన్యం కల్పించి జగన్ ప్రతిష్టను దెబ్బతీయాలను చూస్తున్నారని అంటున్నారు. జగన్ ఎదుర్కోలేకే ఈ నాటకాలు ఆడుతున్నారని సజ్జల స్పష్టం చేశారు.