Kakinada TDP Latest News: కార్యకర్తలకు న్యాయం చేయడంలో టీడీపీ విఫలం- అందుకే రాజీనామా చేశా;కాకినాడ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..
Kakinada TDP Latest News:కాకినాడలో పార్టీ శ్రేణులకు న్యాయం చేయడంలో టీడీపీ విఫలమైందని సీనియర్ నేత పిల్లి సత్యనారాయణమూర్తి విమర్శించారు. ఇంఛార్జ్ పదవి ఉండటం వృథా అని రాజీనామా చేశారు.

Kakinada TDP Latest News: కాకినాడ రూరల్ టీడీపీ నియోజవకర్గ సమన్వయకర్త, పార్టీ సీనియర్ లీడర్, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త పిల్లి సత్యనారాయణమూర్తి(సత్తిబాబు) రాజీనామా చేశారు. ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పదవికి రాజీనామా చేసిన అనంతరం మీడియా సమావేశంలో ఆవేదన వెళ్లగక్కారు. కాకినాడ రూరల్లో తెలుగుదేశం పార్టీకి సముచిత స్థానం కల్పించడంలో పార్టీ విఫలమైందన్నారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు, నాయకులకు న్యాయం చేయలేని పదవిలో ఉండి ప్రయోజనమేంటని ప్రశ్నించారు. ఆ పరిస్థితి లేకనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాకినాడ రూరల్ వలసపాకలలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడి పార్టీపై తన అసంతృప్తిని బయటపెట్టారు..
టీడీపీని ఎమ్మెల్యే పూర్తిగా పక్కన పెట్టారు..
జనసేనకు చెందిన ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) ప్రభుత్వ పథకాల్లో తెలుగుదేశం పార్టీకి ప్రధాన్యత ఇవ్వడం లేదన్నారు. దానివల్ల కార్యకర్తలకు ఏ విధమైన న్యాయం చేయలేకపోతున్నాననే మనస్థాపనతో టీడీపీ ఇచ్చిన కో- ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని పిల్లి సత్యనారాయణమూర్తి చెప్పారు. కాకినాడ రూరల్లో తెలుగుదేశం పార్టీకి సముచిత స్థానం కల్పించడంలో అధిష్ఠానం విఫలమైందన్నారు.ఎన్నికల ప్రచారంలో తిరిగేటప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వంలో కాకినాడ రూరల్ గాను తెలుగుదేశం పార్టీకి 50 శాతం, జనసేనకు 50 శాతం అనే సిద్ధాంతంతో కార్యకర్తలు జనసేన జెండా మోసి అభ్యర్థిని గెలిపించుకున్నామన్నారు. కానీ గడిచిన 14 నెలలలో గెలిచిన ఎమ్మెల్యే నానాజీ కనీసం తమ వంక కూడా చూడకపోగా టీడీపీ కార్యకర్తలను, నాయకులను పట్టించుకునే పరిస్థితి లేదని పిల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలకు ఏ విధమైన న్యాయం చేయలేకపోతున్నానే బాధతో రూరల్ కో- ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
సొంత పార్టీలోనే పొగపెడుతున్నారు..
నియోజకవర్గ అబ్జర్వర్‌గా నియమించిన రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు ఏకపక్ష నిర్ణయాలతో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని పిల్లి ఆరోపించారు. కో కో ఆర్డినేటర్‌గా ఉన్న కటకంశెట్టి సత్య ప్రభాకర్ (బాబీ) రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో విభేదాలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా తాను ఎదగడానికి లేకుండా చేస్తున్నారని చెప్పారు. తప్పుడు రాజకీయాలను నిలువరించవలసిన స్థానంలో ఉన్న అబ్జర్వర్ కుడిపూడి గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 40 ఏళ్ల క్రితం పార్టీలో చేరానని నేటికీ అదే పార్టీలో ఉన్నానని చెప్పారు. తాను చనిపోయిన తర్వాత కూడా టీడీపీ జెండా తనపై కప్పి శ్మశానానికి తీసుకెళ్లడమే తన చివరి కోరికని ఆవేదన వ్యక్తం చేశారు.
రూరల్ నియోజవర్గంలో పార్టీలో ఉన్నా కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాన్న బాధ తనను వేధిస్తుందని పిల్లి వెల్లడించారు. చాలాసార్లు ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి పెద్దల దష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోలేదన్నారు. రాను రాను కార్యకర్తల వద్ద తాను చులకన అయ్యే పరిస్థితి కనపడుతుందని అందుకే పదవికి రాజీనామా చేసి కేవలం కార్యకర్తగా కొనసాగుతానని పిల్లి స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఆదేశించిన కార్యక్రమాలను శక్తివంచన లేకుండా విజయవంతం చేస్తానని పిల్లి తెలిపారు.
పిల్లి సేవలు టీడీపీ అధిష్టానానికి తెలుసు.. మాజీ ఎమ్మెల్యే వర్మ
కూటమి ప్రభుత్వంలో చిన్న చిన్న మనస్పర్ధలు సహజమేనని, వాటిని చక్కదిద్దుకుంటామని పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎస్విఎస్ఎన్ వర్మ అన్నారు. పిల్లి సత్యనారాయణమూర్తి పార్టీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్వగృహానికి వర్మ వచ్చి పిల్లి దంపతులతో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నాయని వీటన్నిటిని అధిష్టానం పరిష్కరిస్తుందని వర్మ తెలిపారు. పిల్లి ఇప్పటివరకు పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని ఎట్టి పరిస్థితుల్లోనూ సత్తిబాబును వదులుకునే పరిస్థితి పార్టీకి లేదని చెప్పారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా ఇన్చార్జి మత్రి పి నారాయణ సూచన మేరకు తాను పిల్లి దంపతులతో సుదీర్ఘంగా మాట్లాడానని ఒక వారం రోజుల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు వీరితో చర్చిస్తారన్నారు. ఇది కేవలం కుటుంబంలో వచ్చిన చిన్న మనస్పర్ధగా మాత్రమే చూడాలని వర్మ అన్నారు.





















