AP Politics: ఎమ్మెల్యే సీటు కోసం మొగ్గుచూపుతున్న ఎంపీలు, ఎవరికి ఛాన్స్ దక్కేనో!
ఎంపీ పదవిపై ఎందుకో నిరాసక్తత..ఎమ్మెల్యే పదవిపై ఎందుకో ఆతృత..మొత్తం మీద రాబోయే ఎన్నికలకోసం ఎవరి కసరత్తులు వారు ప్రారంభించారట...ఆ ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యే అభ్యర్ధిత్వానికే ఎక్కువ మొగ్గుచూపుతున్నారట..
ఆ ముగ్గురు చూపు అసెంబ్లీ నియోజకవర్గాలపైనే..!
ఎమ్మెల్యే అభ్యర్ధిత్వానికి మొగ్గుచూపుతున్న ఎంపీలు
వారిలో ఇద్దరు రాజకీయానికి కొత్త.. ఒకరు గతంలో ఎమ్మెల్యేగా, జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు.. అయితే అంతా అనుకోకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఎంపీ అభ్యర్ధులుగా ప్రకటించారు. అంతే అనూహ్యంగా గెలుపొందారు.. కానీ ఎక్కడో అసంతృప్తో లేక ఎమ్మెల్యేగా గెలుచుంటే మంత్రి పదవి దక్కేదనో మొత్తం మీద ఈసారి ఎన్నికల్లో ఏది ఏమైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిసైడ్ అయిపోయారట. ఏడు నియోజకవర్గాలకు ఎంపీగా ఉండేకంటే ఒక్క నియోజకవర్గంలో తానే రాజు తానే మంత్రిగా కొనసాగడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చారనుకుంటున్నారట.. ఇంతకీ ఎంపీ పదవిపై ఎందుకో నిరాసక్తత. ఎమ్మెల్యే పదవిపై ఎందుకో ఆతృత.. మొత్తం మీద రాబోయే ఎన్నికలకోసం ఎవరి కసరత్తులు వారు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
పిఠాపురంపైనే ఆసక్తితో నిధులన్నీ అటువైపే..
కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పళ్లంరాజు కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆతరువాత రాష్ట్రవిభజన తరువాత 2014లో టీడీపీ తరపున తోట నరసింహారావును ఎంపీ స్థానానికి పోటీలోకి దింపింది టీడీపీ అధిష్టానం. వైసీపీ తరపున పోటీచేసిన సునీల్ ఓడిపోవడంతో పార్టీకు దూరమయ్యారు. అయితే కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్ధిత్వానికి సరైన అభ్యర్ధి వైసీపీ వెతుక్కోవ్వాల్సి వచ్చింది.. దీంతో అప్పటికే పార్టీలో చేరి ఎక్కడో ఓ చోట ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని కోరిన వంగా గీతకు అనూహ్యంగా కాకినాడ ఎంపీ సీటు దక్కింది. తక్కువ సమయంలో సీటు దక్కించుకున్నా జగన్ మానియాలో గెలుపు నల్లేరుమీద నడకలానే వరించింది.. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో అందరి శాసన సభ్యులతో సఖ్యతగానే ఉంటోన్న ఎంపీ వంగా గీత ఈ సారి ఎమ్మెల్యేగా పోటీచేయాలని అనుకుంటున్నారట. దీనికోసమే తాను గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసి గెలుపొందిన పిఠాపురంలో పోటీచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో ఉన్న పరిచయాల నేపథ్యంలో ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా అత్యధికంగా పిఠాపురం నియోజకవర్గానికి నిధులు కేటాయించడం వెనుక కూడా ఎంపీ గీత స్కెచ్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పిఠాపురం నుంచి పెండెం దొరబాబు ఉన్నా అధిష్టానం ఓకే అంటే పోటీ చేసేందుకు తాను సిద్ధం అంటున్నారట ఎంపీ వంగా గీత.
టీడీపీ గెలుపుతో ప్రాతినిథ్యం, పెత్తనం.. అన్నీ తానై..
రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి నూనతంగా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన మార్గాని భరత్‌రామ్ వైసీపీ నుంచి పోటీచేసి గెలుపొందారు. అయితే అనేహ్యంగా రాజమండ్రి అర్బన్, రూరల్ రెండు అసెంబ్లీ స్థానాలు టీడీపీ గెలుపోందాయి. దీంతో అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎంపీ మార్గాని భరత్ తన ప్రభావాన్ని చూపుతున్నారు. అధికారిక కార్యక్రమాలకు తానే అన్నీ అయ్యి చేస్తుండడంతో ఆయనకు ఎటువంటి అసమ్మతి సెగ లేకపోగా రాజమండ్రి కేంద్రంగా రాజకీయంగా దూసుకుపోతున్నారు. అయితే ఆమధ్య రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ఎంపీ భరత్‌కు మధ్య కొంత మనస్పర్ధలు వచ్చిన క్రమంలో ఇద్దరూ రచ్చకెక్కిన నేపథ్యంలో అధిష్టానం ఇద్దరినీ పిలిచి అక్షింతలు వేయడంతో ఆ వివాదం కాస్త సద్దుమనిగింది. రాజమండ్రి నుంచి తరచూ పార్టీ వాయిస్ వినిపిస్తున్న ఎంపీ మార్గాని భరత్ తాను వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ప్రయత్నాల్లో ఉన్నారట. ఈనేపథ్యంలోనే రాజమండ్రి సిటీ వేదికగా ఎంపీ ల్యాడ్స్ నుంచే కాక అనేక సీఎస్సార్ నిధుల ద్వారా కూడా అగ్రభాగం రాజమండ్రి అర్భన్ డెవలప్‌మెంట్‌కు వినియోగిస్తున్నారని తెలుస్తోంది.
ఈ సారి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందితే మంత్రి పదవి దక్కించుకోవాలన్న ఆకాంక్షతోనే ఆయన ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు గట్టి పట్టుదలతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.. దీనికి తోడు టీడీపీనుంచి ఈసారి ఆదిరెడ్డి భవానీకు బదులు ఆమె భర్త పోటీచేస్తానని ప్రకటించడం కూడా జరిగింది. కొసమెరుపేంటంటే మార్గాని భరత్ గనుక ఎంపీగా పోటీచేస్తే ఈసారి రాజమండ్రి నుంచి తానే రంగంలోకి దిగుతానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించడం విశేషం.
మొదటి నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిత్వంపైనే మక్కువతో..
అమలాపురం పార్లమెంటు నియోజకవర్గానికి ఎవ్వరు పోటీచేసినా స్థానికులు కానివారే నెగ్గిన పరిస్థితి ఉంది. గతంలో రాజమండ్రికి చెందిన జీవీ హర్షకుమార్ రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. ఆతరువాత టీడీపీ తరుపున పండుల రవీంద్రబాబుకూడా విశాఖ నుంచి వచ్చి పోటీచేసి గెలుపొందారు. 2019 ఎన్నికల నాటికిపార్లమెంటరీ నియోజకవర్గంకు అనూహ్యంగా చింతా అనురాధ పేరు తెరమీదకు వచ్చి ఆమె పోటీచేశారు. నిజానికి అనురాధ ఎస్సీ రిజర్వుడు స్థానం ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి తనకు టిక్కెట్టు కేటాయించాలని పట్టుపట్టినా అప్పటికే అన్ని నియోకవర్గాల్లో పాతుకుపోయిన అభ్యర్ధులు ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు. అయితే తప్పక ఎంపీగా పోటీచేసిన అనురాధ ముక్కోణపు పోటీల్లో విజయం సాధించారు.
బాలయోగి వారసునిగా తెరమీదకు వచ్చిన ఆయన తనయుడు గట్టిపోటీ ఇచ్చినా మొత్తంమీద గెలుపొందారు. అయితే ఆమె స్వస్థలం అమలానురం నియోజకర్గం కాగా ఎక్కువ దృష్టి అంతా ఇక్కడే పెట్టడం, నిధులు కేటాయించడం వంటి చర్యలతో మంత్రి విశ్వరూప్‌కు, ఎంపీ అనురాధ మధ్య పొరపొచ్చలు తీవ్రంగా వచ్చాయని ఆమాధ్య ప్రచారం జరిగింది. ఆతరువాత ఆవ్యవహారాలు సద్దుమనిగినా మళ్లీ ఈ మధ్యకాలంలో మళ్లీ పునరావృతం అయ్యిందని, ఇద్దరి మధ్య అంతగా సఖ్యత లేదన్నది కొన్ని పరిణామాలను బట్టి బహిర్గతం అయ్యిందనే చెప్పవచ్చు.
ప్రస్తుతం ఎంపీ అనురాధ పి.గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. లేకపోతే మంత్రి విశ్వరూప్ పోటీచేయకుండా ఆయన తనయుడ్ని రంగంలోకి దింపితే ఆయన్ను పి.గన్నవరం పంపి అమలాపురం తనకే ఇవ్వాలని కోరుతున్నట్లు కూడా చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు మక్కువ చూపడంతో తీవ్ర చర్చ జరుగుతోంది..