పిచ్చాసుపత్రిలో చేరే రోజు దగ్గర్లోనే! అమిత్ షా-జూ. ఎన్టీఆర్ భేటీపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
Minister Roja Comments: రాజమహేంద్రవరంలో మంత్రి రోజా శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు.
Minister Roja: ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా - నటుడు జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కావడం విపరీతంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. రాజమండ్రిలో శుక్రవారం రోజు మంత్రి రోజా పర్యటించారు. వీఎల్ పురంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శుక్రవారం (ఆగస్టు 26) ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రోజా అమిత్ షా - ఎన్టీఆర్ భేటీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. మరోవైపు బాలకృష్ణ ఉచిత ఆరోగ్య రథం ప్రారంభించి ఆ రథంపై కేవలం ఎన్టీఆర్, బాలకృష్ణ ఫోటోలనే ముద్రించుకున్నారని చంద్రబాబు ఫోటో ఆ రథంపై ముద్రించలేదని ఎద్దేవా చేశారు. దీనిని బట్టి నందమూరి ఫ్యామిలీలో చంద్రబాబు విలువ పడిపోయినట్లుగా అర్థం అవుతోందని రోజా వ్యాఖ్యలు చేశారు.
కుప్పంలో కూలడం ఖాయం - రోజా
చంద్రబాబు కుప్పం పర్యటన గురించి మాట్లాడుతూ.. కుప్పంలో చంద్రబాబు కోట కూలిపోనుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం అని అన్నారు. చంద్రబాబు పిచ్చి ఆసుపత్రిలో చేరే రోజులు దగ్గరపడ్డాయని, అందుకే పిచ్చి ఎక్కినట్లు ప్రవర్తిస్తున్నాడని రోజా మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాల పేరుతో సీఎం జగన్ ఎప్పుడు బటన్ నొక్కినా ఏదో ఒక రాద్దాంతం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చేందుకు కుటిల ప్రయత్నాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. మొన్నటి వరకు ఎంపీ గోరంట్ల మాధవ్ ఫేక్ వీడియోను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రాజకీయాలు చేశారని అన్నారు. ఇప్పుడు కుప్పంలో అల్లర్లు సృష్టించి ఆ బురదను వైఎస్ఆర్ సీపీపై చల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రోజా తప్పుబట్టారు.
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
ప్రధాన కేంద్రమైన రాజమండ్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి ఆర్ కే రోజా వచ్చారు. రోజాకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత శుక్రవారం ఉదయం స్థానికంగా ఆమె బస చేసిన విడిది గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చేం అందచేశారు. ఈ సందర్భంగా జిల్లాలో పర్యాటక, క్రీడా శాఖల పరిధిలో చేపట్టనున్న పలు అంశాలపై కలెక్టర్ మంత్రికి వివరించారు. మంత్రిని కలిసిన వారిలో మున్సిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్, తదితరులు ఉన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా..
రాజమండ్రిలో జరుగుతున్న ఇటీవల పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఆర్కే రోజా ముఖ్యఅతిథిగా హాజరవుతుండగా మోరంపూడి సెంటర్ లో నిర్మించనున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి రోజా తో పాటు స్థానిక ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని భూమి పూజ చేశారు. అదేవిధంగా రాజమండ్రిలో చేపట్టనున్న పలు పర్యటకశాఖ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి రోజా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.