Margani Bharat: ఆ స్కాముల్లో పవన్ పాత్రపైనా అనుమానం ఉంది - ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు
Margani Bharat: చంద్రబాబు స్కాముల్లో పవన్ కళ్యాణ్ పాత్రపైనా పలు అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు.
Margani Bharat: చంద్రబాబు స్కాముల్లో పవన్ కళ్యాణ్ పాత్రపైనా పలు అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. పవన్ మాటలు వింటుంటే ప్రజలకే కాదు.. తమ పార్టీకీ కూడా నిజమేనేమో అనిపిస్తోందన్నారు. శుక్రవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన దొందుకు దొందేనని, వారి మధ్య అండర్ స్టాండింగ్ ఉందని మొదట నుంచీ తాము చెబుతూనే ఉన్నామని గుర్తుచేశారు. ఈ రోజు చంద్రబాబు ఆర్థిక నేరాల కారణంగా సెంట్రల్ జైలులో ఉండటం వల్ల పవన్ ఆవేశంతో చెప్పినట్లు నటిస్తున్నా..సమయం వచ్చింది కాబట్టి ముసుగుతీశారన్నారు.
బీజేపీతో టీడీపీకి సయోధ్య కుదుర్చమని పవన్‌కు చంద్రబాబు టాస్క్ ఇచ్చారని, అలాగే టీడీపీ ఎంపీలు నలుగురికి కూడా టాస్క్ ఇచ్చినా ఫెయిల్ కావడంతో.. పొత్తు డ్రామా ప్రారంభించారని ఎంపీ భరత్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయ డ్రామాలు బీజేపీ అగ్రనేతలకు తెలియనదేమీ కాదని, అందుకే వీరిద్దరి నాటకాలు అక్కడ సాగలేదన్నారు. పవన్ నిన్న మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో అభిప్రాయ భేదాలు ఉన్నాయని, ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్న అంశం వల్లనే గత ఎన్నికలలో విడిగా పోటీ చేశానని చెప్పారని, మరి ఈ రోజు ఏ స్పెషల్ ప్యాకేజీ అందడంతో మరో సారి పొత్తు కుదిరింది అంటూ అని ఎంపీ ప్రశ్నించారు.
గతంలో లోకేష్ అవినీతిపై ఇదే పవన్ కల్యాణ్ విమర్శలు చేశారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని టీడీపీతో పొత్తుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. సొంత పుత్రుడు లోకేష్‌పై చంద్రబాబుకు నమ్మకం లేదని, అందుకే దత్తపుత్రుడిని ముసుగు తీసి రమ్మన్నారని చెప్పారని, అందుకే పవన్ కళ్యాణ్ 'పొత్తు' ప్రస్తావనను తీసుకొచ్చారని విమర్శించారు. టీడీపీ, జనసేన పొత్తు ప్రజలందరికీ ముందే తెలుసని, కాకపోతే అధికారికంగా నిన్న చెప్పుకొచ్చారని అన్నారు. చంద్రబాబు చిప్ పాతతరానికి చెందినదని, ఇంకా అప్ గ్రేడ్ కాలేదన్నారు.
చిత్ర రంగంలో తనకు రోజుకు రూ.2 కోట్లు వస్తాయని పవన్ ఎవరికి చెబుతున్నారని ఎంపీ భరత్ ప్రశ్నించారు. చంద్రబాబుకు పరోక్షంగా తన ప్యాకేజీ పెంచమని సంకేతాలిచ్చినట్టు ప్రజలు భావిస్తున్నారని, లేకపోతే ప్రజల వద్దకు చెప్పాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పోరాటానికి సిద్ధమని పవన్ పదే పదే చెప్పడం తప్ప చేసేదేమీ లేదన్నారు. పవన్ పోరాటం చేస్తామంటే ఎవరూ వద్దని అనలేదని, కానీ ప్యాకేజీ కోసమే పోరాటం మాట ఎత్తుతారని ఘాటు విమర్శలు చేశారు. గత పది సంవత్సరాల నుంచీ పోరాటం చేయమనే చెబుతున్నామని, కానీ పవన్ ప్యాకేజీ కోసం వెంపర్లాడుతన్నారని ఎద్దేవా చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం అనకొండ లాంటి చంద్రబాబుకు చిన్నదేనని, ఈ స్కామ్‌లో సూత్రధారి, పాత్రధారి చంద్రబాబు అండ్ టీమ్ సహా పవన్ కల్యాణ్ భాగస్వామ్యం కూడా ఉందని స్పష్టమవుతోందని భరత్ అన్నారు. లోకేష్ ఢిల్లీ పర్యటనపై ఆయన స్పందిస్తూ.. ఢిల్లీ వెళ్లి అక్కడ ఏమి చెబుతాడు? రూ.370 కోట్లు తీసుకోలేదని చెబుతాడా అంటూ ప్రశ్నించారు. ఒకవైపు ప్రధాని మోదీ జీ 20 శిఖరాగ్ర సదస్సుతో మన భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో ఉన్నతంగా తీసుకొస్తుంటే.. చంద్రబాబు జర్ననీ ఇంటర్నేషనల్ కంపెనీ పేరుతో భారీ స్కామ్ చేసి మన దేశ పరువు తీసేశారని భరత్ మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ ఎన్ని కూటములు కట్టినా తమ పార్టీకి నష్టం లేదన్నారు. వైసీపీ సింగిల్‌గానే పోటీ చేస్తుందన్నారు.