Ratnagiri: శత్రువుల ఫిరంగి దాడులు తట్టుకున్న రత్నగిరి నేడు గుప్తనిధుల తవ్వకాలతో ధ్వంసం
కోటలో నాలుగు రహదారులు కలిసేలా నిర్మాణం ఉంటే రత్నాలు ఉన్నట్టా..? ధనాగారాన్ని రాళ్ల మధ్యనే నిర్మించడానికి కారణమేంటి..? ఎన్నో యుద్ధాలను తట్టుకున్న రత్నగిరి కోట శిథిలావస్థకు చేరుకోవడం వెనుక హస్తం ఎవరిది.
నవ్యాంధ్ర నైరుతి శిఖరి.. అనంత చారిత్రక సిరి.. ధార్మిక నగరి.. రత్నగిరి. అద్భుతమైన కట్టడాలు, అపురూపమైన శిల్ప సంపద, శత్రుదుర్భేద్యమైన కోట, అధునాతనమైన సాంకేతికత.. ఇవన్నీ కలిస్తేనే రత్నగిరి కోట. అనంతపురం జిల్లా మడకశిర తాలూకా రోళ్ల మండలంలో ఉన్న రత్నగిరికి ఎంతో చరిత్ర ఉంది. సుమారు 1500 సంవత్సరాల క్రితం శాసనాలలో రత్నగిరి కోట ప్రస్తావన ఉంది. అంటే అంతకు ముందే కోట నిర్మాణం జరిగి ఉంటుందని చరిత్రకారుల అంచనా. ఎంతోమంది రాజులు రత్నగిరిని ముఖ్య కేంద్రంగా చేసుకుని పరిపాలన చేసినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. చివరిగా పాలెగాళ్ళు ఈ రాజ్యాన్ని తమ చేతుల్లోకి తీసుకుని తమకుతామే రాజులుగా ప్రకటించుకున్నారు.
ఘనమైన చరిత్ర
ఆరో శతాబ్దంలో నలరాజును బాదామి చాళుక్యులు ఓడించి రత్నగిరి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. చాళుక్యులలో రెండో పులకేశి, విక్రమాదిత్య, వినయాదిత్య, విజయాదిత్య, కీర్తివర్మ సుమారు వందేళ్లపాటు పరిపాలించారు. బాదామి చాళుక్యులు, పశ్చిమ గాంగులు, నోళంబులు, విజయనగర సామ్రాజ్యధీశులు, పాళేగాళ్ళు, రాష్ట్రకూటులు, టిప్పుసుల్తాన్ రత్నగిరిలో పాలన సాగించారు. వీళ్ల మధ్య ఏళ్ళపాటు యుద్ధాలు జరిగాయి. అన్నిటిని తట్టుకుని నిలబడింది రత్నగిరి కోట. అక్కడక్కడ ఫిరంగి గుళ్ల దాటికి కొన్ని రాళ్లు మాత్రమే చెదిరిపోయాయి తప్ప కోట నిర్మాణం మాత్రం చెక్కు చెదరలేదు. కాని నేడు గుప్తనిధుల వేటగాళ్ల చేతిలో మాత్రం చిద్రం అవుతోంది. రాళ్ల కుప్పగా మారుతోంది.
పురావస్తు శాఖ, పోలీసుల జాడే లేదు
రత్నగిరి కోట పేరులోనే రత్నాలు ఉన్నాయని అక్కడ రత్నాలు లభిస్తాయన్న ఊహలతో దేశం నలుమూలల నుంచి గుప్తనిధుల వేటగాళ్లు కోటలో తవ్వకాలు జరుపుతున్నారు. అందమైన శిల్ప సంపదను ధ్వంసం చేస్తున్నారు. వాళ్ల అత్యాశ కోటకు బీటలు వేస్తోంది. భావితరాలకు అందించాల్సిన చారిత్రక సంపద శిథిలావస్థలోకి నెడుతున్నారు. కోటలో ఉన్న శైవ, వైష్ణవ, జైన దేవాలయాలలో విగ్రహాలను సైతం మాయం చేశారు. అంతంతమాత్రమే ఉన్న పోలీసు పహారా.. జాడలేని పురావస్తు శాఖ .. వెరసి రత్నగిరి కోట రాళ్ల కుప్పగా మారిపోతుంది.
అబ్బురపరిచే నిర్మాణం
కోటలో రాజమహల్‌కు ఈశాన్య దిక్కున ధనాగారాన్ని నిర్మించారు. రాజ్యం ఓటమిపాలైనా కూడా ధనం శత్రువులకు దొరక కూడదన్న ఉద్దేశంతో పెద్ద రాళ్ళు మధ్య ఎవరూ ఊహించని విధంగా నిర్మించిన తీరు ఆశ్చర్యపరుస్తోంది. అన్ని వేల సంవత్సరాల క్రితమే ఇలా ఆలోచించి నిర్మించడం విశేషం. అత్యంత దృఢంగా కోటగోడను, కోట ముఖ ద్వారాలు నిర్మించారు. చిన్నపాటి మెళకువలతో శత్రువు కోటలోకి ప్రవేశించేందుకు అష్టకష్టాలు పడేలా ప్రణాళిక రూపొందించారు. చక్రవర్తి అయినా టిప్పుసుల్తాన్‌కే ఆరు నెలలు యుద్ధం చేయాల్సి వచ్చిందంటే కోట విశిష్టత అర్థం చేసుకోవచ్చు. కోట లోపలే కారాగారం , ధనాగారం , ధాన్యాగారం నిర్మించి యుద్ధ సమయాలలో వినియోగించుకోవడానికి అనుకూలంగా నిర్మించారు. కోటలోపల కొండపైన సహజసిద్ధంగా ఉన్న నీటి నిల్వలకు అదనంగా ప్రహరీలు నిర్మించి, మెట్లు ఏర్పాటుచేసి నీటిని ఉపయోగించుకున్న విధానం అబ్బురపరచకమానదు.
కోట లోపల నాలుగు రహదారులు కలిసేలా నిర్మాణం ఉంటే వజ్ర వైడూర్య రత్నాలు లభించేందుకు సంకేతాలుగా చరిత్రకారులు చెబుతారు. రత్నగిరి కోటలో కూడా నాలుగు రహదారుల కూడలిగా ఉండడంతో గుప్తనిధుల వేటగాళ్ల తాకిడి పెరిగిపోయింది. వాస్తవంగా రత్నగిరిని శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు సంపదను దాచుకోవడానికి ఉపయోగించుకునేవారట. చెక్కు చెదరని కట్టడాలను పరిరక్షించి, భావితరాలకు చారిత్రక సంపదను అందజేసే బాధ్యత అక్కడి యువత తమ భుజాలపై ఎత్తుకుంది. నిరంతరం పరిరక్షిస్తూ శిథిలావస్థకు చేరుకుండా కాపాడుకుంటుంది. దీనికితోడు పురావస్తు శాఖ, పోలీసులు, ప్రభుత్వం సహకరిస్తే మరికొన్ని వేల సంవత్సరాలపాటు సంపదను కాపాడుకోనే వెసలుబాటు ఉంది. ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలని స్థానికులు కోరుతున్నారు.