Pawan Kalyan: వైసీపీ తెగులుకు వ్యాక్సిన్ మేమే, ఆ ఓట్లు చీలనివ్వం - జనసేన, టీడీపీ భేటీ అనంతరం పవన్ కల్యాణ్
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన - టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ వ్యతిరేక ఓటు చీల్చనివ్వబోమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీ నియంత విధానాల తెగులు పోవాలంటే అందుకు టీడీపీ - జనసేన వ్యాక్సిన్ మాత్రమే మందు అని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన - టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ పమావేశంలో పవన్ కల్యాణ్, లోకేశ్ అధ్యక్షతన జరగ్గా. రెండు పార్టీల తరపున ముఖ్య నేతలు హాజరు అయ్యారు.
గొడవలు రాకుండా చూసుకుంటాం
‘‘ఉమ్మడిగా ఎలా వెళ్లాలనే దానిపై రెండో సమావేశంలో నిర్ణయిస్తాం. 3 విడతలుగా మా సమావేశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రజలకు తొలుత భద్రత, సంక్షేమం, అభివృద్ధి కావాలి. ప్రజలకు మేలు చేసే అంశాలపైనే చర్చించాం. రెండుపార్టీల మధ్య ఉండే క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించుకుంటాం. రెండు పార్టీల మధ్య ఎలాంటి గొడవలు, భేదాభిప్రాయాలు రాకుండా చూసుకుంటాం.
చంద్రబాబును అక్రమంగా, అకారణంగా జైలులో పెట్టారు. సాంకేతిక అంశాల పేరుతో బెయిల్ రాకుండా చేస్తున్నారు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చేందుకే రాజమండ్రిలో భేటీ అయ్యాం. మా రెండు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉండాలనే దానిపై చర్చించాం. టీడీపీ-జనసేన ఎలా కలిసి పని చేయాలనే దానిపై సుదీర్ఘంగా రెండు పార్టీల నేతలు లోతుగా చర్చించారు. రాష్ట్ర ప్రజలకు సుస్థిరమైన ప్రభుత్వం ఇవ్వాలనే దానిపై చర్చించాం. త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తాం’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ కి అనుభవం ఉన్న నాయకుడు ఉండాలనే ఉద్దేశంతోనే 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చాం. మేం వైఎస్ఆర్ సీపీ విధానాలకు పూర్తిగా వ్యతిరేకం. వారు మద్య నిషేధం చేస్తామని చెప్పి విచ్చలవిడిగా నకిలీ మద్యాన్ని అమ్మేస్తున్నారు. ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ సీపీ అనే తెగులు పట్టుకుంది. వైఎస్ఆర్ సీపీ తెగులు పోవాలంటే టీడీపీ - జనసేన వ్యాక్సిన్ అవసరం ఉంది’’ అని పవన్ కల్యాణ్ మాట్లాడారు.
ఉమ్మడి కార్యాచరణ - లోకేశ్
నారా లోకేశ్ మాట్లాడుతూ.. దసరా నాడు టీడీపీ - జనసేన పార్టీలు సమావేశం కావడం ఏపీ ప్రజలకు మేలు చేస్తుందని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే రెండు పార్టీల నేతలం భేటీ అయ్యామని లోకేశ్ అన్నారు. వైఎస్ఆర్ సీపీ పాలనలో బీసీ వర్గాలను వేధిస్తున్నారని.. బీసీలకు రావాల్సిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని అన్నారు. ఎస్సీలకు రావాల్సిన 26 సంక్షేమ కార్యక్రమాలను కూడా రద్దు చేశారని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ నేతల వేధింపుల వల్ల ఎంతో మంది ముస్లింలు కూడా ఆత్మహత్య చేసుకున్నారని లోకేశ్ అన్నారు. అటు సాగునీటి ప్రాజెక్టుల్లో కూడా ప్రభుత్వ చేతకానితనం కనిపిస్తోందని.. పరిశ్రమలు నెలకొల్పే విషయంలోనూ నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని విమర్శించారు.
నవంబరు 1న మేనిఫెస్టో
‘‘నవంబరు 1న టీడీపీ మ్యానిఫెస్టో ప్రకటించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తాం. తాజాగా నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో మూడు తీర్మానాలు చేశాం. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తీర్మానం చేశాం. అరాచక వైసీపీ పాలన నుంచి ప్రజలను రక్షించాలని తీర్మానం చేశాం. రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పోరాడాలని తీర్మానం చేశాం. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ - జనసేన ప్రభుత్వం వస్తుంది. నవంబరు 1న ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తాం. ఓటరు జాబితాపై అక్రమాలపై క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా పరిశీలన చేస్తాం’’ అని లోకేశ్ తెలిపారు.