(Source: Poll of Polls)
Pawan Kalyan: పదవి ఉన్నా లేకున్నా రాజాలాగే ఉంటా, పిఠాపురంలో మూడెకరాలు కొన్నా - పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
AP Latest News in Telugu: పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి వారాహి సభ నిర్వహించారు. పిఠాపురం పర్యటనలో భాగంగా ఆ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Pithapuram News: పిఠాపురం ప్రజలు తనకు ఇచ్చిన విజయంతో ఈ విషయాన్ని దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని.. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న ప్రతి మనిషికి అండగా ఉంటానని అన్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని వైసీపీ నేతలు మాట్లాడారని.. అలాంటిది తనను పిఠాపురం ప్రజలు డిప్యూటీ సీఎంను చేశారని గుర్తు చేశారు. టీడీపీ నేత వర్మ కూడా ఇవే మాటలు అన్నారని, అవి నిజమయ్యాయని అన్నారు. పిఠాపురం పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో వారాహి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.
తనను హోంశాఖ తీసుకోమని చాలా మంది చెప్పారని పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ, గ్రామాల్లో ప్రజల కోసం తాను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానని అన్నారు. తనకు ఎలాంటి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖలో ప్రతి రూపాయి సద్వినియోగం కావాలని.. ప్రతి రూపాయిని అధికారులను లెక్కలు అడుగుతున్నట్లు చెప్పారు. పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ పిఠాపురం ప్రజల ముందు మరోసారి ప్రమాణం చేశారు. తాను హైదరాబాద్‌లో ఉంటానని.. ప్రచారం చేశారని.. అందుకే పిఠాపురంలో తాను మూడెకరాలు భూమి కొన్నట్లు చెప్పారు. దానికి ఈరోజే రిజిస్ట్రేషన్ కూడా అయిందన్నారు.
ఇప్పటికే ఏపీ ఆర్థిక లోటులో ఉందని.. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని తాను, చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు చెప్పారు. పిఠాపురం ప్రజల విజ్ఞప్తులను తీసుకోవడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించానని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే ఏ వినతులైనా వారు స్వీకరిస్తారని అన్నారు. పిఠాపురంలోని శ్రీపాద వల్లభుడి సాక్షిగా మీకు రుణపడి ఉంటానని అన్నారు. పదవి ఉన్నా లేకున్నా నాలో ఎలాంటి మార్పు ఉండదని.. ఎప్పుడూ రాజాలాగే ఉంటానని అన్నారు. ఈ ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో పిఠాపురం ప్రజలకు చూపిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు.
ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కొరకు మారిటైం బోర్డు, కేంద్ర ఖగోళశాస్త్ర మంత్రిత్వశాఖ అధికారులతో కలసి తీర ప్రాంత పర్యటనలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/7w5j8d8asG
— JanaSena Party (@JanaSenaParty) July 3, 2024