MLC Anantha Udaya Bhaskar: డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబు ! సాయంత్రం పోలీసుల ప్రెస్‌మీట్
Driver Subrahmanyam Murder Case: వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నాడన్న కారణంగానే, కక్ష్యగట్టి గతంలో తన వద్ద డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు సమాచారం.
MLC Anantha Udaya Bhaskar Arrested: మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నాడన్న కారణంగానే, కక్ష్యగట్టి గతంలో తన వద్ద డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు సమాచారం. అయితే తాను సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు పోలీసుల వద్ద ఒప్పుకున్నారు. కాకినాడ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా, తాను ఒక్కడే ఈ హత్య చేసినట్లు అంగీకరించారు. కానీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. ఈ ప్రకటన కోసం ఏపీ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
డీఐజీ పాలరాజు నేటి సాయంత్రంలోగా మీడియా సమావేశం నిర్వహించి సుబ్రహ్మణ్యం హత్య కేసు వివరాలు, ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయడంపై వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. విజయ్, బాబ్జీ అనే అనుచరులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారికి ఈ హత్యతో సంబంధం లేదని పోలీసులు గుర్తించారు. కేవలం వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నాడన్న కారణంగా మాజీ డ్రైవర్ ను కారులో తీసుకెళ్లి అతడిపై దాడి చేసి కాళ్లు, చేతులు విరిచేశారు. శరీరంపై కొట్టిన గాయాలు ఉండటంతో అతడి కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం చనిపోయాడని, అతడి కుటుంబసభ్యులను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ అతడి కుటుంబీకులు ప్రశ్నల వర్షం కురిపించగా అక్కడి నుంచి ఎమ్మెల్సీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోస్టుమార్టం రిపోర్టు రాకముందే అనంతబాబును అరెస్ట్ చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఉద్రిక్తతల మధ్య కాకినాడ జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, ఆదివారం ఉదయం కుటుంబసభ్యులకు సుబ్మహ్మణ్యం డెడ్ బాడీని అప్పగించారు. ఈ క్రమంలో నిన్న రాత్రి అరెస్ట్ చేయగా, నేడు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినట్లు సమాచారం. విచారణలో హత్య చేసినట్లు ఎమ్మెల్సీ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం మీడియా సమావేశంలో కాకినాడ పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
హత్య కేసు నమోదైంది, గోప్యత ఎందుకు ?
సుబ్రహ్మణ్యం హత్య కేసులో మొదట వేరే కేసు నమోదు చేసినా పోస్టు మార్టం రిపోర్టు వివరాలతో హత్య కేసుగా మార్చారు. దాంతో పాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు సైతం నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. ఎమ్మెల్సీని అనంతబాబును అరెస్ట్ చేసినా ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి నేరుగా కస్టడీగా తీసుకున్నాక పోలీసులు అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.