Konaseema News: కోనసీమలో ట్రాన్స్‌ఫార్మర్లకు రెక్కలు..! ఆక్వాచెరువులకు తరలిస్తున్నారని ఆరోపణలు
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల కాలంలో విద్యుత్తు శాఖలో ట్రాన్స్‌ఫార్మర్‌లకు రెక్కలొస్తున్నాయి.ఇటీవలే టిడ్కో కాలనీలో ఏడు ట్రాన్స్‌ఫార్మర్లు మాయం కాగా మరికొన్ని చోట్ల కనిపించకుండా పోయాయి.

Transformers Missing | అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల కాలంలో విద్యుత్తు శాఖలో ట్రాన్స్‌ఫార్మర్‌లకు రెక్కలొస్తున్నాయి.. అల్లవరం మండలం టిడ్కో భవన సముదాయంలో ఏకంగా 7 ట్రాన్స్‌పార్మర్లు మాయం అయ్యి విచారణ జరుగుతున్న సమయంలోనే మరికొన్ని చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు మిస్ అవ్వడం సంచలనంగా మారింది.
విపరీతంగా పెరిగిన ఆక్వా సాగు
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అనగానే ఇటీవల కాలంలో ఆక్వాసాగు విపరీతంగా పెరిగింది.. ముఖ్యంగా తీరగ్రామాల్లో అయితే ఈ సాగు వైపు అనేక మంది రైతులు మళ్లుతున్నారు..ఆక్వాసాగుకు ఖచ్చితంగా ఏరియేటర్లు అవసరం కాగా వాటిని తిప్పేందుకు, ఇతర నీటి అవసరాలకు విద్యుత్తు వినియోగం తప్పని సరి అయ్యింది.. దీంతో విద్యుత్తు శాఖ అధికారులకు ఈ పరిస్థితి వరంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ఆక్వా చెరువుల నిర్వహణకు ప్రభుత్వం రాయితీపై విద్యుత్తును అందిస్తుండగా అనధికార ఆక్వాసాగుకు నిభందనలు అడ్డంకిగా మారడంతో దొడ్డిదారిన కనెక్షన్లు పొంది ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈక్రమంలోనే ఆవాస ప్రాంతాల వద్దనున్న ట్రాన్సఫార్మర్లను సైతం మాయం చేసి గుట్టుచప్పడు కాకుండా ఆక్వా చెరువుల వద్ద లక్షల రూపాయలు తీసుకుని అడ్డగోలుగా ఏర్పాటు చేస్తున్నారని ట్రాన్స్‌ఫార్మర్లు మాయం అయిన కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు.
వెలుగులోకి వస్తున్న ట్రాన్స్‌ఫార్మర్లు బాగోతం..
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల కాలంలో విద్యుత్తు శాఖలో ట్రాన్స్‌ఫార్మర్‌లకు రెక్కలొచ్చి మాయం అవుతున్నాయని ఎవ్వరిని కదిపినా ఎటకారంగా మాట్లాడుతున్నారు..మరి ఏమయ్యుంటాయి..? అని ప్రశ్నిస్తే కంచే చేను మేస్తొందేమో అని సమాధానం చెబుతున్నారు.. ఇలా విద్యుత్తు శాఖల్ మాత్రం అవినీతి అల్లవరం మండలం టిడ్కో భవన సముదాయంలో ఏకంగా 7 ట్రాన్స్‌పార్మర్లు మాయం అయ్యి విచారణ జరుగుతున్న క్రమంలోనే అమలాపురం పట్టణానికి ఆనుకుని ఉన్న అబ్బిరెడ్డి కాలనీలో ట్రాన్స్‌కో సబ్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న కాలనీలో 40 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ మాయం అవ్వడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సుమారు 6 నెలలు పాటు ఇక్కడ ట్రాన్స్‌ఫార్మర్ మాయం అవ్వగా ఇటీవలే స్థానికంగా ఉన్న జనసేన వార్డు మెంబర్ చందాల సతీష్ కు అనుమానం రావడంతో స్థానిక లైన్‌మేన్ పి.శ్రీనివాసరావును ఆరా తీయగా నీళ్లు నమిలాడని, ఆతరువాత తేరుకుని ఏఈ సుగుణ తీసి వేరే చోట వేయమంటే వేశామని చెప్పుకొచ్చాడని ఆయన తెలిపాడు. ఇదే తరహాలో పలు చోట్ల గుట్టు చప్పుడు కాకుండా తీసివేసి వేరేచోటుకు తరలించినట్లు ట్రాన్స్ కో సిబ్బందిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
ఇంతకీ ట్రాన్స్ ఫార్మర్లు ఏమైనట్లు..
ఇటీవల కాలంలో ట్రాన్స్‌ఫార్మర్ల కొరత తీవ్రంగా ఉండడంతో ఆవాస ప్రాంతాలనుంచి ఆక్వాచెరువుల వద్దకు గుట్టుచప్పుడు కాకుండా మార్చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వీటిని ఆక్వా అవసరాలకు తాత్కాలికంగా తరలించుకుపోతున్నారని, ఈ చర్యల వల్ల విద్యుత్తుశాఖ అధికారులకు, సిబ్బందికి లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లవరం మండలం బోడసకుర్రు టిడ్కో భవన సముదాయంలో ఏకంగా ఏడు 5 స్టార్ రేటింగ్ కలిగిన ట్రాన్స్‌ఫార్మర్లను గుట్టు చప్పుడు కాకుండా తరలించుకుపోయి వాటి స్థానంలో కాలం చెల్లిన ట్రాన్స్‌ఫార్మర్లను పెట్టారని, దీనిపై అధికారుల విచారణ ఇప్పటికీ నిగ్గు తేలడం లేదు.
సరిగ్గా అబ్బిరెడ్డివారి కాలనీలో 40 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ కూడా పక్కాగా ఆక్వా చెరువుల వద్దకే తరలించుకుపోయారని, ఈ విషయం బట్టబయలవ్వడం వల్లనే కొత్త కథలకు తెరలేపుతున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. అయితే విద్యుత్తుశాఖ అధికారులు మాత్రం వేరే చోట లో వోల్టేజీ సమస్యలున్న చోట ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేశామని చెప్పుకొస్తుండగా అవి ఎక్కడ ఏర్పాటు చేశారో తెలపాలని అడుగుతుంటే మాత్రం నీళ్లు నములుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. త్వరగా విచారణ చేసి ట్రాన్స్‌ఫార్లర్లు తిరిగి ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.





















