Sajjala On Pawan : చంద్రబాబు, పవన్‌లది స్క్రిప్ట్ రాజకీయం - ఎందుకు కలుస్తున్నారో చెప్పాలన్న సజ్జల !
చంద్రబాబు, పవన్ ఎందుకు కలుస్తున్నారో చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. స్క్రిప్ట్ ప్రకారం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
Sajjala On Pawan : ఇప్పటంలో పవన్ కల్యాణ్ ఎందుకంత ఆవేశం ప్రదర్శించారో అర్థం కావడం లేదని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాలు సజ్జల రామకృష్ణారెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇటీవల రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విశాఖ గర్జన రోజే విశాఖ పర్యటన చేపట్టి గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. అధికారంలోకి రావాలనే తాపత్రయంతోనే పవన్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని సజ్జల స్పష్టం చేశారు.
చంద్రబాబు, పవన్ కలవడం చారిత్రక అవసరం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారన్న సజ్జల
చంద్రబాబు తో పవన్ కలవడం ఒక చారిత్రిక అవసరం అని ఒక కుట్ర తో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు కలిసి పని చేసినా ఎలాంటి తప్పు లేదన్నారు. గతంలో బాబు పవన్ కలిసి ప్రజలను మోసం చేశారన్నారు. జనసేన సభకు స్థలం ఇచ్చిన వారిలో ఒక్కరి ఇళ్లు కూడ కూల్చలేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇప్పటంలో పవన్ కళ్యాణ్ పర్యటన కంటే ముందు రోజే చంద్రబాబునాయుడు పై రాయితో దాడి జరిగినట్టుగా డ్రామా ఆడారన్నారు. రాష్ట్రంలో ఏదో జరుగుతుందనే ప్రజలు అనుమానపడేలా ఈ ఘటనలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు పవన్ హడావిడి చేస్తున్నారని.. ఈ ప్రభుత్వం లో వ్యవస్థలు నాశనం అయ్యాయి అని అబద్దాలు చెప్పాలనే ప్రయత్నం లో బాబు పవన్ ఉన్నారని విమర్శించారు.
గతంలోనూ చంద్రబాబు, పవన్ కలిసే ఉన్నారన్న సజ్జల
అధికారం లోకి రావాలనుకునే పార్టీ లు ఇలా చేస్తాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఎందుకు కలవాలనుకొంటున్నారో చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు కలిసే ఉన్నారన్నారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయేందుకు వీలుగా పవన్ కళ్యాణ్ టీడీపీకి దూరమయ్యాడన్నారు. ఇప్పుడుప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నార్నారు. ఆక్రమణలను కూల్చాలా వద్దా అని ఆయన ప్రశ్నించారు. .ఏమీలేని దాని గురించి సినిమా స్క్రిప్ట్ రాస్తున్నారని ఆయన చెప్పారు.ఇప్పటంలో ఒక్క గోడ కూల్చలేదని ఆయన చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రతిరోజూ ధర్నాలు జరిగేవని సజ్జల అన్నారు.
ఇప్పటంలో సజ్జలపైనే విమర్శలు గుప్పించిన పవన్
ఐదు రోజుల కిందట పవన్ కల్యణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించినప్పుడు ప్రధానంగా సజ్జలనే టార్గెట్ చేశారు. ఏపీకి జగన్ ముఖ్యమంత్రి కాదని.. సజ్జలే సీఎం అని మండిపడ్డారు. జరిగినవన్నీ సజ్జలే చేయిస్తున్నారని..దేనికైనా తెగింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే పవన్ కల్యాణ్ విమర్శలపై అప్పట్లో సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించలేదు. ఐదు రోజుల తర్వాత ప్రె్ మీట్ పెట్టి పవన్ అధికారం కోసమే చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.