Tiger Fear in Kakinada: కాకినాడ జిల్లాలో చిరుత పులి భయం - మూగ జీవాలపై వరుస దాడులతో అలర్ట్
కాకినాడ జిల్లాలో మళ్లీ పులి భయం నీడలా వెంటాడుతొంది. తాజాగా కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామ శివారు పొలాల్లో పశువులపై గుర్తు తెలియని జంతువు దాడి చేసింది..
పశువుల పాకలో కట్టిఉన్న దూడపై దాడి..
ఉప్పలపాడు గ్రామంలోని అంకం నూకరాజు అనే రైతు పశువుల పాకలో కట్టివేశాడు. రాత్రి సమయంలో పాకలో కట్టేసున్న దూడపై గుర్తు తెలియని జంతువు దాడిచేసయడంతో ఉదయానికి తీవ్ర గాయాలతో ఉండడాన్ని గమనించాడు యజమాని. ఈవార్త గ్రామంలో తెలియడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. దూడ శరీరంపై ఉన్న గాయాలను బట్టి చిరుతపులి, లేక పులి దాడిలా అనుమానిస్తున్నారు. లేగదూడపై పులి దాడిచేసిందన్న వార్త కొన్ని గంటల వ్యవధిలోనే ప్రచారం జరిగిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అది పులిదాడి కాదని అధికారుల నిర్ధారణ..
గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామాంలో లేగదూడపై జరిగిన దాడి పెద్దపులికానీ, చిరుత కూడా కాదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. లేగదూడపై గుర్తుతెలియన జంతువు దాడికి పాల్పడిరదన్న గ్రామస్తుల ఫిర్యాదుతో ఆ ప్రాంతానికి కాకినాడ ఫారెస్ట్ రేంజర్ టి.సత్యనారాయణ పరిశీలించారు. గాయపడ్డ లేగదూడను వైల్ట్ వెటర్నరీ సిబ్బందితో కలిసి గాయాలను పరిశీలించి చివరకు అది చిరుత పులి దాడి కాదని నిర్ధారించారు. దాడి చేసింది రేస్ కుక్క అని, అది అటవీప్రాంతంలో ఉంటుందన్నారు. దీనిపై ప్రజలు ఎటువంటి భయాందోళనలను చెందాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని మీడియాల్లో ఇప్పటికే పెద్దపులి దాడి, చిరుతపులి దాడి అంటూ వార్తలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, లేగదూడపై దాడి జరిగిన చోట ఎటువంటి పులికి సంబందించిన ఆనవాళ్లు లభించలేదని, అంతేకాకుండా గాయాలనుబట్టి అది పులి దాడి మాత్రం కాదని తేల్చి చెప్పారు.
మూడు నెలలు కంటిమీద కునుకు లేకుండా చేసిన పెద్దపులి..
కాకినాడ జిల్లాలని సరిగ్గా ఏడాది క్రితం ప్రత్తిపాడు నియోజవర్గంలో ఏడు గ్రామాల ప్రజలను పెద్దపులి కంటిమీద కునుకులేకుండా చేసింది. అప్పట్లో సుమారు 26 పశువులకుపైగా చంపి తిన్న పెద్దపులి ఏక్షణాన ప్రజలపై విరుచకుపడుతుందోనని తీవ్ర భయందోళనలో చివురుటాకుల్లా వణికిపోయారు. ఫారెస్ట్ అధికారులు అనేక బృందాలుగా ఏర్పాడి పెద్దపులిని పట్టుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చిక్కక దొరకక ముప్పు తిప్పలు పెట్టింది. చివరకు అటవీమార్గం ద్వారానే విశాఖ జిల్లా పరిధిలోని అటవీప్రాంతంలోకి వెళ్లిపోవడంతో కాకినాడ జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.